
సెప్టెంబరు 18 నుంచి ఐదు రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగే విషయం తెలిసిందే. అయితే సెప్టెంబరు 18 అనేది యాదృచ్ఛికం. కాదు. 1949లో సరిగ్గా అదేరోజు రాజ్యాంగ సభ సుదీర్ఘ చర్చ తర్వాత మన దేశం పేరును 'ఇండియా అనగా భారత్' అని రాజ్యాంగం లోని మొదటి అధికరణాన్ని ఆమోదించింది. ఇండియా, అనగా భారత్ రాష్ట్రాల సముదాయం అని చెబుతుంది రాజ్యాంగం లోని మొదటి అధికరణం. సెప్టెంబరు 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏళ్ల అనంతరం సరిగ్గా అదేరోజు రాజ్యాంగసభ నిర్ణయాన్ని తిరగరాయాలనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది. 'బిజెపి ప్రభుత్వం చెప్పేది ఒకటి. చేసేది మరొకటి' అని అందరికీ తెలుసు. ఒక దేశం ఒక ఎన్నిక, అదే జమిలి ఎన్నికలు నినాదం కొన్నాళ్ళు తెర మరుగై మళ్లీ హఠాత్తుగా తెర మీదకి తేవటం వెనుక ఒక వ్యూహం వున్నట్లు తెలుస్తుంది. ప్రజల దృష్టిని జమిలి ఎన్నికల అంశం మీదకి మరల్చి, ఆ అంశం మీద అందరూ తర్జనభర్జన పడుతుండగా, పెద్దగా చర్చలేకుండా దేశం పేరు ఇండియా బదులు భారత్‌గా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రక్రియకి సెప్టెంబర్ 18ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఆరోజు మొదలవటం వెనుక ఆంతర్యం అదే అనిపిస్తుంది.
అయితే, దీనికి అసలు కారణం ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే శబ్దం వచ్చే విధమైన పేరు పెట్టటమే అయినా అది పైకి అనకుండా ఇండియా అనే పేరు వలసవాదుల వారసత్వానికి చిహ్నంగా వుందని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇది సహేతుకమైన వాదన కాదు. క్రీస్తు పూర్వం గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు రాసిన ఇండికా గ్రంథం ఇండియా అనే పేరుకు తొలి ఆధారాల్లో ఒకటి. అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఐరోపాకు మన దేశం ఇండియా అనే తెలుసు. ఇండియా అనేది ఇంగ్లీషు పాలకులు ఇచ్చిన పేరు కాదు. ఇంగ్లీషు వారు మన నేలమీద అడుగు పెట్టక మునుపే వాస్కోడగామా ఇండియాకి సముద్ర మార్గం కోసం బయలుదేరాడు. అంతకు మునుపు కొలంబస్ కూడా అదే పనిమీద బయల్దేరి అమెరికాను కనుగొన్నాడు. వారికి ఇది భారతదేశం అని అస్సలు తెలియదు.
అయితే, పేరు మార్పేనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా అనేది చెప్పలేం. ఇప్పటికీ ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకి ఎజెండాను వెల్లడించలేదు. పార్లమెంటును సమావేశపర్చటంలో ప్రభుత్వం అసలు ఉద్దేశం దేశం పేరు ఇండియా బదులు భారత్‌గా మార్చటమనే వార్తలు వినిపిస్తున్నాయి. జి-20 నేతలకు రాష్ట్రపతి ఇచ్చే విందుకు ముద్రించిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వుండటం, జి-20 సమావేశంలో మన ప్రధాన మంత్రి కూర్చున్నచోట నేమ్‌ప్లేట్ మీద ఇండియా అని కాకుండా భారత్ అని వుండటాన్ని బట్టి...బహుశా అది నిజమే అయి వుండవచ్చు.
దేశం పేరు మార్పు అనేది ఆషామాషీ విషయం కాదు. దేశం పేరు మార్చే ముందు దేశ ప్రజలను అడగరా? పాలకుల ఇష్టాయిష్టాలకే పరిమితమా? కేవలం పార్లమెంటు ఆమోదం పొందితే సరిపోతుందా? అదీ సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలల లోపు వుండగా? దేశం పేరు మారితే అధికారపూర్వక పేర్లలో ఇండియా వున్న చోటల్లా దానిస్థానంలో భారత్ ను చేర్చాల్సి వుంటుంది. దేశం పేరు ఇండియా అయినప్పుడు, మనం ఇండియన్స్‌గా చెబుతాము ప్రపంచానికి. దేశం పేరు భారత్ అయితే ప్రజల నేషనాలిటి ఏమి వుండాలి? మన దేశంలోనే వివిధ భాషల్లో పలు విధాలుగా అంటారు. తెలుగులో మనం భారతీయులం అనుకుంటాం. మరి తమిళంలో, మళయాళంలో, కన్నడంలో ఎలా అంటారు? ఇహ దేశం బయట ఏమని చెప్పాలి? భారత్ అనే దేశం పేరుతో పాటు మన నేషనాలిటీకి కూడా ఒక కామన్ పదాన్ని కనిపెట్టాలి. 'భారత్ కా ఆద్మీ' లేక భారత్‌వాలా అంటే సరిపోతుందా? అది ఏ భాషాపదమై వుండాలి? హిందీ మాటైతే సరిపోతుందా? ఇంగ్లీషు లాగ హిందీ కామన్ భాష అన్న స్టేటస్‌కి ఇంకా ఎదగలేదు. మరి తమిళులు హిందీ మాటను ఒప్పుకుంటారా ?
