
కాంగ్రెస్ 1991లో ప్రారంభించిన ప్రపంచీకరణ విధానాలు ఈ ముప్పయి సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఎంత వినాశనాన్ని తెచ్చాయో అనుభవం నేర్పుతోంది. వీటిని ఏ మాత్రం గుర్తించకుండా ఆ విధానాలే అభివృద్ధికి మూలమని ఈ విజన్‌లో చెప్పడం, వాస్తవాన్ని గుర్తించ నిరాకరించడమంటే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆర్థిక విధానాలను మరింతగా తలకెత్తుకోవడానికి సిద్ధపడడమే.
ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులు, ఉపాధి అందని నిరుద్యోగలు, పనుల కోసం పొట్ట చేతబట్టుకొని రాష్ట్రాలు, దేశాలు దాటుతున్న ప్రజలు, వ్యవసాయానికి దూరమవుతున్న రైతులు, కూలీలు, కనీస వేతనాలు అందని శ్రమజీవుల బాగు లేని విజన్ ఎవరి కోసం? మతం పేరుతో మారణకాండ సాగుతుంటే, స్త్రీలను వివస్త్రలను చేస్తుంటే, దళితులు, ఆదివాసుల హక్కులు కాలరాయబడుతుంటే, రాజ్యంగబద్ద సంస్థలు ఏలికల చుట్టాలు అవుతూ దేశమంతా ఈసురోమంటుంటే...విజన్ 2047 ఎవరి మెప్పు కోసం? వందేళ్ళ క్రితమే 'దేశమంటే మట్టి కాదోరు, మనుషులోరు' అన్న గురజాడ మాటను ఇలాంటివారి చెవుల్లో మారుమోగేలా వినిపించాలి.
ఆగస్టు 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో విజన్ 2047 ప్రకటించారు. ఇందులో సాధించాల్సిన లక్ష్యాలు, అందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి వివరించారు. స్వామి కార్యంలో స్వకార్యం లాగా తాను గతంలో రూపొందించుకున్న విజన్ 2020, సన్‌రైజ్ విజన్స్ గురించి చెప్పుకున్నారు. ప్రణాళికలు రూపొందించుకోవడం, వాటిని చేరుకోడానికి దారులు నిర్ణయించుకోవడం వ్యక్తిగతమైతే చర్చించాల్సిన అవసరం లేదు. కాని అది ఒక దేశ భవిష్యత్ కోసమని చెప్పిన తర్వాత వాటిపై చర్చ జరుగుతుంది. ఈ విజన్‌ను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు హోదా లోనో, మాజీ ముఖ్యమంత్రి హోదా లోనో ప్రకటించలేదు. 'గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్' ఛైర్మెన్ హోదాలో ప్రకటించడం మరో విశేషం. ఆయన అనేకమంది మేధావులతో, నిపుణులతో 'వందల గంటల పాటు కసరత్తు' చేసి రూపొందించినట్లు చెప్పుకున్నారు. సలహాలు, సూచనలు కావాలని ప్రజలను కోరుతూ బహిరంగ చర్చకు పెట్టారు. కావున ఈ విజన్ 2047 ఏమిటి? ఏం సాధించాలనుకుంటున్నారు? ఎలా సాధించాలను కుంటున్నారు? అనే విషయాలు చర్చనీయాంశంగా మారతాయి. అయితే దేశానికి సంబంధించిన ఈ విజన్ 2047 సాధించడంలో తెలుగుదేశం పార్టీ, అందులో చంద్రబాబు నాయడు పాత్ర ఎంత, ఎలా వుంటుంది అనేది వేరే విషయం. ఈ విజన్‌లో ప్రజల స్థానం ఏమిటనేది ముఖ్యమైన అంశం. దేశమంటే సంపద, సంపద అంటే పెట్టుబడిదారులు అనే నరేంద్ర మోడీ విధానమా? దేశమంటే మనుషులోరు అన్న విధానామా? అనేది ప్రశ్న.
వందేళ్ళ స్వాతంత్య్రం నాటికి...
2047 నాటికి మన స్వాతంత్య్రానికి వందేళ్ళ పూర్తవుతాయి. క్రీ.పూ 500 నాటి నుండి క్రీ.శ 1758 వరకు భారతదేశం ఒక విస్తృతమైన, బలీయమైన ఆర్థిక వ్యవస్థగా వెలుగొందిందని, 2047 నాటికి తిరిగి దాన్ని సాధించాలని, అందుకు ఈ విజన్ మార్గమని ఆయన తెలిపారు. 2047 నాటికి మన భారతదేశం ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని ఈ విజన్ ద్వారా చంద్రబాబు ఆశిస్తున్నారు. మూడవ శక్తి ఏమిటి....వీలైతే మొదటి శక్తిగా మన దేశం ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకోవాలి. కాని కోరికలను బట్టి ఆశలు నెరవేరవు. అనుసరించే మార్గాలనుబట్టి సాధించాలనుకుంటున్న చోటికి చేరుతామా లేదా అన్నది తేలుతుంది. 1991లో ప్రారంభమైన ప్రైవేటీకరణ విధానాల ఫలితాలను తాను ముందుగానే ఊహించి స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 'విజన్ 2020' రూపొందించినట్లు ఆయన ఈ విజన్‌లో రాసుకున్నారు. అంతేకాదు 1995-2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు తీయించారట !
కాంగ్రెస్ 1991లో ప్రారంభించిన ప్రపంచీకరణ విధానాలు ఈ ముప్పయి సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఎంత వినాశనాన్ని తెచ్చాయో అనుభవం నేర్పుతోంది. వీటిని ఏ మాత్రం గుర్తించకుండా ఆ విధానాలే అభివృద్ధికి మూలమని ఈ విజన్‌లో చెప్పడం, వాస్తవాన్ని గుర్తించ నిరాకరించడ మంటే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆర్థిక విధానాలను మరింతగా తలకెత్తుకోవడానికి సిద్ధపడడమే. సుమారు 40 సంవత్సరాలకు పైగా ప్రజల సొమ్ముతో ప్రభుత్వ రంగం ద్వారా నిర్మించుకున్న బిఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, బ్యాంకులు, ఎల్‌ఐసి లాంటి అనేక సంస్థలను, వాటి ఆస్తులను తెగనమ్మి కొద్దిమంది లాభపడి, లక్షల మందికి ఉపాధిని, సామాజిక న్యాయాన్ని దూరం చేసిన ఆ ఆర్థిక విధానాలు దేశ ప్రజలకు శాపంగా మారాయి. 2016 నుండి 2022 నాటికి దేశవ్యాప్తంగా 74,222 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేేంద్ర నేర పరిశోధన సంస్థ ప్రకటించింది. 1991 నుండి ఇప్పటి వరకు దేశంలో ఐదు లక్షల మందికి పైగా వ్యవసాయదారులు బలవన్మరణాలకు పాల్పడినట్లు, రెండు కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేసినట్లు రైతు సంఘాల నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకే ఈ విధానాలను ప్రారంభించిన కాంగ్రెసు పార్టీనే నేడు ఆ విధానాల గురించి మాట్లాడడం మానేసింది. అంతేకాదు, ఈ విధానాలకు మూలకర్త అయిన నాటి దేశ ప్రధాని పి.వి.నరసింహారావు తన పదవీ కాలం ముగిసిన తర్వాత హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన సన్మాన సభలో 'కొత్త ఆర్థిక విధానాల వల్ల దేశంలోకి కార్ల పరిశ్రమలు వస్తాయనుకుంటే కార్లు వచ్చాయి' అని వాపోయారు. సృష్టికర్తకు ఐదు సంవత్సరాలకే ఆ విధానాల తత్వం బోధపడితే, ఈయనకు మాత్రం ముప్పై ఏళ్లయినా బోధపడకపోవడం ఈ విజన్‌లోని ముఖ్యమైన దృష్టి లోపం.
మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ !
ప్రపంచ మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని ముందుకు తీసుకుపోతామని నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ గత తొమ్మిది సంవత్సరాలుగా చెప్పిన చోట చెప్పకుండా చెబుతూనే వున్నారు. అదే కీర్తనను ఇప్పుడు చంద్రబాబు అందుకున్నారు. ప్రస్తుత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ఐదవ స్థానంలో వుంది. అమెరికా 26.8 ట్రిలియన్ డాలర్లు, చైనా 19.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలు. జపాన్ 4.4, జర్మనీ 4.2, భారతదేశం 3.7 ట్రిలియన్ డాలర్లు కలిగివున్నాయి. రానున్న 25 సంవత్సరాల్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ 0.7 ట్రిలియన్ డాలర్లు తగ్గినా, మన దేశం 0.8 పెరిగినా మనం మూడవ స్థానంలోకి చేరుతాం. అయితే మొదటి, రెండు స్థానాలకు మూడో స్థానానికి ఎంత దూరం వుంటామనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 2035 నాటికి ప్రపంచ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తున్నది. అమెరికా తన అగ్ర స్థానాన్ని నిలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది.
