
'అమ్మా.. ఈ రోజు క్లాసులో ఏం జరిగిందో తెలుసా' అంటూ భుజాన వున్న బ్యాగ్ సోఫా మీద పడేశాడు శ్రీయాన్. 'ఏం జరిగింది' అంటూ వివరాలు అడిగింది తల్లి శిరీష. 'ప్లాస్టిక్ వినియోగం, దాని వల్ల జరిగే అపకారం అన్నీ వివరించి చెప్పారు. మనం వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు, కవర్లు ఎంతో హాని కలిగిస్తాయట. ఇక నుంచి ఎవరూ ప్లాస్టిక్ సంచులు, కవర్లు వాడకూడదని అందరి చేత ప్రామిస్ చేయించారు' అంటూ స్కూల్లో జరిగిన విషయాన్ని చెప్పాడు శ్రీయాన్.
'అవును ఇది నిజమే. ప్లాస్టిక్ వినియోగం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. మనం పారేసిన ప్లాస్టిక్ తిని జంతువులు, పక్షులు కూడా చనిపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఎప్పటికీ భూమిలో కలసి పోదు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలసి పోవడం వల్ల ఏడాదికి 20 లక్షల పక్షులు, చేపలు చనిపోతున్నాయని ఓ అంచనా.'' అంటూ తనకు తెలిసిన విషయాలు చెప్పింది శిరీష.
'మరి దీనికి మనం ఏమి చేయలేమా అమ్మా' అన్నాడు శ్రీయాన్.
'ఎందుకు చేయలేము మీరు స్కూల్లో ప్రామిస్ చేసినట్టుగా ఈ రోజు నుండి ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ వస్తువులు మన ఇంట్లో వాడడం మానేద్దాం. మనకు తెలిసిన వాళ్ళందరికీ వాటి వల్ల కలిగే చెడుని చెబుదాం. వారిచేత కూడా వాటి వాడకం మానేలా చూద్దాం. ఇలా మనం మొదలు పెడితే కచ్చితంగా అందరూ మన బాటన నడుస్తారు. అప్పుడు తప్పక మార్పు వస్తుంది' అంది శిరీష.
'ఇలాంటి పనులు చెప్పడం కన్నా ఆచరించడం గొప్పది. మనం ఆచరించకుండా ఎదుటి వారిని చేయమనడం వల్ల ఫలితం వుండదు. కాబట్టి ముందుగా మన ఇంట్లో వున్న ప్లాస్టిక్ పాత్రలు, కవర్స్ తీసేయండి' అంటూ అప్పుడే లోపలికి వస్తున్న శ్రీయాన్ తండ్రి శ్రీధర్ అన్నాడు, నవ్వుతూ.
ఆ రోజు నుండి శ్రీయాన్ ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు వాడడం మానేశారు. స్కూల్‌లో శ్రీయాన్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వినియోగం, హానిపై అవగాహన కల్పించాడు. కొన్ని రోజులకే ఒక్కొక్కరిగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం మొదలుపెట్టారు.
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.