May 04,2023 06:38

మోడీ ప్రభుత్వం రాష్ట్రాలపై రుద్దుతున్న విధానాలలో భాగంగా రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్‌) కింద రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 1 కోటి 89 లక్షల వ్యవసాయేతర విద్యుత్‌ సర్వీసు కనెక్షన్లకు ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను దశల వారీగా మార్చి 20 - 25 నాటికి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మీటర్లకయ్యే ఖర్చు రూ.13,252 కోట్లను విద్యుత్‌ వినియోగదారుల నుండి వసూలు చేస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ప్రకటించారు. ఈ మీటర్లను ఏర్పాటు చేస్తే ఆర్‌డిఎస్‌ఎస్‌ కింద కేంద్రం 15 శాతం మొత్తాన్ని లేదా మీటరుకు రూ. 900 చొప్పున ఏది తక్కువైతే అది గ్రాంట్‌ ఇవ్వచూపింది. వచ్చే డిసెంబరు నాటికి ఈ మీటర్లను ఏర్పాటు చేస్తే మరో 7 శాతం మొత్తాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని ఈ కార్యక్రమాన్ని చాలా వేగంగా పూర్తి చేయించేందు కేంద్రం ఎరవేసింది. స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలన్న కేంద్ర విద్యుత్‌ అధారిటీ (సిఇఎ) నిబంధనలు, అర్‌డిఎస్‌ఎస్‌ షరతులు కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగాలే. పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చి, మొత్తం ప్రసార, వాణిజ్య (ఎటిసి) నష్టాలను 12-15 శాతానికి తగ్గించటం విద్యుత్‌ను వినియోగదారునికి సరఫరా చేసేందుకు అయ్యే వాస్తవ వ్యయానికి (ఎసిఎస్‌), డిస్కాంల మొత్తం ఆదాయ అవసరానికి (ఎఆర్‌ఆర్‌) మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించి వేయటం ఈ పథకం లక్ష్యాలుగా పేర్కొన్నారు.
డిస్కాంలు వసూలు చేయాల్సిన విద్యుత్‌ బిల్లుల బకాయిలను బట్టి ఎటిసి నష్టాలనబడే వాటిని లెక్కగట్టటం బోగస్‌ వ్యవహారం. బకాయిలంటే అవి రాబట్టాల్సిన ఆదాయం అవుతుంది తప్ప, ఎటిసి నష్టాలనబడేవిగా ఉండవు. పంపిణీ నష్టాలలో సాంకేతిక పరమైన నష్టాలు, వాణిజ్యపరమైన నష్టాలుగా పరిగణించబడే విద్యుత్‌ చౌర్యం, అక్రమ వినియోగం ఉంటాయి. ఎ.పి ట్రాన్స్‌కో, డిస్కాంలు ప్రసార పంపిణీ వ్యవస్థలను పటిష్టపరిచి, అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు ప్రతి ఏటా చర్యలు తీసుకొంటున్నాయి. ఈ చర్యలకు ప్రత్యేకంగా షరతుల అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1990 దశకం మధ్యలో 38 శాతంగా ఉన్న ప్రసార, పంపిణీ నష్టాలు క్రమేణా తగ్గుతూ రాష్ట్రంలో ప్రస్తుతం రెండంకెల లోపుకు చేరాయి. ఈ నష్టాల తగ్గింపుకు, ప్రీపెయిడ్‌ మీటర్లకు సంబంధం లేదు. ప్రసార, పంపిణీ వ్యవస్థలలో..సాంకేతికపరమైన లోటుపాట్లను, విద్యుత్‌ చౌర్యం, అక్రమ వినియోగాలను నివారించేందుకు దశాబ్దాల తరబడి తీసుకొంటున్న చర్యల వల్లనే ప్రసార, పంపిణీ నష్టాలు ప్రస్తుత స్థాయికి తగ్గాయి. విద్యుత్‌ సరఫరా నాణ్యత మెరుగుపడుతూ వస్తున్నది. ఈ దిశలో అవసరమైన చర్యలను కొనసాగించాలి.
