వాషింగ్టన్: తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్,ఉక్రెయిన్‌కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. హమాస్‌ను ఎదుర్కొనే విషయంలో ఆవేశంతో కళ్లు మూసుకుపోకూడదని అప్రమత్తం చేశారు. 9/11 దాడి తర్వాత అమెరికా చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలని సూచించారు.'నేను ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయంలో.. 9/11 దుర్ఘటన వల్ల అమెరికా అనుభవించిన నరకాన్ని వెల్లడించాను. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని తెలియజేశాను. ఆ వేళ మేం న్యాయం కోసం ఆవేశంగా వెళ్లి తప్పులు చేశాం. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో కళ్లు మూసుకుపోవద్దని.. ఆలోచించి అడుగులు వేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచిస్తున్నాను ' అని బైడెన్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది. అమెరికాలో ఉగ్రదాడి అనంతరం అఫ్గానిస్థాన్‌లో సైన్యాన్ని మోహరించిన అగ్రరాజ్యం.. అనేక మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ క్రమంలో సుదీర్ఘకాలం అంటే సుమారు 20 ఏళ్లపాటు ఆ దేశంలో బలగాలను కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గాజాలో ఇరుక్కుపోవద్దనే ఉద్దేశంతో ఈ హెచ్చరిక చేసినట్లు కనిపిస్తోంది.