అనేక క్లిష్టమైన అంశాలు ఇమిడి వున్నాయి దేశం పేరు మార్పులో. రూ.వేల కోట్ల ధనం ఖర్చు చెయ్యాలి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యటానికి. పైగా ఇందుకు దీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పేరుతో ఎంతో గౌరవ ప్రపత్తులు సంపాయించుకున్న సంస్థలు, కొత్త పేరుతో అదే గౌరవ ప్రపత్తులు తిరిగి పొందాలంటే ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి వుంటుంది. శ్రమించినా తిరిగి అదే గౌరవం పొందగలరన్న భరోసా ఏదీ లేదు. ఇది ఒక మతిలేని ఆలోచనగా కనిపిస్తుంది దేశ ప్రజలకు. కానీ, ఇది ఎవరి ఆలోచన? రావణాసురుడికి పది తలలు వున్నట్లు, సంఫ్‌ుపరివార్‌కి గూడా అనేక తలలు వున్నాయి: ఆర్.యస్.యస్, బిజెపి, మోడీ అమిత్ ద్వయం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్‌దళ్, సాధువుల సమ్మేళనం, సన్యాసుల మఠం, అదానీ అంబానీ ద్వయం... గట్రాగట్రా అన్నీ సంఫ్‌ు పరివార్ తలలే. ఏ తలలోంచి ఏ 'సనాతన ధర్మపు' ఆలోచన ఉద్భవించునో ఎవరు చెప్పగలరు?
దేశం పేరు భారత్‌గా మార్చినదే తడవుగా సంఫ్‌ు పరివార్ 'భారత్ మాతాకీ జై' అని అరుస్తూ ఇదే దేశభక్తికి నిదర్శనం అనే ప్రమాదం పొంచివుంది. దేశభక్తిని మతపరమైన కోణంలో చూడటంలోని ఔన్నత్యాన్ని అందరూ ప్రశ్నించాలి. అనేక మత విశ్వాసాల ప్రజలు సహజీవనం చేస్తున్న ఈ భూమిని హిందూ మతవాదుల కోణంలోనే చూడడం లౌకికవాదానికి విఘాతమేకాక భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్నే పెను ప్రమాదంలోకి నెట్టే అపాయాన్ని కొట్టిపారవేయలేం. పరిపాలనకు ప్రాతిపదిక సనాతన ధర్మమా లేక ఆధునిక భావజాలమా అనేది దేశ ప్రజలే తేల్చవలసిన సమయం ఇది.
దేశం పేరు మార్పు అనేది చిన్న విషయం కాదు. కానీ, పార్లమెంటు ఆమోదం పొందకుండానే కొత్త పేరు వాడటం, అదీ అంతర్జాతీయ వేదికల మీద, అంటే ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ సంప్రదాయాల పట్ల మన పాలకులకు ఏమాత్రం గౌరవం వుందో తెలుపుతుంది. కీలకమైన అంశాల మీద దేశ ప్రజలు ఆలోచించి అవగాహన చేసుకోవటానికి తగినంత సమయం ఇవ్వకుండా వడివడిగా హడావుడిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మోడీ ప్రభుత్వ పనితీరు. నోట్ల రద్దు, లాక్‌డౌన్, ఆర్టికల్ 370 రద్దు ఇందుకు మచ్చుతునకలు.
నేడు దేశం అనేక రంగాల్లో ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో వాటిని వదిలి దేశం పేరు మార్చటమేంటి? మార్చాల్సింది దేశం పేరునా, దేశ ప్రజల తలరాతనా? ఇదంతా పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దష్టి మరల్చడానికేమో అనే సందేహమూ కలుగుతుంది. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ ధోరణిని కట్టడి చెయ్యటానికి న్యాయ వ్యవస్థ సిద్ధంగా లేకపోవటం, మీడియా స్వతంత్రంగా వ్యవహరించ లేకపోవటం, మేధావులు అభద్రతా వాతావరణంలో అచేతనంగా వుండటం కారణాలు. ఎన్నికలు ప్రజలకున్న ఒక ఆయుధం. ఈ ఆయుధం ప్రజాస్వామ్యం బలపడేందుకు దోహదపడాలి. మంచి జరుగుతుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త లోక్‌సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్)
గుమ్మడిదల రంగారావు