మన శరీరంలో వచ్చే వివిధ రకాల రుగ్మతలకు గల కారణాలలో విటమిన్ల లోపం ఒకటి. తాజాగా విటమిన్ కె లోపం వల్ల కలిగే రుగ్మతలపై తాజాగా ఓ నివేదిక వెలువడింది. మన శరీరంలో విటమిన్ కె స్థాయిలు పడిపోతే ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రమౌతాయని ఆ నివేదికలో తేలింది.
విటమిన్ కె సాధారణంగా కూరగాయలు, కూరగాయ నూనెలు, తృణధాన్యల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. ఇది రక్తం గడ్డ కట్టడంలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. గాయాలను నయం చేయడంలో సహకరిస్తుంది. ఊపరితిత్తుల ఆరోగ్యంలో చాలా స్వల్పంగా పనిచేస్తుందని ఇప్పటివరకు భావించారు. తాజా అధ్యయనం ప్రకారం... ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి విటమిన్ కె సప్లిమెంట్స్ ఇవ్వొచ్చని పరిశోధకులు అంటున్నారు.
కోపెర్గెన్ యూనివర్శిటీ హాస్పటల్, కోపెర్గెన్ యూనివర్శిటీ సంయుక్తంగా చేసిన ఈ సర్వేలో డానిష్ పరిశోధకుల బృందం పనిచేసింది. కోపెర్గన్‌లో నివసించే వారిలో 4 వేలకు పైగా, 24 నుండి 77 ఏళ్ల మధ్య వయసు వారిని ఈ పరిశోధనలో పరిశీలించారు.
పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన పరీక్ష (స్పిరోమెట్రీ) నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించి చేసిన ఆ పరీక్ష తరువాత వారి జీవనశైలిపై కొన్ని ప్రశ్నలు వేశారు.
స్పిరోమెట్రీ పరీక్ష అంటే ఒక వ్యక్తి ఒక సెకను కాలంలో బయటికి వదిలే గాలి (ఫోర్స్‌డ్ ఎక్సిపిరేటరీ వాల్యూమ్ లేక ఎఫ్‌ఇవి1), అతను లోనికి పీల్చుకోగలిగే గాలి మొత్తం పరిమాణం (ఫోర్స్‌డ్ విటల్ కెపాసిటీ, ఎఫ్‌విసి) కొలుస్తుంది.
రక్తంలో విటమిన్ కె స్థాయిలు తక్కువ ఉన్న వ్యక్తుల్లో ఎఫ్‌ఇవి1, ఎఫ్‌విసిల పరిమాణాలు తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. సదరు వ్యక్తుల జీవనశైలిపై వేసిన ప్రశ్నల్లో కూడా వారు సిఓపిడి, ఆస్మ్తా, గురక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. 'ఊపిరితిత్తులు, విటమిన్‌కె అంశం మీద ఇఆర్‌జె ఓపెన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధన మొదటిది. ఇది మరిన్ని పరిశోధనలకు మార్గం వేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యంలో విటమిన్ కె కీలకమని మా పరిశోధనలో తేలింది' అంటున్నారు డాక్టర్ టోర్కిల్ జెస్పెర్సన్.










