Oct 10,2023 07:07

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతుల నుండి బస్తా జీడి పిక్కలను రూ. 16,000కు ఆర్‌బికెల ద్వారా, ఏజన్సీ ప్రాంతాల్లో జిసిసి ద్వారా కొనుగోలు చేయాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులందరికీ ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణాలను ఇవ్వాలి. డి పట్టా, అటవీ హక్కు పత్రాలు కలిగినవారికి కూడా రుణాలివ్వాలి. బ్యాంకులు అంతగా చొరవ చూపకపోతే రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోనే వున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రుణం ఇప్పించాలి.

          గత ఏడాది కాలంగా వ్యాపారులు జీడి పిక్కలకు ధర దిగ్గోసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాలు, జిసిసి ద్వారా కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం. కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ కాష్యు అండ్‌ కోకో డెవలప్‌మెంట్‌ (2021-22) వారి ప్రకారం దేశంలో 11.84 లక్షల హెక్టార్లలో 7.52 లక్షల టన్నుల జీడి పిక్కలు పండుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో 1.98 లక్షల హెక్టార్లలో 1.28 లక్షల టన్నుల పిక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. సాంప్రదాయకంగా సముద్ర తీర ప్రాంతాల్లో జీడి సాగు ఎక్కువగా ఉండేది. అయితే, ఆ తరువాత గిరిజన ప్రాంతాల్లోనూ జీడి సాగు పెరిగింది. తీర ప్రాంతాల్లోని వెనుకబడిన తరగతులవారు, ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు, కొండవాలు, డి పట్టా భూముల్లో దళితులు ప్రధానంగా జీడి పంటపై ఆధారపడుతున్నారు. వారంతా పేద, మధ్యతరగతి రైతులే! జీడి పప్పు ప్రోసెసింగ్‌ పరిశ్రమలోనూ కేరళ తరువాతి స్థానం ఆంధ్రదే. కాబట్టి అటు రైతును, ఇటు కార్మికులను ఆదుకునేందుకు, అలాగే పరిశ్రమకు చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చెయ్యాలి. కాని ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేకపోవడం శోచనీయం.
 

                                                                          ధర లేక రైతు విలవిల

గతంలో 80 కిలోల బస్తా ధర రూ.15,000-18,000 ఉండగా రెండు మూడేళ్లుగా దిగజారుతూ ఇప్పుడు పాతాళానికి పోయి రూ.7,500 నుండి 8,000 మధ్య కొంటున్నారు. రైతుకు చేయూతనివ్వాల్సిన సర్కారు చోద్యం చూస్తోంది. 'విత్తు నుండి విక్రయం వరకూ అంతా ఆర్‌బికె ద్వారానే' అన్నది ప్రకటనలకే పరిమితంగా ఉంది. ఆర్‌బికెల ద్వారా బస్తా రూ. 16,000 చొప్పున కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం కదలడం లేదు. చాలా కాలం కిందట గిరిజన కార్పొరేషన్‌ కొనుగోలు చేసేది కానీ ఇప్పుడదీ ఏం చేయడం లేదు. జీడి రైతును వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి 'మాది రైతు ప్రభుత్వం' అని గొప్పలు చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికి తగదు. మరోవైపు ప్రోసెసింగ్‌ పరిశ్రమలను జులై నెలలో మూసివేసిన యజమానులు కార్మికులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు. అయినా ప్రభుత్వం పల్లెత్తు మాట్లాడకపోవడం అది ఎవరి పక్షాన ఉందో తేటతెల్లం చేస్తోంది.
 

                                                                     మోడీ పాలనలో కార్పొరేట్లకే లబ్ధి

మోడీ అధికార పీఠాన్నెక్కాక జీడి పరిశ్రమకు గడ్డు రోజులొచ్చాయి. ఆ సర్కారు వచ్చేనాటికి జీడి పిక్కలపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2018 ఫిబ్రవరి నుండి 2.5 శాతానికి తగ్గించారు. వివిధ సరుకులను దిగుమతి చేసుకునే సందర్భంలో అంతకన్నా తక్కువ ధరకు కొనరాదని నిబంధన ఉంది. కానీ 2023 ఫిబ్రవరిలో మోడీ సర్కారు దానిని కూడా సడలించి విచ్చలవిడి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచింది. ఈ మినహాయింపు కూడా సెజ్‌లలోని పరిశ్రమలకు కల్పించడంతో వారు చౌకగా భారీ దిగుమతులకు పాల్పడుతున్నారు. ఆ విధంగా కార్పొరేట్‌ కంపెనీలు చౌకగా దిగుమతి చేసుకొని ధరల ఒడుదుడుకులు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎగుమతి ప్రోత్సాహకం 5 శాతం ఉన్నదాన్ని 2.5 శాతానికి దిగ్గోసింది. మోడీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల మూలంగా చిన్న మధ్యతరగతి జీడి పరిశ్రమలు దివాలా తీసే పరిస్థితులేర్పడ్డాయి.
 

