
చాలా మందికి బ్లాక్ టీ, గ్రీన్ టీ గురించి తెలుసు కానీ, వైట్ టీ గురించి మాత్రం అంతగా తెలియదు. దీన్నే 'కెమిల్లా టీ' అని పిలుస్తారు. ఇది మనకు బయట లభిస్తుంది. కెమిల్లా సైనసిస్ అనే మూలిక నుంచి ఈ టీని తయారు చేస్తారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
- వైట్ టీని రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.
- ఈ టీలో కెఫీన్, ఏజీసీజీ సమ్మేళనాలు ఉండటం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువును తగ్గించుకోవచ్చు.
- ఫ్లోరైడ్స్ అధికంగా ఉండడం వల్ల సూక్ష్మ క్రిములను చంపి, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది.
- అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
- ఇందులో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
- ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే ఆస్టియోపోరోసిస్ సమస్యను వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్, కాటెకిన్స్ తగ్గిస్తాయి. ఎముకలను బలంగా మారుస్తాయి.
- వైట్ టీని రోజూ తీసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.
ఇదీ, తయారీ విధానం
200 ఎంఎల్ నీటిని 5 నిమిషాలు మరిగించాలి. బుడగలు వస్తున్నప్పుడు నీటిని కప్పులో పొయ్యాలి. అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం నీటిలో చేరుతుంది. దీనికి తీపిదనం కోసం చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది.