
అదానీ, అంబానీ, టాటా అంటూ కొందరికే ఆస్తులు సృష్టించే కంటే ప్రతి కుటుంబానికి ఆస్తి సృష్టించే అవకాశం కల్పించాలని చంద్రబాబు చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉండొచ్చు. కానీ బడా కార్పొరేట్లకు భారీ రాయితీలిచ్చి ఖజానాను డొల్ల చేస్తున్న మోడీ విధానాల గురించి మాట్లాడకపోతే ఎలా? లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను మాఫీ చేయడాన్ని ప్రశ్నించాలి కదా ! ప్రధాని మోడీ అనుంగు మిత్రుడైన గౌతమ్ అదానీ సాగించిన ఘరానా దోపిడీ గురించి హిండెన్‌బర్గ్ నివేదిక తేటతెల్లం చేసిన విషయాల గురించైనా చంద్రబాబు ప్రస్తావించలేదెందుకు? రాఫెల్ కుంభకోణం వంటి క్రోనీ క్యాపిటల్ మాయాజాలం మాటేమిటి? ఇవేవీ చంద్రబాబు మాట్లాడలేరు. ఎందుకంటే ఆయనవీ అవే విధానాలు కనుక !
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా చర్చించిన సందర్భంలో తన 'మనసులోని మాటలు' మరోసారి వెల్లడించారు. ఇష్టాగోష్టి ఆసాంతం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన, చేస్తున్న బిజెపి, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గురించి పల్లెత్తు మాటాడలేదు సరికదా వారికి సానుకూల సంకేతాలివ్వడానికే ఆయన ప్రయాస పడడం గమనార్హం. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో ఈ విషయాలు పంచుకున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో 2018-19లలో కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా విద్యార్థి యువజనుల్ని సమీకరించి 'ధర్మ యుద్ధం' పేరిట అనేక సభలను నిర్వహించిన ఆయన వాటిని మరిచిపోయినట్లుంది. ప్రత్యేక హోదా కోసమే ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చానని, మిగతా విషయాల్లో కేంద్రంతో ఎలాంటి విభేదాలు లేవని ఇప్పుడంటున్నారు. బిజెపికి స్నేహ హస్తం చాస్తూ....న్నారు. మరి ఇప్పుడేమైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసిందనా ఈ స్నేహం? లేక టిడిపి బిజెపి దోస్తానా ఉన్న రోజుల్లోనే ప్రత్యేక హోదా కాదు 'ప్యాకేజి' అంటూ సంబరపడిపోయిన విషయాన్ని నెమరు వేసుకుంటున్నారా? దాంతోనే సరిపెట్టుకోవాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మళ్లీ చెప్ప దలచుకున్నారా? ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు మర్చిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరువగలరా? కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, ఆర్థిక లోటు, ఉన్నత విద్యా సంస్థలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజి తదితర విభజన హామీల గురించి చంద్రబాబుకు గుర్తు లేదా? జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి ముఖ్యంగా నిర్వాసితుల పునరావాసానికి నిధులివ్వని కేంద్రాన్ని నిలదీయరెందుకు? విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కంటూ 32 మంది యువ కిశోరాల ప్రాణ త్యాగంతో సాధించుకున్న స్టీల్ ప్లాంటును తెగనమ్మేస్తామంటున్న బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా ఆయన సిద్ధపడలేదెందుకు? జై ఆంధ్ర, జై తెలంగాణ అన్నవి కొందరు వ్యక్తులు లేదా అందుకు ఏర్పడిన సంస్థలు మాత్రమే లేవనెత్తగా 'ఒక ఓటు- రెండు రాష్ట్రాలు' అంటూ ఉమ్మడి రాష్ట్రంలో విభజన చిచ్చును రాజేసిన రాజకీయ పార్టీగా బిజెపి విచ్ఛిన్నకర పాత్రను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువజాలరు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారంటే ఎపిలో బిజెపితో కలిసి వెళ్లడానికి సమాయత్తమవుతున్నట్లేనా? బహుశ అందుకే బిజెపితో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామనేది మీకు తెలీదని ఆయన మీడియా ప్రతినిధులకు విడమర్చినట్టుంది. దేశ నిర్మాణంలో భాగం కావాలన్నది తన ఉద్దేశమని, అది ఎలా అనేది కాలం నిర్ణయిస్తుందని పేర్కొనడమూ అందులో భాగమే కావచ్చు. 1983 నుంచే టిడిపి జాతీయ కూటముల్లో భాగస్వామిగా ఉందని, జాతీయ రాజకీయాలతో టిడిపికి అనుబంధం ఉందని చెప్పిన ఆయన 'తెలుగు ప్రజల ఆత్మగౌరవ' నినాదంతో కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర వివరిస్తే బాగుండేది. రాష్ట్రాల హక్కుల కోసం ఆనాడు ఎన్‌టి రామారావు ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో సభల గురించి గుర్తు చేసి ఉండాల్సింది. కాని, వాటిని ప్రస్తావిస్తే ఇప్పుడు మోడీ అమిత్ షా ద్వయం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై సాగిస్తున్న దండయాత్రలను, గవర్నర్లను అడ్డం పెట్టుకొని, ఇడి, సిబిఐలను ఉసిగొల్పి రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వాలను మార్చేస్తున్న కుట్రలను కూడా విమర్శించాల్సి వస్తుంది. కనుక వాటిని ప్రస్తావించరు... వారినేమీ అనరు. ఇదీ చంద్రబాబు తీరు.