                                                                     కేరళ ప్రభుత్వ సానుకూల చర్యలు

కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పంట విస్తీర్ణం, దిగుబడి పెంచడానికి వివిధ చర్యలు, పథకాలు చేపట్టింది. జీడి పంట అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి బోర్డు పని చేస్తోంది. అలాగే పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు అంటే జీడి పిక్కలను రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో అలాగే విదేశాల నుండి కొనుగోలు చేసేందుకు ఒక కార్పొరేషన్‌, పరిశ్రమలను నిర్వహించడం, జీడిపప్పు మార్కెటింగ్‌ కోసం మరో రెండు వేర్వేరు కార్పొరేషన్లున్నాయి. అన్ని విధాలుగా ఆ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు చేదోడుగా నిలుస్తోంది. ప్రోసెసింగ్‌ పరిశ్రమల్లోని కార్మికులు చెల్లించాల్సిన ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. కేరళ జీడి కార్మికుల సంక్షేమ సహాయ నిధి చట్టం ఆ రాష్ట్రంలో ఉంది. దాని ద్వారా పింఛను సైతం లభిస్తుంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మూతబడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను తెరిచి లాభాల్లో నడపడమేగాక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎం.ఎస్‌.ఎం.ఇ) ప్రోత్సహించడంలో దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంది. ఆ క్రమంలోనే సహేతుక కారణాలతో ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం మూతబడిన జీడి ప్రోసెసింగ్‌లోని ఎం.ఎస్‌.ఎం.ఇ ల పునరుద్ధరణకు వివిధ రాయితీలిస్తోంది. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం రైతులను, కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను ప్రధానంగా చిన్న మధ్యతరగతి వారిని నిలబెట్టడానికీ కృషి చేస్తోంది.
 

                                                                        రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ?

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతుల నుండి బస్తా జీడి పిక్కలను రూ. 16,000కు ఆర్‌బికెల ద్వారా, ఏజన్సీ ప్రాంతాల్లో జిసిసి ద్వారా కొనుగోలు చేయాలి. గత ఏడాది పండిన జీడి పిక్కలు ఇంకా అమ్ముడు పోలేదు. మళ్లీ కొత్త పంటకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ఇతరత్రా పెట్టుబడులకూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు కుటుంబం గడవడమూ కష్టంగానే ఉంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం పంటను కొనుగోలు చేయడం లేదా బ్యాంకు రుణం ఇప్పించడమో జరగాలి. ఇందుకు ఇ-క్రాప్‌ బుకింగ్‌ నిబంధన ఉంది. ప్రస్తుతం గడువు దాటిపోయిందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచి ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేయించడంతోపాటు జీడికి పంటల బీమా వర్తింపజేయాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులందరికీ ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణాలను ఇవ్వాలి. డి పట్టా, అటవీ హక్కు పత్రాలు కలిగినవారికి కూడా రుణాలివ్వాలి. బ్యాంకులు అంతగా చొరవ చూపకపోతే రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోనేవున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రుణం ఇప్పించాలి.
            రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీడి కార్పొరేషన్‌ లేదా బోర్డును ఏర్పాటు చేసి కేరళ మాదిరిగా కృషి చేయాలి. దిగుమతి సుంకాన్ని తిరిగి 5 శాతం విధించేలా, ఎగుమతి రాయితీని గతంలో మాదిరి 5 శాతానికి పెంచేందుకు, ఎం.ఐ.పి అన్ని పరిశ్రమలకూ ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అటు రైతులకు, ఇటు కార్మికులకు శ్రేయోదాయకంగానూ జీడి పరిశ్రమ, వాణిజ్యం నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అయితే ఈ ప్రభుత్వం తనకు తానుగా ఏమీ చేయదు. రైతులు, కార్మికులు ఆయా సమస్యలపై ఐక్య ఉద్యమాలు సాగించి పాలకుల మెడలు వంచడమే మార్గం.

బి. తులసీదాస్‌