
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 4 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 15 రోజులపాటు ఉభయ సభల కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు గురువారం ఆయన తెలిపారు. పార్లమెంటు వ్యవహారాలు, ఇతర అంశాలపై అమృత్‌కాల్‌లో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ యాక్టులను మార్చుతూ ప్రతిపాదించిన బిల్లులపై సమావేశాల్లో చర్చ జరగవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఈ మూడు నివేదికలను హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఎన్నికల కమిషనర్ల బిల్లు కూడా ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఇటీవల ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా, ఫోన్లను హ్యాక్ చేస్తారని ఐఫోన్ అలర్ట్ మెసేజ్ వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానుండగా, 4 నుంచి సమావేశాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.