చిన్న దెబ్బ తగిలితే
తండ్లాడుకుంటూ వచ్చిన వాళ్ళే -
ఇప్పుడు నెత్తిగొట్టుకుంటున్నా
మాట వరసకైనా వచ్చి ఓదార్చరు
ఏది అడిగినా
కాళ్ళు దగ్గరకు తెచ్చిన వాళ్ళే -
కాళ్ళు మొక్కి బతిమిలాడినా
చేతుల్ని బిగుసుకొని పడుకుంటరు.
ఎందుకు అలిగిండ్రో చెప్పరు
ఎంత పిలిచినా పలుకరు
'ఏడ్వండి, ఇప్పుడు గాక ఇంకెప్పుడేడుస్తరు' అన్నట్టు
నిదురపోతున్నట్టు కనులు మూసుకుంటరు!
వాళ్ళ మీద ఏ తప్పూ ఉంచుకోరు
మన చేతులతో మనమే
ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టు చేస్తారు
బతుకంతా దోషులుగా నిలబెడుతరు.
ఎన్నడూ ఒకరితోటి
పని చేయించుకోవడం ఎరుగని వాళ్ళే -
బిడ్డలను ముందల నడిపించుకుంటరు
నలుగురితో మోయించుకుంటరు
జ్ఞాపకాలను ఇచ్చిపోతున్నామని అనుకుంటారు గానీ ముండ్లకంపల నూకేసి పోతున్నరని
వాళ్ళకెట్లా చెబితే అర్థమౌతుంది?
ప్రతి జ్ఞాపకంలోను ఎండమావుల్లా కనబడుతారు
అందుకుందామంటే మాయమౌతారు
ఒక మనిషి పోయినంక
ఎట్లుంటదంటే ఏం చెప్పను?
పచ్చికట్టెల మీద
వరిగడ్డి ఏసుకొని పడుకున్నట్టు ఉంటది.
మల్ల వాళ్ళు ఎప్పుడు కానొస్తరో
పిల్లలకోడిలాగ మన మధ్యన ఎప్పుడు తిరుగుతరో
ఏ మేఘాల మధ్యన నిలబడి
వాన చినుకై రాలుతరో
ఏ మట్టిపొరల మధ్య పడుకొని
బంతిపూల మొక్కై పూస్తరో
ఏ పెత్తరామాస పండుగకు
మనల్ని చూసి పోదామని వస్తరో
మనం పెట్టిన బట్టలను కట్టుకుంటరో, లేదో?
మన చేత రెండు ముద్దలైనా తినిపోతరో, లేదో
మల్ల ఎప్పుడు కానొస్తరో ..!
- తగుళ్ళ గోపాల్
83098 37260