
- 1994 నుంచి గొర్రెతోక బెత్తెడు బతుకులే !
- సమస్యలను పట్టించుకోని వైజాగ్ పోర్టు యాజమాన్యం
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : వైజాగ్ పోర్టు అథారిటీ (విపిటి) కార్గో హేండ్లింగ్‌లో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇటీవలే 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా... కార్గో హేండ్లింగ్‌లో బెర్తులపైనా, వివిధ విభాగాల్లోనూ కీలకపాత్ర పోషిస్తోన్న పోర్టు పూల్ కార్మికులను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. 1994 నుంచి పోర్టునే నమ్ముకుని జీవిస్తున్న వీరికి న్యాయం దక్కడం లేదు. ఇప్పటికీ వారివి గొర్రెతోక బెత్తెడు బతుకులే. కనీస వేతనం లేక తీవ్ర అవస్థలకు గురువుతూ వీరు విధుల్లో కొనసాగుతున్నారు. 'పర్మినెంట్ చేయండి. లేకుంటే కనీసం టైం స్కేల్ అయినా ఇప్పించండి మహాప్రభో' అంటూ వీరు వేడుకుంటున్నారు. పోర్టు ప్రభుత్వ రంగంలోనే ఉంటుందనే గ్యారెంటీ లేదని, తమ భవిష్యత్తు ఏమవుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పోర్టుపై పెరుగుతున్న ప్రయివేట్ పెత్తనమే కారణమా ?
వైజాగ్ పోర్టులోని 22 బెర్తుల్లో 12 బెర్తులు పిపిపిలోకి వెళ్లిపోవడం, కైలాసపురంలోని 17 ఎకరాల పోర్టు స్థలాన్ని ఇనార్బిట్ మాల్ పేరిట రహేజా సంస్థకు అప్పగించడం, పోర్టు ఆస్పత్రిని పిపిపిలోకి తీసుకెళ్లడం వంటి చర్యలతో పూల్ కార్మికుల్లో ఆందోళన ఎక్కువైంది. అంతా ప్రయివేట్ చేతుల్లోకి వెళ్లిపోతే తాము ఏం కావాలి? అన్న ప్రశ్న వీరి మదిని తొలిచేస్తోంది. ఈ క్రమంలోనే తమ సమస్యలను పోర్టు ఉన్నతాధికారులకు మళ్లీ విన్నవించడానికి సిద్ధమవుతున్నారు. పోర్టుకు చెందిన ప్రధాన ఎనిమిది విభాగాల్లో ఏళ్ల తరబడి వందల కొద్దీ పోస్టులు ఖాళీగా ఉన్నా, భర్తీకి చర్యలు చేపట్టడం లేదు. 2009 నుంచి పర్మినెంట్ ఉద్యోగుల భర్తీని నిలిపివేయడంతో ఇక పోర్టు ప్రభుత్వ రంగంలో ఉండదేమోనన్న భయం పూల్ కార్మికులను వెంటాడుతోంది.
ఎవరీ పూల్ కార్మికులు ?
వైజాగ్ పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ 60 ఏళ్ల సర్వీసును పూర్తి చేయలేక అనారోగ్యంతో 'మెడికల్ రిటైర్‌మెంట్' తీసుకుంటే వారి వారసులు ఎవరైతే ఆ స్థానంలో ఉద్యోగం పొందుతారో వారే పూల్ కార్మికులు. పోర్టుకు చెందిన ఎనిమిది విభాగాల్లో ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా ఒకచోట 'పూల్' చేసి ఆ తర్వాత పోర్టు బెర్తులు, విభాగాల కార్యాలయాలు, పోర్టు గెస్ట్‌హౌస్‌లు, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్లు ఇలా... అన్నిచోట్లకూ సర్దుతారు. 1994లో ఈ విధానం వ్యవస్థ పోర్టులో ఆవిర్భవించింది. రూ.1850లే అప్పట్లో ఈ కార్మికుల జీతం. 300 మందిని అప్పట్లో ఇలా తీసుకున్నారు. కన్సాలిడేషన్ పే కింద వీరికి ఇప్పటివరకూ వేతనం చెల్లిస్తున్నారు. 2006లో వీరు 600కు పెరిగారు. మెడికల్ సమస్యలపై వందల సంఖ్య ఉద్యోగులు పోర్టులో ఖాళీలవుతుంటే వీరూ పెరుగుతూ వచ్చారు. దీంతో, పోర్టు యాజమాన్యం 2009లో సుమారు 250 మందికిగానూ నెలకు రూ.5 వేలు చొప్పున అప్పటికి మిగిలిన సర్వీసుకు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. ఎవరైతే ముందుకొచ్చారో వారికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు దాటకుండా చెల్లించేందుకు నిర్ణయింది. ఆ క్రమంలో 250 మంది ఇలా డబ్బులు తీసుకుని పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకు ముందే కొంతమందిని పోర్టులో రెగ్యులర్ చేశారు. ఇంకా పర్మినెంట్ కాని వారు నేటికీ 543 మంది పోర్టులో వివిధ డిపార్టుమెంట్లలో పూల్ కార్మికులుగా పనిచేస్తున్నారు. రూ.21 వేలకు మించి వీరి జీతం లేదు.
