Sep 23,2023 07:05

90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, కవి రచయిత వరవరరావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మనవడు ఆనంద్‌ తెల్తుంబ్డే, రోనా విల్సన్‌, గౌతమ్‌ నవలఖ, సాగర్‌ గోర్కే, మీరన్‌ హైదర్‌ వంటి వారి మీద పెట్టిన కేసులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే రాజ్యం పక్షపాత వైఖరి అర్థమవుతుంది. ప్రభుత్వాలను కూలదోసేవారుగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను తుపాకీతో స్వాధీనం చేసుకుంటారని వారిపై ప్రధాన అభియోగం. రాజకీయ నాయకుల మీద పెట్టిన అభియోగాలు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని.

             ఎ.పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో వున్నారు. గత కొద్ది నెలల క్రితం తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ, అంతకుముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కూడా జైలుకు వెళ్లారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ అరెస్టు హైడ్రామా నడుస్తోంది. నిజానికి ఇటువంటి రాజకీయ కక్షలు, కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిప్పడం, మన దేశానికి, రాష్ట్రానికి కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలలో ఉన్న ప్రముఖ నాయకుల మీద కేసులు పెట్టడం, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారిపై లేక ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నాయకులపై తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థల ద్వారా కేసులు పెట్టడం కూడా గతంలో చూశాం. అయితే కేంద్ర బిజెపి సర్కారు పాలనలో ఇది మరింత తీవ్రంగా వుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి లొంగిపోతే ఫర్వాలేదు. కాని ఏమాత్రం వ్యతిరేకంగా వున్నా వారిపై ఇ.డి, సిబిఐ, ఐ.టి...ఇలా ఎన్నో దాడులు. నయా ఉదారవాద విధానాలు వచ్చాక పొలిటీషియన్‌-బ్యూరోక్రాట్‌-క్యాపిటలిస్టుల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులను వేటాడడానికి, లొంగదీసుకోవడానికీ బిజెపి పాలకులు కేంద్ర దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఏ కేసులూ (లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వంటివి తప్ప) దాదాపు నిలబడవు. అసలు కేసులే ఏళ్ల తరబడి నడుస్తుంటాయి. తీర్పులు వచ్చే నాటికి పరిస్థితి మారిపోతుంది. వాటిపై ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది.
 

                                                                         రాజ్యం నిజ స్వరూపం

ఈ గందరగోళం మధ్య రాజ్యం నిజ స్వరూపం తెలుసుకోవడం కష్టం. పాలక పార్టీల కోరిక, ప్రయత్నం కూడా అదే. ఈ క్రమంలో చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి మధ్యతరగతి, ఉన్నత వర్గాలలో పెద్ద చర్చే జరుగుతుంటుంది. తప్పు చేసిన వాడు ఎన్నటికీ తప్పించుకోలేడని, చట్టం ముందు అందరూ సమానులేనని, కింది కోర్టులో కాకపోతే పైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయని, రాజకీయ ప్రలోభాలకు లోనుకావని... ఇలా అనేక వాదనలు ముందుకు తేబడుతూ ఉంటాయి. రాజ్యం యొక్క అసలు వర్గ స్వభావం గురించి చర్చ కనపడనివ్వరు. ఈ రోజు భారతదేశంలో కనీసం ఒక వంద మంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రిక విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, కవి రచయిత వరవరరావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మనవడు ఆనంద్‌ తెల్తుంబ్డే, రోనా విల్సన్‌, గౌతమ్‌ నవలఖ, సాగర్‌ గోర్కే, మీరన్‌ హైదర్‌ వంటి వారి మీద పెట్టిన కేసులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే రాజ్యం పక్షపాత వైఖరి అర్థమవుతుంది. ప్రభుత్వాలను కూలదోసేవారుగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను తుపాకీతో స్వాధీనం చేసుకుంటారని వారిపై ప్రధాన అభియోగం. రాజకీయ నాయకుల మీద పెట్టిన అభియోగాలు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని. కానీ అణగారిన, దళిత, గిరిజన, మైనారిటీ, మహిళల గురించి మాట్లాడే వాళ్లు, రాసేవాళ్లు, పాడేవాళ్లు, ఉద్యమించే వాళ్లు మాత్రం ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రలు చేసేవారుగా రాజ్యం ముద్ర వేస్తుంటుంది.
            బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం ఏడేళ్లలో 'ఉపా' చట్టం కింద అరెస్టు చేయబడ్డవారు 10,552 మంది. ఇందులో దోషులుగా కోర్టులు నిర్ధారించింది కేవలం 98 మందిని మాత్రమే. కానీ వేలాదిమంది బెయిల్‌ రాక నెలలు, సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు, ఇంకా మగ్గుతున్నారు. మహమ్మద్‌ ఇలియాస్‌, మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఇద్దరు 30 ఏళ్ల యువకులు. వీరికి లష్కర్‌ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ 2012లో అరెస్టు చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత విచారణలో వారికి అటువంటి సంబంధాలు ఏమీ లేవని తేల్చి విడుదల చేసింది. అలాగే మహమ్మద్‌ అమీర్‌ ఖాన్‌ అనే ఢిల్లీ యువకుడిని పాకిస్తాన్‌ ఏజెంట్‌ అని ముద్రవేసి 23 సంవత్సరాలు జైల్లో పెట్టి చివరికి నిర్దోషి అని విడుదల చేసింది. ఇలా అనేకమంది యువకులను బిజెపి పాలిత రాష్ట్రాలలో కానీ, మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కానీ తల తోక లేని కేసులు పెట్టడం, ఏళ్ల తరబడి బెయిల్‌ ఇవ్వకుండా, అసలు విచారణే లేకుండా జైల్లో దుర్భరమైన పరిస్థితులకు వారి జీవితాలకు బలి చేయడం ఒక ధోరణిగా సాగుతున్నది. విలువైన వారి యవ్వన జీవితమంతా నాశనం చేయబడుతున్నది. కానీ వారి గురించి చర్చ ఎక్కడా కనపడదు. అలాగే పాత్రికేయులు కూడా అన్యాయంగా బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ఒక దళిత మహిళను అంతం చేసిన తీరును కవర్‌ చేసినందుకు సిద్ధికి కప్పన్‌ ఎంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొనేలా చేసిందో మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ఆర్థిక నేరగాళ్లకు, అందులో వారు పాలక వర్గాల మనుషులైతే వారిని రాజ్యం చూసే తీరుకు, ప్రభుత్వం మీద అణగారిన ప్రజల కోసం, సాంఘిక న్యాయం కోసం, లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం, పోరాడే ఉద్యమకారులను పరిగణించే తీరుకు ఉన్న తేడా విదితమవుతుంది. రాజ్యం వర్గ ధోరణిని వ్యక్తం చేస్తుంది.
 

                                                                         చట్టం కొందరికి చుట్టమే...

ఈ చట్టం ఎవరికీ చుట్టం కాదు అనేది ఒక నానుడి మాత్రమే. పాలక పార్టీలు తిట్టుకోవడానికి ఉపయోగ పడే నినాదం మాత్రమే. చట్టం లేక రాజ్యం పాలకవర్గానికి కచ్చితంగా చుట్టమేనని దేశంలో జరుగుతున్న పై వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 'ఉపా' చట్టం పరిధిలో 2019లో 1948 మందిని అరెస్టు చేస్తే శిక్ష పడింది 34 మందికే. 2020లో 1321 మందికి అరెస్టు చేస్తే 80 మందికి మాత్రమే శిక్ష పడింది. 2021 లో 1621 మందిని అరెస్టు చేస్తే కేవలం 62 మందికి మాత్రమే శిక్ష పడింది. 2022-23 సంవత్సరాలలో కూడా బహుశా ఇదే ధోరణి కొనసాగుతూ ఉన్నది. 2019లో విచారణ పెండింగ్‌లో ఉన్న 2224 మందిలో 238 మంది మూడు నుండి ఆరు నెలల మధ్య జైళ్లలో ఉన్నారు. మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య 416 మంది, ఒకటి నుండి మూడు సంవత్స రాల మధ్య దాదాపు 1200 మంది జైళ్లల్లో ఉన్నారు. అదే 2021 నాటికి విచారణ ఎదుర్కొంటున్న 2,800 మందిలో మూడేళ్లకు పైగా జైల్లో ఉన్నవారు 1113 మంది. చట్టం పాలకుల చుట్టమేనని పదే పదే నిరూపితం అవుతున్నది.
 

/ వ్యాసకర్త సిపియం కృష్ణా జిల్లా పూర్వ కార్యదర్శి,
సెల్‌: 9490098422 /
ఆర్‌. రఘు

22