అనేక విషయాలను వివరించిన చంద్రబాబు దేశాన్ని కుదిపేసిన మణిపూర్ హింసాకాండ గురించి మాట మాత్రమైనా ఎందుకు ప్రస్తావించలేదు? అక్కడి మహిళల వలువలూడదీసిన దుశ్శాసన పర్వం ఆయన మదిని కలచివేయలేదా? హర్యానాలో నుV్‌ా లేదా మధ్యప్రదేశ్‌లో మైనారిటీలపై సాగుతున్న దాడులు, ఉత్తరప్రదేశ్‌లోని బుల్డోజర్ రాజ్ గురించి ఆయన ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ప్రజల్లో విద్వేషాన్ని సృష్టించి మైనారిటీలను అభద్రతకు గురి చేసి సంఘపరివార్ శక్తులు సాగిస్తున్న విధ్వంసాన్ని చంద్రబాబు ఎందుకు తప్పుబట్టలేదు? మత ఘర్షణలను కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు చేపట్టి భాగ్యనగరంలోనూ యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పిన ఎన్‌టి రామారావు స్థాపించిన పార్టీ అధినేత ఇప్పుడిలా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలని, ఆ కూటమికి నాయకుడు లేకపోవడం బిజెపికి అనుకూల అంశమన్న చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యల ఆంతర్యమేమిటి? గతంలో అంటే 1977 తరువాత కేంద్రంలో అధికారానికొచ్చిన ప్రతిపక్ష కూటములు ఎన్నికలకు ముందే ఒక ఉమ్మడి ప్రణాళిక లేదా నాయకత్వం ఎవరన్నది వెల్లడించకుండానే జరిగిన విషయం ('చక్రం తిప్పిన') ఆయనకు తెలియదా? మరి ఈ వ్యాఖ్యానాలు ఎవరిని సంతృప్తిపరచడానికి ?
అదానీ, అంబానీ, టాటా అంటూ కొందరికే ఆస్తులు సృష్టించే కంటే ప్రతి కుటుంబానికి ఆస్తి సృష్టించే అవకాశం కల్పించాలని చంద్రబాబు చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉండొచ్చు. కానీ బడా కార్పొరేట్లకు భారీ రాయితీలిచ్చి ఖజానాను డొల్ల చేస్తున్న మోడీ విధానాల గురించి మాట్లాడకపోతే ఎలా? లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను మాఫీ చేయడాన్ని ప్రశ్నించాలి కదా! ప్రధాని మోడీ అనుంగు మిత్రుడైన గౌతమ్ అదానీ సాగించిన ఘరానా దోపిడీ గురించి హిండెన్‌బర్గ్ నివేదిక తేటతెల్లం చేసిన విషయాల గురించైనా చంద్రబాబు ప్రస్తావించలేదెందుకు? రాఫెల్ కుంభకోణం వంటి క్రోనీ క్యాపిటల్ మాయాజాలం మాటేమిటి? ఇవేవీ చంద్రబాబు మాట్లాడలేరు. ఎందుకంటే ఆయనవీ అవే విధానాలు కనుక! ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు విద్యుత్ సంస్కరణల పేరిట విధ్వంసాన్ని ప్రారంభించింది ఆయనే కదా! ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ ట్రూ అప్ చార్జీల విధానం చంద్రబాబు హయాంలో రూపుదిద్దుకున్నది కాదా? తాము అధికారానికి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామని చెబుతున్నారేతప్ప జనం నడ్డి విరిచే ట్రూ అప్ విధానాన్ని రద్దు చేస్తామనడం లేదు. ఇప్పుడు జనం మీద వేస్తున్న చెత్త పన్నుకు పెట్టిన ముద్దు పేరు యూజర్ చార్జీలన్న మాట టిడిపి పాలనలో పుట్టినదే కదా! ధర్మాసుపత్రిలో ఓపి చీటీకి డబ్బు కట్టించిందీ ఆనాడే! ఇక ప్రైవేటీకరణ విధానాల గురించి చెప్పనక్కరలేదు. ప్రజలపై వైసిపి సర్కారు వేస్తున్న భారాలను విమర్శించడం మాత్రమే చాలదు. ఆ విధానాలను వ్యతిరేకించాలి. కాని ప్రజల శ్రేయస్సు కోసం అంత సాహసం చేయగలరా? ఎందుకంటే బిజెపి, వైసిపి, టిడిపి ఇలాంటి పార్టీలన్నీ అనుసరించేది నయా ఉదారవాద ఆర్థిక విధానాలే కనుక !
సంపన్నుల దోపిడీకి కొమ్ము కాయడంతోపాటు దేశ ఖజానాను వారికి దోచిపెట్టడం, అందుకోసం ప్రజల మధ్య విద్వేషాలు రగుల్కొల్పడం ఈనాటి బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉంది. వినాశకరమైన ఈ కార్పొరేట్ మతతత్వ కూటమిని గద్దె దించడమే దేశ ప్రజల ముందున్న మార్గం. అందుకోసం సాగే మహోద్యమంలో భాగస్వాములయితేనే ఎవరైనా చరిత్రలో నిలుస్తారు. కనుక ఇప్పటికైనా టిడిపి దాగుడుమూతలు మాని కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ప్రతిఘటించడానికి, సంఘపరివార్ మత విద్వేష కుట్రలకు వ్యతిరేకంగానూ నిలబడాలి. ప్రజల పక్షాన పోరాడాలి. అలా వ్యవహరిస్తేనే అది ఎన్‌టి రామారావు వారసత్వాన్ని కొనసాగించినట్టవుతుంది. టిడిపి శ్రేణులు, అభిమానులు, అనుయాయులు ఆ దిశగా ఆలోచిస్తారా..! నాయకత్వం పునరాలోచిస్తుందా...!
- గిరిపుత్ర