భారతదేశ విశ్వగురు ఆర్థిక వ్యవస్థ
ఈ విజన్ డాక్యుమెంట్‌లో చంద్రబాబు పంచ వ్యూహాలు ప్రకటించారు. ఒకటి బహుళ జాతీయంగా భారతీయ సంస్థలు అభివృద్ధి కావడం, రెండవది నాలుగు 'పి' లు అమలు చేయడం, మూడవది కొత్త పరిశోధనలు, నాలుగు ఇంధన సమృద్ధి దేశంగా భారత్, ఐదు జల సమృద్ధి దేశంగా మారడం. విదేశీ బహుళజాతి సంస్థలు దేశంలోకి జొరబడి అన్ని రంగాలను లూటీ చేస్తుంటే ఇప్పుడు దేశ కంపెనీలు కూడా బహుళజాతి సంస్థలుగా మారాలని కోరుకుంటున్నారు. 4 'పి' లు అంటే పీపుల్ (ప్రజలు), పబ్లిక్ (ప్రభుత్వం), ప్రైవేట్, పార్టనర్ షిప్ (భాగస్వామ్యం) అనే ఈ నాలుగు 'పి' ల ద్వారా విజన్ 2047 లక్ష్యాన్ని సాధించాలని చంద్రబాబు ఆలోచన. వాస్తవంగా ఈ 'పి' లు కొత్తవి కావు. ప్రపంచబ్యాంకు విధానాలు దేశంలో అమలు చేయనారంభించిన నాటి నుండి ఇవి అమలవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానాలు అమలవుతున్నాయి. 1944లో దేశంలోని నాటి పెద్ద ప్రైవేట్ కంపెనీలు బాంబేలో కూర్చొని రూపొందించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ 'పి' ల పుట్టినిల్లు. ఈ విధానాల వల్లే కదా నాడు చిన్న చేపలుగా వున్న ప్రైవేట్ కంపెనీల సంపన్నులు నేడు మోడీ సేవతో దేశాన్నే కబళించే తిమింగలాలుగా మారింది. ఈ 'పి' ల విధానంలో కొత్తదనం ఏముంది? గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్, ఆర్టీసి, వివిధ ప్రభుత్వ సంస్థల్లో అమలు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వల్లే కదా ప్రజల చేత తిరస్కరించబడింది. నేటి బిజెపి ప్రభుత్వం మధ్య యుగాల భావాలు అమలు చేయడం కోసం శాస్త్ర విజ్ఞానాన్ని, పరిశోధనలను తీవ్రంగా హేళన చేస్తుంటే ఆ విధానాలను ఎదిరించకుండా పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయి? సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాల్లో ఇంధన, జల వనరుల్లో దేశం ఎలా సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తుంది ?
ప్రజల పరిస్థితులు ఏమిటి ?
గ్లోబల్ లీడర్ లక్ష్యం సరే దేశ ప్రజల పరిస్థితి మాటేమిటి? ప్రస్తుతం దేశ ప్రజల సగటు తలసరి ఆదాయం 2,601 డాలర్లు. ఈ లెక్కన మన ప్రపంచ దేశాల ర్యాంకింగ్‌లో మన దేశం 139వ స్థానంలో వుంది. ప్రపంచ ఆకలి సూచీలో 2022 నాటికి 107వ స్థానంలో వుంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కూరుకుపోయిన శ్రీలంక, పాకిస్తాన్, యుద్ధంలో మునిగిపోయిన ఉక్రెయిన్ కంటే మన దేశ ప్రజలు తీవ్ర ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. నాణ్యమైన విద్య, వైద్యం సాధారణ ప్రజలకే కాదు, దిగువ మధ్య తరగతిగా వున్న కోట్ల మందికి అందని సరుకుగా మారిపోయింది. పట్టణాల్లో వున్న ప్రజల్లో రెండు కోట్ల మందికి గృహ వసతి లేదని నీతి ఆయోగ్ చెప్పింది. రక్షిత మంచి నీరు అందని జనం సుమారు 32 శాతం పైగా వున్నారు. ప్రజలు అథోగతికి దిగజారుతుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి ఎగబాకాలంటే సంపన్నులు బలపడడమేనా? 2014కు ముందు ప్రపంచ సంపన్నుల వంద ర్యాంకింగ్‌లో స్థానంలేని అదానీ నేడు రెండవ స్థానానికి చేరడమే అభివృద్ధా?
ప్రజల పాత్ర లేని అభివృద్ధి అది సంపన్నుల అభివృద్ధే తప్ప, దేశాభివృద్ధి ఎలా అవుతుంది? అందుకే విజన్ 2047లో ప్రజల అభివృద్ధికి ప్రణాళిక లేదు. ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులు, ఉపాధి అందని నిరుద్యోగలు, పనుల కోసం పొట్ట చేతబట్టుకొని రాష్ట్రాలు, దేశాలు దాటుతున్న ప్రజలు, వ్యవసాయానికి దూరమవుతున్న రైతులు, కూలీలు, కనీస వేతనాలు అందని శ్రమజీవుల బాగు లేని విజన్ ఎవరి కోసం? మతం పేరుతో మారణకాండ సాగుతుంటే, స్త్రీలను వివస్త్రలను చేస్తుంటే, దళితులు, ఆదివాసుల హక్కులు కాలరాయబడుతుంటే, రాజ్యంగబద్ద సంస్థలు ఏలికల చుట్టాలు అవుతూ దేశమంతా ఈసురోమంటుంటే...విజన్ 2047 ఎవరి మెప్పు కోసం? వందేళ్ళ క్రితమే 'దేశమంటే మట్టి కాదోరు, మనుషులోరు' అన్న గురజాడ మాటను ఇలాంటివారి చెవుల్లో మారుమోగేలా వినిపించాలి.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్