ఎసిఎస్‌కు, ఎఆర్‌ఆర్‌కు మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించి వేయటం అంటే, విద్యుత్‌ కొనుగోలు నుండి వినియోగదారులకు సరఫరా చేసే వరకు అయ్యే పూర్తి వ్యయాన్ని విద్యుత్‌ సంస్థల అనుమతించబడిన లాభాలతో సహా వసూలు చేయటం ప్రభుత్వమిచ్చే సబ్సిడీని పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ నియంత్రణ కమిషన్లు ఎఆర్‌ఆర్‌ను, ఇతర ఆదాయాలను, చార్జీలను నిర్ణయిస్తున్నది డిస్కాంలకు అనుమతించదగిన ఆదాయం లభించేందుకే. ప్రీపెయిడ్‌ మీటర్లకు దీనికి సంబంధం లేదు. ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేస్తే బకాయిలు ఉండవని ఒక వాదన. ఎపిఇఆర్‌సి 2004 నాటి 6వ నంబరు రెగ్యులేషన్‌ ప్రకారం డిస్కాంలు విద్యుత్‌ సర్వీసు కనెక్షన్లు ఇచ్చేటపుడే సెక్యూరిటీ డిపాజిట్‌గా రెండు, మూడు నెలల చార్జీల మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. విద్యుత్‌ బిల్లులను నిర్ణీత గడువులో చెల్లించకపోతే, రెండు వారాల తరువాత సర్వీసు కనెక్షన్లను తొలగిస్తున్నాయి. సెక్యూరిటీ డిపాజిట్‌ ఉన్నందున, అందులో బకాయిలు సర్దుబాటు అవుతాయి. బకాయిలు చెల్లించాకే సర్వీసు కనెక్షన్‌ను పునరుద్ధరించాలి. ప్రభుత్వేతర వినియోగదారుల విషయంలో డిస్కాంలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. బకాయిలున్న ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్థానిక సంస్థల వంటి వాటికి డిస్కాములు, సర్వీసు కనెక్షన్లను తొలగించలేక పోతున్నాయి. ప్రీపెయిడ్‌ మీటర్లను పెట్టినా, సకాలంలో చెల్లింపులు చేయకపోతే వాటికి డిస్కాంలు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తాయని, నిలిపి వేయకుండా వా టిపై ఒత్తిడి ఉండదని గ్యారంటీ లేదు.
ప్రైవేటు టెలికాం సంస్థలు ప్రీపెయిడ్‌ ఏర్పాటును తమ వినియోగదారులకు అమలు చేస్తున్న విధంగానే విద్యుత్‌ పంపిణీలో కూడా ఏర్పాటు చేయవచ్చుననేది ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు మద్దతుదారుల వాదన. టెలికాం సంస్థలు నిర్ణీత ఛార్జీల మొత్తం ముందస్తు చెల్లింపుతో నిర్ణీత కాలపరిమితిలో వినియోగదారులు ఎన్ని కాల్స్‌ అయినా చేసుకొనే విధానాన్ని అమలు చేస్తున్నాయి. పోస్ట్‌ పెయిడ్‌ విధానంలో కూడా వినియోగదారు చేసుకున్న కాల్స్‌ సంఖ్యను బట్టి ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఏ పద్ధతిని ఎంచుకోవాలనేది వినియోగదారుని ఇష్టం. విద్యుత్‌ పంపిణీలో ప్రీ పెయిడ్‌ ఏర్పాటు కింద నిర్ణీత మొత్తం చెల్లింపుతో నిర్ణీత కాలంలో ఎన్ని యూనిట్ల విద్యుతనైనా వినియోగించుకునే అవకాశం లేదు. ప్రీ పెయిడ్‌ అయినా పోస్ట్‌ పెయిడ్‌ అడగా, వాడుకున్న యూనిట్లన్నిటికీ చార్టీలు చెల్లించాల్సిందే. అందువల్ల టెలికాం, విద్యుత్‌ పంపిణీ విధానాల మధ్య పొంతన లేదు.
డిస్కాంలు పిపిఎల కింద జనరేటర్ల నుండి కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు నెల రోజుల తరువాత చెల్లింపులు చేస్తున్నాయి. అంతకన్నా ముందే చెల్లిస్తే రిబేటు కూడా పొందుతున్నాయి. ప్రస్తుత విధానంలో డిస్కాంలు ఒక నెల విద్యుత్‌ వినియోగానికి నెలాఖరుకు వినియోగదారుకు బిల్లు ఇచ్చి చెల్లింపుకు 14 రోజుల గడువు ఇస్తున్నాయి. బిల్లు చెల్లింపు ఆలస్యమైతే జరిమానా కూడా వసూలు చేస్తున్నాయి. ఛార్జీల రూపంలో, ట్రూఅప్‌ క్లెయిముల కింద డిస్కాంలు అనుమతించదగిన లాభాలతో సహా తమ వ్యయాన్నంతా వినియోగదారుల నుండి రాబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టి వినియోగదారుల నుండి ముందస్తుగా చార్జీలను వసూలు చేయడం నిర్హేతుకం.
ఆర్‌డిఎస్‌ఎస్‌ లక్ష్యాలుగా మోడీ ప్రభుత్వం పైకి ఏం చెబుతున్నప్పటికి, సంస్కరణలనబడే వాటి పేరుతో విద్యుత్‌ పంపిణీని (ప్రైవేటుపరం చేసేందుకు, నేరుగా సబ్సిడీ బదిలీ (టిబిటి) పథకం అమలుకు ప్రతిపాదిస్తున్న చర్యల నేపథ్యంలో ప్రీపెయిడ్‌ మీటర్ల ఎర్పాటును చూడాలి. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు, ప్రైవేటు ఆపరేటర్లు తమకిష్టమైన ప్రాంతంలో విద్యుత్‌ పంపిణీ చేపట్టి, పంపిణీ వ్యవస్ధను డిస్కాంలకు అద్దె చెల్లించి వాడుకోవచ్చు. ఆ విధంగా ప్రైవేటు, ఆపరేటర్లు తమ స్వంత పంపిణీ వ్యవస్థకోసం, దాని నిర్వహణకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు. విద్యుత్‌ పంపిణీలోకి ప్రైవేటు పెట్టుబడిదారులను ఈ విధంగా అనుమతించటమంటే తమ పంపిణీ వ్యవస్థను వారికి అద్దెకు ఇచ్చి, తామే ఆ వ్యవస్థను నిర్వహించాలని డిస్కాంలను మొరటుగా ఒత్తిడి చేయటమే. ఆ విధంగా డిస్కాములు తమకు పోటీదారులుగా ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించి, తమకు క్రాస్‌ సబ్సిడీ లభించే హెచ్‌టి పరిశ్రములు, వాణిజ్య సంస్థలను వినియోగదారులుగా కోల్పోయి, తమ వ్యాపారాన్ని దెబ్బతీసుకుని బలహీనమవటమే. ప్రైవేటు కంపెనీల వ్యవస్థలను, ఉదాహరణకు ప్రైవేటు టెలికాం కంపెనీల వ్యవస్థలను ఇతరులు ఈ పద్ధతిలో వినియోగించుకునేందుకు ఇలాంటి తుగ్లక్‌ విధానాన్ని మోడీ ప్రభుత్వం అనుమతిస్తుందా?
ఒక పక్క తమ స్వంత పంపిణీ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణకు పెట్టుబడి పెట్టనవసరం లేకపోవటంతో పాటు, ప్రైవేటు విద్యుత్‌ పంపిణీదారులు వినియోగదారుల నుండి ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుతో ముందుగా వసూలు చేసుకునే చార్జీల మొత్తాలతోనే వర్కింగ్‌ కాపిటల్‌ అవసరం లేకుండా విద్యుత్‌ కొనుగోలు చేసుకునేందుకు, పంపిణీ వ్యవస్థను వాడుకొన్నందుకు డిస్కాంలకు అద్దె చెల్లించటానికి వీలవుతుంది. ఈ మొత్తం ఏర్పాటును ప్రైవేటు విద్యుత్‌ పంపిణీదారుల పబ్బం గడపటానికి మోడీ ప్రభుత్వం ముందుకు తెస్తున్నది.
