Aug 16,2023 07:24

          ఎర్రకోట సాక్షిగా వరుసగా పదో ఏటా ప్రధాని తన వాగాడంబర విన్యాసాన్ని చాకచక్యంగా కొనసాగించారు. 'అతి త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం... 2075 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ'గా ఆవిర్భవిస్తుందంటూ పాత పాటే పాడారు. గతంలో సోదరీ సోదరులంటూ సంభోదించే ప్రధాని ప్రజలందరినీ తన కుటుంబంగా అభివర్ణించారు. భారత్‌ ఇప్పుడు విశ్వ మిత్రగా మారిందని, ప్రపంచ సంక్షేమానికి బలమైన పునాదులు వేస్తోందని ప్రకటించేశారు. ఆ కుటుంబ పెద్ద... మణిపూర్‌ మండిపోతున్నా.. తోబుట్టువుల్లా కలసిమెలసి ఉండే మైతీలు, కుకీలు కత్తులు దూసుకుని..కుత్తుకలు కోసుకుంటున్నా... మానవతుల మానప్రాణాలు మంటగలిసి పోతున్నా...150 మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకున్నా...మూడు నెలలకుపైగా మూగనోము పట్టడం వెనుక మర్మమేమిటో మాత్రం విడమర్చలేదు. అతి దారుణమైన వీడియో వైరల్‌ అయి.. భారత ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహిస్తే తప్ప నోరుపెగలలేదు. అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప... పార్లమెంటులో రెండు గంటలకుపైగా ప్రసంగంలో రెండు నిమిషాలు మాట్లాడడానికి మనసొప్పలేదు. ప్రపంచమంతా దుమ్మెత్తిపోస్తున్న వేళ...అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయని, దేశం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. వారికి ఏవిధమైన భరోసా ఇస్తారన్న అంశం చెప్పనేలేదు.
         అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని, కుటుంబం చేత, కుటుంబం కోసం, కుటుంబానికి మేలు అన్నట్టుగా తయారయ్యాయని, వాటిని తుదముట్టించాలని ప్రవచించారు. అదానీ, అంబానీ కుటుంబాలను ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిన తీరును, కార్పొరేట్‌ కుటుంబాలకు పోర్టులు, టెలికం సహా సమస్త రంగాలనూ.. మన రాష్ట్రంలోని గంగవరం పోర్టు, విశాఖ స్టీల్‌ సహా ప్రజలు సమకూర్చుకున్న దేశ సంపదనంతా దోచిపెడుతున్న మోడీ సర్కార్‌ ఇది ఏ తరహా బుజ్జగింపో సెలవిస్తే బాగుండేది. కాషాయ పార్టీలో పెత్తనం చేస్తున్న వారసత్వ రాజకీయాలను తుదముట్టించడం గురించి, 40 పర్సంట్‌ కమిషన్ల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
            2004 నుంచి 2014 వరకూ 7.8 శాతం అభివృద్ధితో ముందుకెళ్లిన దేశం... గత తొమ్మిదేళ్లలో 5.7 శాతానికి ఎందుకు పడిపోయింది? నోట్ల రద్దు, జిఎస్‌టి తదితరాలు ఆర్థిక వ్యవస్థను తిరోగమనం వైపు నడిపాయన్న ప్రపంచవ్యాప్త విశ్లేషణలను ఉద్దేశపూర్వకంగానే దాట వేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు.. తయారీ రంగంలో 2022 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు, మేక్‌ ఇన్‌ ఇండియా...వంటి వాగ్దానాల అమలుపై నోరువిప్పలేదు. 2014 నుంచి 2022 మధ్య 22 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే 7.5 లక్షల మందికే ఉద్యోగాలొచ్చాయని లోక్‌సభ సాక్షిగా మంత్రి వెల్లడించారు. అంటే వెయ్యి మంది దరఖాస్తుదారుల్లో ముగ్గురికే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రైతుల ఆదాయం రెండింతల పెంపు, వంద స్మార్ట్‌ సిటీలు, అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ విద్యుత్‌, మరుగుదొడ్లు... వంటి హామీలన్నీ ఎన్నికల జుమ్లాలుగా మారిపోయిన వైనాన్ని మరిచినట్టున్నారు. ఒక్కరోజు ముందే రిటైల్‌ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయికి చేరిందని, కూరగాయల ధరలు నెలవారీగా 38 శాతం పెరిగాయని గణాంకాల మంత్రిత్వశాఖ లెక్కలే చెబుతున్నాయి. అయినప్పటికీ, విపరీతంగా పెరుగుతున్న ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా నియంత్రించగలిగామని చెప్పుకున్నారు. దేశంలో 74 శాతం మంది ప్రజలకు ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాట్లో లేదన్న ఐక్యరాజ్య సమితి నివేదికను పక్కనపెట్టి, ఐదేళ్లలో 13.5 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశామని ఎర్రకోట బురుజుల నుంచి ప్రకటించడం అతి పెద్ద జోక్‌.
           నారీశక్తి, భరతమాత గురించి గొప్పగా చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌పై చర్య కోసం మూడు నెలలు పోరాడిన మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని తెలివిగా దాటవేశారు. గృహ రుణాలపై రాయితీ, విశ్వకర్మ, జన ఔషధి కేంద్రాల పెంపు తదితర ఎన్నికల జుమ్లాలకు ఎర్రకోటను వేదికగా చేసుకున్నారు. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ, మరోవైపున మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న పాలకులకు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది.