
దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. మన రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలు జరుగుతున్నాయి. ఈ ఓటర్ల జాబితాల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. వైసిపి వారు తమ ఓట్లను తొలగిస్తున్నారని తెలుగుదేశం వారు, తెలుగుదేశం వారే తొలగించారని వైసిపి వారు పరస్పరం దూషించుకుంటున్నారు. ఈ తగువును ఢిల్లీ వరకుా తీసుకెళ్ళారు. ఏది ఏమైనా మన రాష్ట్రంలో ఓటరు లిస్టులు పక్కాగా లేవన్నది నిర్వివాదాంశం. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో కూడా అదే పరిస్థితి. ఎన్నికల రోజున కొంతమంది మీడియా ముందుకు వచ్చి తమ ఓట్లు తొలగించారని వాపోవటం సర్వ సాధారణంగా మారింది. 76 ఏళ్ళ స్వతంత్రం అనంతరం కనీసం ఓటరు లిస్టులు కూడా పక్కాగా తయారు చేసుకోలేని దుస్థితిలో మనం వున్నాం.
మన దేశంలో ఓటరు లిస్టులు పక్కాగా లేకపోవటానికి కారణం, జనాభాకు సంబంధించిన పక్కా సమాచారం ప్రభుత్వాల దగ్గర లేకపోవటమే. ఎవరు ఎక్కడ ఉంటున్నారో రికార్డులు ఉండవు. గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నా, పట్టణాలలో ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారినా ప్రభుత్వాలకు ఆ వివరాలు అవసరంలేదు. ఎవరైనా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వచ్చి నివాసముంటున్నా మన ప్రభుత్వాలకు ఆ విషయం తెలియదు. తెలపాల్సిన అవసరం కూడా లేదని వచ్చిన వారు భావిస్తారు. ఆధార్ కార్డు మార్చుకోవాల్సి వచ్చినప్పుడో, ప్రభుత్వ పథకాలు పొందాల్సి వచ్చినప్పుడో, బ్యాంకు ఎకౌంటు ప్రారంభించాల్సి వచ్చినపుడో మన అడ్రసులు ప్రభుత్వాలకు అవసరమవుతాయి. అవి కూడా ఆ ప్రయోజనం వరకే పరిమితం. మనం ఒక ఊళ్లో నివశిస్తుంటే, మరొక ఊళ్లో మన ఓటు ఉంటుంది. ఉన్న ఊరికి ఓటు బదిలీ చేయమని దరఖాస్తు చేస్తే, అంతకు ముందున్నచోట ఓటును తొలగిస్తున్నారు తప్ప, కొత్త చోట ఓటు ఇవ్వటం లేదనే ఫిర్యాదులున్నాయి.
జాతీయ డేటా బేస్‌నుండి తీసుకొని ఓటర్ లిస్టులు తయారు చేయటమనేది ఇటలీ, ఫ్రాన్స్‌లతో సహా చాలా యూరప్ దేశాలలో ఉంది. మనకు పదేళ్లకోసారి జనాభా లెక్కలు తీస్తుంటారు. అప్పుడైనా డేటా బేస్‌ను ఏర్పాటు చేయాలని మన పాలకులకు తోచదు. ఆ తర్వాత మరల పదేళ్ల మధ్య కాలంలో జనాభా పెరుగుదలను ఉజ్జాయింపుగా లెక్కలు వేస్తారు తప్ప, జనన మరణాలు తప్పని సరిగా నమోదు చేయటం, ప్రతి నివాసి చేత మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీలలో నమోదు చేయించి డేటా బేస్ ఏర్పాటు చేయటం లేదు. జనాభా డేటా బేస్ ఏర్పాటు చేస్తే ఓటరు లిస్టులు ప్రత్యేకంగా తయారు చేయనవసరం ఉండదు. జనాభా లెక్కలు కూడా సులువుగా తేలతాయి. రోజువారీ జనాభా లెక్కలు కూడా తేలతాయి.
మన దేశంలో చదువు తక్కువని, అది సాధ్యం కాదని అనుకోవటం పొరపాటు. ఆధార్ కార్డు తప్పని సరి చేసినప్పుడు ఈ చదువులేని జనాభానే ఆధార్ కార్డుల కోసం క్యూలలో నిలబడి ఆధార్ కార్డు పొందారు. పక్కాగా ప్లాన్ చేసి ఇంటింటికీ తిరిగి నమోదు చేస్తే డేటా బేస్ ఏర్పాటు అసాధ్యమేమీ కాదు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు కూడా చట్టబద్ధం చేసి కఠినంగా అమలు చేస్తే యూరప్‌లాంటి ఫలితాలు పొందటం సుసాధ్యమే. ఎన్నికల వ్యవస్థ బలోపేతం కావాలంటే పక్కా ఓటరు లిస్టులనేది అవసరం.
ఇవి జరగాలంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన పాలకులకు ఉండాలి. ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీలో భార తీయులు చాలా గొప్పవాళ్ళని, ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలకు మా వాళ్ళే సి.ఇ.ఓలని గప్పాలు కొట్టే మన పాలకులు, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవటానికి అదే ఐటీని వాడుకోవాలని భావించరు. ప్రపంచంలో మాది అతి పెద్ద ప్రజాస్వామ్యమని ప్రచారార్భాటాలు తప్ప ఆ ప్రజాస్వామ్యానికి మొదటి మెట్టయిన ఓటరు లిస్టులు పక్కాగా తయారు చేయటానికి చర్యలు చేపట్టరు. ఓట్లను, ఎన్నికలను తమ స్వార్ధ ప్రయోజనాలకు బాటలుగా చూడటమే దీనికి కారణం. ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీలవాదులు తప్పనిసరిగా పక్కా ఓటరు లిస్టుల తయారీ కోసం పాలకులపై ఒత్తిడి తేవాల్సి వుంది.
- యం.వి. ఆంజనేయులు,
టాక్స్ పేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ, విజయవాడ.