* జిల్లాలో పలుచోట్ల అధిక ధరలకు ఎరువుల విక్రయాలు
* గడ్డి మందు కొంటేనే యూరియా
* పలువురు వ్యాపారుల షరతులు
* తనిఖీలు మరిచిన వ్యవసాయశాఖ అధికారులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి / బూర్జ: బూర్జ మండలం డొంకలపర్తకు చెందిన బి.సూర్యనారాయణ మూడు ఎకరాల్లో వరి వేశాడు. యూరియా కోసం రైతుభరోసా కేంద్రానికి వెళ్లి ఎరువులు అడగ్గా లేవన్నారు. దీంతో కురిమిపేటలోని ఒక ఎరువుల దుకాణం దగ్గరకు వెళ్లాడు. బస్తా రూ.330 చొప్పున ఎనిమిది బస్తాలు కొనుగోలు చేశాడు. రైతు భరోసాలో యూరియా లభ్యమై ఉంటే బస్తా రూ.270కే దొరికేది.
ఇదే మండలం బువ్వపేటకు చెందిన రైతు మన్మథరావుకూ ఇదే అనుభవం ఎదురైంది. యూరియా కోసం బూర్జ వెళ్లాడు. బస్తా రూ.270కు దక్కాల్సిన యూరియాను రూ.330కు కొనాల్సి వచ్చింది. పైగా గడ్డిమందు కొంటే గానీ యూరియా ఇవ్వబోమని వ్యాపారులు చెప్పడంతో, చేసేది లేక అవసరం లేకపోయినా మందును కొనుగోలు చేశాడు.
ఎరువులను ప్రయివేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి రావడం, డీలర్లు అధిక ధరలకు విక్రయించడం ఈ మండలానికే పరిమితం కాలేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు సుమారు 2.60 లక్షల ఎకరాలకు పైగా పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 2.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఖరీఫ్ అవసరాలకు జిల్లాకు 54 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అందులో ఇప్పటివరకు 38 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ప్రయివేట్ డీలర్లకు ఇచ్చారు. జిల్లాలో ఉన్న 596 ఆర్‌బికెలకు 19,900 మెట్రిక్ టన్నులు ఇవ్వగా, మిగిలిన 18,100 మెట్రిక్ టన్నులను ప్రయివేట్ డీలర్లకు ఇచ్చారు. జిల్లాలో ఆరుగురు హోల్‌సేల్ డీలర్లు ఉన్నారు. రిటైల్ వ్యాపారులు 250 మంది వరకు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. అనుమతులు లేకుండా దొంగచాటుగా విక్రయాలు సాగిస్తున్న వారు సుమారు 600 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. హోల్‌సేల్, రిటైల్ డీలర్ల నుంచి సరుకును తెచ్చి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. హోల్‌సేల్ వ్యాపారులు కొంత అదనంగా ధర వేసుకుని రిటైల్, ఇతర వ్యాపారులకు ఇస్తున్నారు. వీరు దానికి అదనంగా మరింత లాభం కలుపుకొని రైతులకు అమ్ముతున్నారు. వ్యాపారులు తెచ్చిన సరుకు కొన్నిచోట్ల అమ్ముడుపోకపోవడంతో ఎరువుల అమ్మకాలను గడ్డి, పురుగుమందులను అంటగడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు?
ఎరువుల అమ్మకాలకు సంబంధించి వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎరువులు అధిక ధరలకు విక్రయించడం ప్రతి ఏడాదీ జరుగుతున్నదే అంటూ చాలా తేలిగ్గా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులు అధిక ధరలకు విక్రయించడం, అనుమతించిన దానికంటే అధిక మొత్తంలో నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు, వ్యాపారుల జోలికే వెళ్లడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఒక మండలంలోని వ్యవసాయశాఖ అధికారులు వేరే మండలానికి వెళ్లి తనిఖీలు చేసేలా కమిటీలు ఏర్పాటు చేసినా, ఎక్కడా తనిఖీలు నిర్వహించిన పాపాన పోలేదు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లోనూ కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించినా వ్యవసాయశాఖ అధికారులు స్పందించడం లేదు. దీంతో వ్యాపారుల చెప్పిందే ధరగా నడుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి ఎరువుల ధరలను నియంత్రించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
హోల్‌సేల్ దుకాణాల నుంచి రిటైల్ షాపులకు పంపిణీ సందర్భంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అనుమతులు లేకుండా ఎరువులను విక్రయించకూడదు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎరువుల దుకాణాల్లో తనిఖీల కోసం కమిటీలు నియమించాం. గడ్డి, పురుగుమందులను రైతులు ఒప్పుకుంటే ఇవ్వాలని చెప్పాం. బలవంతంగా కట్టబెట్టొద్దని సూచించాం.
- కె.శ్రీధర్,
వ్యవసాయశాఖ జెడి










