జెరూసలెం : హమాస్ రాకెట్ల దాడి తరువాత ఇజ్రాయిల్ గాజాపై యుద్ధం ప్రకటించడంపై పశ్చిమ,అరబ్ దేశాలు చీలిపోయాయి. అమెరికా జర్మనీ, ఫ్రాన్స్ తదితర పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌కు వత్తాసు పలకగా, అరబ్ దేశాలు పాలస్తీనా పోరాటానికి మద్దతు ప్రకటించాయి.
హమాస్ దాడి తరువాత గాజాను దిగ్బంధించి, బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయిల్ చర్యలపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సిసి, పాలస్తానా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకుంటూ భద్రతా, మానవతా పరిస్థితులు క్షీణిస్తుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలు, ఈ ప్రాంత భద్రత, సుస్థిరత ప్రమాదంలో పడే అవకాశముందని వారు హెచ్చరించారు. మరోవైపు జోర్డాన్ రాజు అబ్దుల్లా-2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ జావేద్ అల్ నహయాన్‌లు తాజా పరిణామాలపై చర్చించారు.. పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీలు ఇరు పక్షాలు సంయమనం పాటించాలని వారు కోరారు. పాలస్తానా సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం వుందని జోర్డాన్ రాజు అభిప్రాయపడ్డారు. పాలస్తీనియన్ల చట్టబద్ధమైన హక్కులకు రక్షణ కల్పించాలన్నారు. సిరియా పాలక పార్టీ అల్ బాత్ కూడా ఇజ్రాయిల్ చర్యలను ఖండించింది. పాలస్తీనా పోరాటానికి తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించింది. అయితే ఈ ఘర్షణలపై పశ్చిమ దేశాల వైఖరి మరోలా వుంది. గాజా నుండి జరుగుతున్న దాడులను అమెరికా తీవ్రంగా ఖండిస్తోందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ తరుణంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు బాసటగా తాము నిలబడతామని, అవసరమైన సాయం అందచేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జ్ ఆదివారం నెతన్యాహుతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్ భద్రతకు హామీ కల్పించడం తన విధానమన్నారు. త్వరలోనే ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడి ఈ విషయం మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరతానని చెప్పారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ ఇజ్రాయిల్‌పై దాడిని ఖండించారు. ఇరు పక్షాల నేతలతోనూ మాట్లాడిన మాక్రాన్, ఇజ్రాయిల్‌కే తమ మద్దతు వుంటుందని తెలిపారు.