
వినువీధిని తారలుండు
వింతగదా రాలకుండు
వీక్షించుము ఓ బాబూ!
వినిపించుము నీ జవాబు!!
తోకచుక్కలుంటాయట
తాకబోకు అంటాయట
వాకలుగా కాంతిపారు
వాటితీరు చెప్పితీరు!
ఉలికులికీ పడతాయట
ఉల్కాపాత మంటారట
మొలక చుక్కలుంటాయట
పలుకరించి చూడు బాబు!
గుంపులుగా చుక్కలుండు
కెంపులుగా మెరయుచుండు
శంపాలత చుట్టాలవి
సంపుటాలు వ్రాయుబాబు
రాశులుగా చుక్కలుండు
రాశికొక్క నామముండు
చూసినవాని పేర్లు చెప్పు
గురుతులతో గుట్టు విప్పు!
లెక్కలేని గ్రహాలుండు
లెక్కలతో తిరుగుచుండు
తారలకే చుట్టాలివి, వాటి
దారి చెప్పు బాబు!
మనమున్నది భూమిపైన
ఘన గ్రహములు ఏడుపైన
మనకుగలడు చంద్రుడొకడు
కనుగొనుమింకెన్నికలవొ?
కాంతి వేగమెంతెంతో
కానరాని చుక్కలెన్నొ?
వీక్షించుము ఓ బాబు!
వినిపించుము నీ జవాబు!!
కిలపర్తి దాలినాయుడు,
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, రామభద్రపురం.