
దేశంలో 90 శాతంగా ఉన్న పేదల నుంచి పరోక్ష పన్నుల రూపంలో (జిఎస్టీ ద్వారా) పెద్ద మొత్తంలో రాబట్టుకుని, కార్పొరేట్లకు ఏటా 12 లక్షల కోట్ల రాయితీలు, రుణ బకాయిల మాఫీ రూపంలో దోచిపెడుతోంది. ఈ వాస్తవాలను దాచి పెట్టి ఆదాయ పన్నుదారుల వల్లే సంపద పెరిగిపోతున్నట్లు చెప్పడం మోసపూరితం కాదా? ప్రజలకు నిజాలను చెప్పకపోతే చెప్పకపోవచ్చు. కానీ, అబద్ధాలను అర్ధ సత్యాలను ఇలా ప్రచారంలో పెట్టడం ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది.
పన్ను చెల్లింపుదారుల సగటు ఆదాయం రూ.13 లక్షలకు పెరిగిందంటూ ఎస్‌బిఐ రిసెర్చి విభాగం ఇటీవల ఇచ్చిన నివేదిక భారత దేశంలో అసంఖ్యాక ప్రజానీకం ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితికి కొత్త ముసుగు తొడిగేలా ఉంది. ప్రభుత్వ గణాంక సంస్థలు, సర్వేలు వాస్తవాలను వెల్లడిస్తే వాటి అధిపతులపై ప్రభుత్వం వేటు వేస్తున్న స్థితిలో ఈ నివేదిక విశ్వసనీయత ఎంత అనేది పక్కన పెడితే, కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి ప్రచార బాకాలుగా మారిన మీడియాలోని ఒక సెక్షన్ ఈ నివేదికను చూపి దేశం వెలిగిపోతోందన్నట్లుగా సంబరపడిపోవడమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటే సరే అనుకోవచ్చు. కానీ, ప్రజల పక్షాన నిలవాల్సిన ఓ ప్రముఖ తెలుగు పత్రిక దీనికి బాకా పడితే ఎలా? ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం కాదా? ఎస్‌బిఐ రిసెర్చి విభాగం నివేదిక అసమగ్రమైనది, పాక్షికమైనది. ఆర్థిక వ్యవస్థలో ఒక పార్శ్వాన్ని మాత్రమే అది చూపింది. ఇంకా అనేక పార్శాలు ఉన్నాయి. అందునా ఆ నివేదికలో వచ్చే రెండు మూడేళ్లకు అంచనాలు వేస్తే అదొక రకం. కానీ, ఏకంగా 2047లో పరిస్థితి గురించి ఇప్పుడు అంచనాలు వేయడంలో హేతుబద్ధత ఏమిటి? 2014 మదింపు సంవత్సరంలో ఒక్కో ఆదాయపు పన్ను చెల్లింపుదారు సగటు వార్షికాదాయం 4.4 లక్షలు కాగా 2023 నాటికి అది 13 లక్షలకు చేరిందని, 2047 నాటికి అంటే స్వతంత్ర భారత్ వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి 49.7 లక్షలకు చేరుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఒక్కొక్కరి తలసరి ఆదాయం అప్పటికి 14 లక్షలకు చేరుతుందని కూడా జోస్యం చెప్పింది. అల్పాదాయ వర్గాలు ఎగువ ఆదాయ వర్గాల కేటగిరి లోకి చేరడం వల్ల ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ లెక్కల కనికట్టుతో దేశ సంపద పెరిగిపోతుందన్న భ్రమలు కల్పించే యత్నం చేసింది. నిజానికి పెరిగిన ధరలతో పోల్చితే ప్రజల నిజ ఆదాయాలు పడిపోతున్నాయి. ఆకలి, పేదరికం, పోషకాహారం, డ్రాపవుట్లు, కొండలా పెరిగిపోతున్న అప్పుల మాటేమిటి ?
2023 ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 136 దేశాల్లో భారత్ 127వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ విషయంలో సబ్ సహరన్ ఆఫ్రికా దేశాల కన్నా వెనకబడి ఉంది. దేశంలో 58 శాతం మందికి ప్రధాన జీవనాధారంగా ఉన్న వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. రైతులు కనీస మద్దతు ధర లభించక ఆత్మహత్యలవైపు నెట్టబడుతున్నారు. భారత్‌లో పేదరికం 36 శాతం దాకా ఉందని ప్రపంచబ్యాంకు నివేదిక, పలువురు ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. మనకన్నా రెండు సంవత్సరాలు ఆలస్యంగా స్వాతంత్య్రం పొందిన చైనా 2021 ఫిబ్రవరి నాటికి పేదరికాన్ని పూర్తిగా పారదోలిన దేశంగా అవతరించింది.
దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల పరం చేసే నయా ఉదారవాద విధానాలు అమలులోకి వచ్చిన ఈ మూడు దశాబ్దాల కాలంలో పాక్షిక ఉపాధే తప్ప పూర్తి స్థాయి ఉపాధి ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవు. పోషకాహార లోపం, తలసరి కేలరీల లభ్యతలో భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున ఉంది. భారత్‌లో తలసరి కేలరీల వినియోగం 171 కిలోలు మాత్రమే. దక్షిణా ఫ్రికాలో ఇది 205 కిలోలు, చైనాలో 304 కిలోలు, రష్యాలో 407, అమెరికాలో 590 కిలోలుగా ఉంది. 2019-21 మధ్య ఆరోగ్య సూచీలో శిశు మరణాల రేటు, అయిదేళ్ల లోపు పిల్లలు బరువు తక్కువగా ఉండడం, రక్తహీనతతో 28 శాతం మంది ఇప్పటికీ బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడించినందుకు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్)కు చెందిన డైరక్టర్‌ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తొలగించింది. భారత్ బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మారిందని మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటనలోని డొల్లతనాన్ని బయటపెట్టినందుకు ఆ సంస్థ అధికారిపై వేటు వేసింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశాన్ని అప్పుల్లో ముంచేసింది. ఆ అప్పులకు వడ్డీ ప్రజల గోళ్లూడకొట్టి చెల్లించాల్సి వస్తుంది. అదీగాక దేశంలో 90 శాతంగా ఉన్న పేదల నుంచి పరోక్ష పన్నుల రూపంలో (జిఎస్టీ ద్వారా) పెద్ద మొత్తంలో రాబట్టుకుని, కార్పొరేట్లకు ఏటా 12 లక్షల కోట్ల రాయితీలు, రుణ బకాయిల మాఫీ రూపంలో దోచిపెడుతోంది. ఈ వాస్తవాలను దాచి పెట్టి ఆదాయ పన్నుదారుల వల్లే సంపద పెరిగిపోతున్నట్లు చెప్పడం మోసపూరితం కాదా? ప్రజలకు నిజాలను చెప్పకపోతే చెప్పకపోవచ్చు. కానీ, అబద్ధాలను అర్ధ సత్యాలను ఇలా ప్రచారంలో పెట్టడం ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది.
( ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ )