Sep 29,2023 10:22
  • పదో సంవత్సరంలోకి మేక్‌ ఇన్‌ ఇండియా
  • ప్రభుత్వ మౌనానికి అర్థమేంటి ?

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమం సెప్టెంబరు 25 నాటికి పదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ప్రతి చిన్న సంఘటనను, కార్యక్రమాన్ని అట్టహాసంగా జరుపుకునే ఈ ప్రభుత్వం ఈ పదో వార్షికోత్సవం గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇందుకు కారణాలు ఏమిటి ?
             మూడు ప్రధానమైన లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏడాదికి 12 నుండి 14 శాతం మేరకు తయారీ రంగం వృద్ధిరేటును పెంచడం, 2022 నాటికి జిడిపిలో 25 శాతం తయారీ రంగం వాటాను పెంచడం, 2022 నాటికి తయారీ రంగంలో 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యాల్లో ఏ ఒక్కదాన్నీ ప్రభుత్వం సాధించలేకపోయింది. బహుశా అందుకనే ఈ వార్షికోత్సవాలను ఆర్భాటంగా చేసి వుండకపోవచ్చు. 2013-14 నుండి తయారీ రంగం వృద్ధి రేటు సగటున 5.9 శాతంగా వుంది. అలాగే తయారీ రంగం వాటా కూడా స్తంభించిపోయింది. 2022-23లో 16.4శాతం దగ్గరే నిలిచిపోయింది. 2016, 2021 మధ్య తయారీ రంగంలో ఉద్యోగాలు సగానికి సగం తగ్గిపోయాయి. మేక్‌ ఇన్‌ ఇండియా దశాబ్దంగా చెప్పుకునే ఈ కాలంలో తయారీ రంగంలో కార్మిక శక్తి బాగా క్షీణించింది. 2011-12లో 12.6 శాతం వుండగా, 2021-22లో 11.6 శాతానికి తగ్గిపోయింది. మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో తయారీ రంగంలో ఇంత పేలవమైన పనితీరును నమోదు చేస్తున్నా కొన్ని అసాధారణ సంఘటనలను కూడా సాధారణమైనవిలా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఇందుకు యాపిల్‌ ఐ ఫోన్‌ తయారీ ప్రధాన ఉదాహరణగా వుంది. భారత్‌లో యాపిల్‌ ఐ ఫోన్ల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని చెబుతున్నారు. దాదాపు 7 శాతం ఫోన్లు ఇప్పుడు దేశంలోనే తయారవుతున్నాయి. దీంతో తయారీ రంగం అద్భుతంగా పనిచేస్తున్నదనడానికి ప్రభుత్వం దీన్ని ఉదాహరణగా చెబుతోంది. కానీ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే అవన్నీ బూటకమేనని అర్థమైపోతుంది. వాస్తవానికి తయారీ రంగం చాలా నిరుత్సాహంగా వుంది. పెద్దఎత్తున నిరుద్యోగిత నెలకొంది. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడో ఫ్యాక్టరీ, ఇక్కడో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే సరిపోదు. భారత్‌కు వందలాది కొత్త ఫ్యాక్టరీలు అవసరం. రాష్ట్రాలవారీ ఏర్పాటు చేసే ఆ ఫ్యాక్టరీలు వివిధ వర్గాలు వినియోగించే ఉత్పత్తులను తయారుచేయాల్సి వుంటుంది. యుపిఎ హయాంలో దాదాపు లక్షకు పైగా ఫ్యాక్టరీల సంఖ్య పెరిగింది. కానీ 2013-14, 2019-20 మధ్య కాలంలో ఈ సంఖ్య కేవలం 22 వేలే పెరిగింది. యుపిఎ హయాంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఏటా 6.2 శాతం ఉద్యోగల సంఖ్య పెరిగింది. కానీ మోడీ హయాంలో ఈ సంఖ్య 2.8 శాతానికి పడిపోయింది. అలాగే కార్మికుల వేతనాలు కూడా క్షీణించాయి. యుపిఎ కాలంలో కార్మికుల వేతనాలు ఏటా 17.1 శాతం చొప్పున పెరగగా, 2014 నుండి 8.4 శాతానికి పడిపోయాయి.
                  ఒక విధానాన్ని సమీక్షించడానికి ఒక దశాబ్ద కాలమంటే చాలా ఎక్కువ సమయం. ఒక కార్యక్రమం పదే పదే విఫలమైందంటే, మరింత ప్రభావవంతమైన దాని కోసం దీన్ని పక్కనబెట్టాల్సిన సమయం ఆసన్నమైందనుకోవచ్చు.