ప్రీపెయిడ్‌ మీటర్ల కొనుగోలుకు కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారమే బిడ్లు పిలుస్తామని డిస్కాంలు చెబుతున్నాయి. బిడ్‌ షరతులను తొత్తడం చేసి తమకు కావాల్సిన ఆశ్రిత పెట్టుబడిదారులకు ఆర్డర్లు, అనుమతులు ఇవ్వటం కేంద్రానికి, రాష్ట్రానికి, వాటి సంస్థలకు వెన్నతో పట్టిన విద్య. ప్రీపెయిడ్‌ మీటర్ల కొనుగోలుకు, వాటి నిర్వహణకు డిస్కాంలు ఏ విధంగా టెండర్లను పిలుస్తున్నాయో, ఎలా సరఫరాదారులను ఎంపిక చేస్తున్నాయో రహస్య వ్యవహారంగా తయారవుతున్నది. టెండర్లు వేయటానికి ముందు జరిపే సమావేశాలకు ఎన్ని సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారో, టెండర్లు వేయకుండా ఎంతమంది ఒత్తిడికి గురవుతున్నారో కూడా వెల్లడి కావటం లేదు. ప్రీపెయిడ్‌ మీటర్ల కొనుగోలుకు, నిర్వహణకు చాలా అధిక మొత్తాలకు టెండర్లను ఖరారు చేస్తున్నారని ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రీపెయిడ్‌ మీటర్ల కొనుగోలు, నిర్వహణకు వేల కోట్లు రూపాయలను ఖర్చు చేయటం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటమే. విద్యుత్‌ వినియోగదారులు ఇప్పటికే ఉన్న మీటర్ల ఖర్చును భరించారు. ప్రీపెయిడ్‌ మీటర్ల, వాటి నిర్వహణ ఖర్చును ప్రత్యక్షంగా, పరోక్షంగా వినియోగదారులపై మోపడం వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా అనవసర భారాన్ని మోపడమే. ప్రీపెయిడ్‌ మీటర్ల కొనుగోలు, నిర్వహణ వాటి ఉత్పత్తిదారులు, కొనుగోలుదారుల పబ్బం గడపటానికి ఒక మార్గం.
ప్రీపెయిడ్‌ మీటర్ల కింద చెల్లింపులకు వినియోగదారులు ఇబ్బందులకు గురవుతారు. నెలలో ఎప్పుడు ఎంత మొత్తం ఏ పద్ధతిలో చెల్లించాలనేది ఇబ్బందికరం అవుతుంది. కట్టిన మొత్తానికి సరిపడా విద్యుత్‌ వినియోగం జరిగాక, సకాలంలో దానిని గమనించి తదుపరి మొత్తాన్ని చెల్లించలేకపోతే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులకు గురవుతారు. ప్రీపెయిడ్‌ మీటర్ల వల్ల వినియోగదారులు తమ విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించుకుని ప్రయోజనం పొందుతారని ఈ ఏర్పాటు మద్దతుదారులు వెకిలి వాదనలు చేస్తున్నారు. చార్జీల ట్రూఅప్‌, ఇతర భారాలతో సతమతమవుతున్న విద్యుత్‌ వినియోగదారులు ఇప్పటికే తమ విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించుకుంటు న్నారు. వినియోగదారుల అవసరం, చెల్లించగలిగే స్థోమతను బట్టి విద్యుత్‌ వినియోగం ఉంటుంది తప్ప ప్రీపెయిడ్‌ మీటర్లపై ఆధారపడి ఉండదు.
డిస్కాంలకు సబ్సిడీ బకాయిలు పెడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం (గతంలో టిడిపి ప్రభుత్వం) ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుకు రాజును మించిన రాజభక్తి పరాయణత్వంతో మోడీ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గటం శోచనీయం. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్థానిక సంస్థలు సకాలంలో విద్యుత్‌ బిల్లులను చెల్లించేటట్లు చేయటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నది. అలా బకాయిలున్న ప్రభుత్వ, స్థానిక సంస్థల వినియోగదారుల విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లను తొలగించాలని ఎపిఇఆర్‌సి డిస్కాంలను ఆదేశించింది. అలాంటి సర్వీసుల కనెక్షన్లను తొలగిస్తామని డిస్కాంలు నోటీసులు ఇవ్వటం తప్ప తదుపరి చర్య తీసుకోలేకపోతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం నుండి తమకు బకాయి మొత్తాల చెల్లింపు జరగకపోవటం, తమ ఆర్థిక నష్టాలకు ప్రధాన కారణమని డిస్కాంలు తమ సమాధానాలలో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలకు బకాయిలను చెల్లించాలనే షరతులను ఆర్‌డిఎస్‌ఎస్‌ కింద కేంద్రం విధించినంత మాత్రాన బకాయిలు చెల్లింపు సకాలంలో జరుగుతుందని భావించటానికి ఆస్కారం లేదు. అసలు రాష్ట్రాలకు వివిధ పద్దులు, పథకాల కింద చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లించకుండా బకాయి పెడుతున్న, డొంకతిరుగుడుగా ఎగ్గొడుతున్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు సుద్దులు చెప్పటం గురువింద గింజ తన నలుపునెరగదన్న రీతిలో ఉంది.
