- 57 క్లబ్‌లకు ఎన్నికల్లో ఓటు, పోటీ చేసే అవకాశం రద్దు
- హెచ్‌సిఎ ఏక సభ్య కమిటీ సంచలన నిర్ణయం
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో క్రికెట్ కుంటుపడేందుకు ప్రధాన జాడ్యం బహుళ క్లబ్‌లపై ఆధిపత్యం. సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు ఈ కీలక సమస్యకు పరిష్కారం చూపించారు. కొందరు వ్యక్తులే అధిక సంఖ్యలో క్లబ్‌లను ఆధీనంలో ఉంచుకుని ఎన్నికలను, అపెక్స్ కౌన్సిల్‌ను ప్రభావితం చేస్తున్నారని ఏకసభ్య కమిటీ నిర్ధారణకు వచ్చింది. బహుళ క్లబ్‌లపై యాజమాన్య హక్కులు వదులుకోవాలని ఆదేశిస్తూ.. రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు వీలు లేకుండా 57 క్లబ్‌లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతూ ఆదేశించింది.
హైదరాబాద్ : సుమారు ఐదు నెలల సుదీర్ఘ కసరత్తు అనంతరం జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దశ, దిశను మార్చివేసే నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ క్రికెట్‌లో నెలకొన్న సంస్థాగత సమస్యలకు పరిష్కారం చూపుతూ.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఎవరు వినియోగించుకోవాలి, ఎవరు పోటీ చేయాలనే అంశంలో జస్టిస్ లావు నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. బహుళ యాజమాన్యం, విరుద్ధ ప్రయోజనాల రీత్యా 57 క్లబ్‌లను ఓ పర్యాయం లేదా మూడేండ్ల పాటు ఎన్నికల ప్రక్రియకు దూరం చేస్తూ ఏకసభ్య కమిటీ తుది ఆదేశాలు జారీ చేసింది.
రూల్స్‌కు విరుద్ధం : జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ నివేదిక ప్రకారం బీసీసీఐలో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు గుర్తింపు అందించే ప్రక్రియలో ప్రత్యేకించి ఎటువంటి నిబంధనలు లేవు. హెచ్‌సీఏలోనూ అదే తీరు. పాలకమండలి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇష్టారీతిన క్లబ్‌లకు అనుబంధ గుర్తింపు కల్పించారు. ఈ విషయంలో ఎటువంటి నిబంధనలు పాటించలేదు. ఈ క్రమంలో కొందరు వ్యక్తుల చేతుల్లోనే అధిక శాతం క్లబ్‌లు ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో ప్రతిష్టంభనకు, అపెక్స్ కౌన్సిల్‌లో అంతర్గత ఆధిపత్య పోరాటానికి దారితీస్తుంది. బహుళ యాజమాన్యంపై సుమారు 80 క్లబ్‌లకు నోటీసులు జారీ చేయగా.. అందులో 57 క్లబ్‌లు బహుళ యాజమాన్యంలో మగ్గుతున్నాయని ఏకసభ్య కమిటీ తేల్చింది. పురుషోత్తం అగర్వాల్, విజయానంద్, అర్షద్ అయూబ్, శేషు నారాయణ, జాన్ మనోజ్ సహా పలువురు వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల ద్వారా ఒకటి కంటే ఎక్కువ క్లబ్‌లపై అజమాయిషీ కలిగి ఉన్నారని ఏకసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఏ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, కుటుంబ సభ్యులు ఇతర క్లబ్‌లో ఎటువంటి భాగస్వామ్యం కలిగి ఉండకూడదని.. బహుళ క్లబ్‌ల యాజమాన్యాన్ని హెచ్‌సీఏ నిషేధించిందని నివేదికలో తెలిపారు. బహుళ క్లబ్‌ల యాజమాన్యంపై అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు రూపొందించిన పలు నిబంధనలను ఈ సందర్భంగా జస్టిస్ నాగేశ్వరరావు నివేదికలో ఉటంకించారు.
అవినితీకి ఆస్కారం : ఒకే వ్యక్తి లేదా కుటుంబం బహుళ క్లబ్‌లను నడిపిస్తున్నప్పుడు అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకే వ్యక్తి ఆధీనంలోని రెండు క్లబ్‌ల నడుమ మ్యాచ్‌లో నమోదయ్యే గణాంకాలు, తుది ఫలితం 'ఫెయిర్ ప్లే'కు అనుగుణంగా ఉండకపోవచ్చు. వ్యక్తిగత ప్రదర్శన, అంతిమ ఫలితం ఆ వ్యక్తుల ఇష్టాయిష్టాలకు లోబడే అవకాశం ఉందని నివేదికలో ఏకసభ్య కమిటీ పేర్కొంది. 57 క్లబ్‌లను రానున్న ఎన్నికల ప్రక్రియకు దూరం చేసినా.. ఆ క్లబ్‌లకు ఆడుతున్న క్రికెటర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆ క్లబ్‌లు యధావిధిగా జట్లను పంపించవచ్చని జస్టిస్ నాగేశ్వర రావు స్పష్టం చేశారు.