ప్రీపెయిడ్‌ మీటర్ల కింద చార్జీలను కొన్ని మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎపిఇఆర్‌సి అనుమతితో అమలు చేస్తామని డిస్కాంలు పేర్కొన్నాయి. ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు, డిబిటి అమలు జరిగితే, బిల్లింగు, వసూళ్ళు, ముఖ్యంగా ఉచిత విద్యుత్‌ సబ్సిడీతో కూడిన విద్యుత్‌ పొందుతున్న వినియోగదారులకు ఎలా అమలు జరుగుతాయనే ప్రశ్న ముందుకు వస్తుంది. డిబిటి ప్రకారం సంబంధిత వినియోగదారులు ముందస్తు చెల్లింపులు చేసి, తమకు రావాల్సిన సబ్సిడీ ప్రభుత్వం నుండి వచ్చే వరకు వేచి చూడాలా? ఉచిత విద్యుత్‌ పొందుతున్న వ్యవసాయు వినియోగదారుల విషయంలో, ప్రీపెయిడ్‌ మీటర్లు కాకపోయినా, మీటర్లు పెట్టి నెలనెలా రీడింగు తీసి, బిల్లులు వసూలు చేసే విధానాన్ని అమలు చేస్తామని డిస్కాములు ప్రకటించాయి. ఆ విధంగా, కమిషన్‌ నిర్ణయించిన సిఒఎస్‌ ప్రకారం చార్జీలను (యూనిట్‌కు దాదాపు రూ.7 వరకు) లెక్కగడితే, దాని ప్రకారం బిల్లులు చెల్లించి, ప్రభుత్వం నుండి ఆ మొత్తాన్ని ఆ వినియోగదారులు పొందాల్సి వస్తుంది. ఈ వినియోగదారులకు ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఎకౌంట్లను తెరిచి, నెలనెలా సబ్సిడీ మొత్తాన్ని వారి ఎకౌంట్లలో జమచేసి, ఆ మొత్తాన్ని తిరిగి సంబంధిత డిస్కాం ఖాతాకు బదిలీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం సకాలంలో సబ్సిడీని అలా బదిలీ చేయకపోతే, రైతులు బిల్లులను చెల్లించలేక పోతే, డిస్కాములు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తాయా లేదా ప్రభుత్వం సబ్సిడీ మొత్తం చెల్లించే వరకు వేచి చూస్తాయా? ఇలాంటి ఏర్పాటు వినియోగదారులకు సమస్యలు, ఇబ్బందులను కల్పించటంతో పాటు, డిస్కాంలు, ప్రభుత్వానికి అదనపు పని, వ్యయాన్ని తెచ్చి పెడుతుంది.
డిస్కాములు విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విధంగా సబ్సిడీ మొత్తాలను డిస్కాంలకు నేరుగా చెల్లించే ఏర్పాటు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతున్నది. ఈ విధానంలో, వినియోగదారులకు, డిస్కాంలకు, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది, సమస్య లేదు. ప్రభుత్వం మూలంలో సబ్సిడీ మొత్తాన్ని డిస్కాంలకు చెల్లించని సమస్యలేమైనా ఉంటే, ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు వాటికి పరిష్కారం కాదు. వాటి ఏర్పాటు ఈ సమస్యలను డిస్కాంల నుండి వినియోగదారులకు బదిలీ చేయడానికి దారి తీస్తుంది. డిస్కాంల బదులు వినియోగదారులు ప్రభుత్వ సబ్సిడీ మొత్తం పొందటానికి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ మొత్తం ఏర్పాటులో మోడీ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం, బాధ్యత లేవు. అయినా, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు, ఇతర వినియోగదారుల కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేసి, వీటిని అమలు చేయాలంటున్న మోడీ ప్రభుత్వ మొండి వైఖరి కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకనే సామెతను గుర్తుచేస్తున్నది. వంట గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతూ సబ్సిడీకి ఎసరు పెట్టిన మోడీ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు మధ్య పొంతనలేదని, ఏ కోశానా నిజాయితీ లేదని అనుభవం నిర్ధారిస్తున్నది. మోడీ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి, అదే ఒరపడిలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడే నిర్ణయాలు తీసుకుంటాయనేది అనిశ్చితం.

వ్యాసకర్త ఎం. వేణుగోపాలరావు
విద్యుత్‌ రంగ నిపుణులు, సెల్‌ : 9441193749/