జశ్వంత్ వాళ్ల ఇల్లు సముద్రపు ఒడ్డునే ఉంటుంది. రోజు లాగానే ఆ రోజు కూడా బడికి వెళ్ళచ్చాక, ఇంటి నుంచి సముద్రం వద్దకు వెళ్ళాడు జశ్వంత్.
అక్కడ అలలు తెచ్చే నీటిలో కాస్త కాళ్ళు మునిగేలా నిలబడగానే, తన దగ్గరకో నేస్తం వస్తుంది.
ఆ నేస్తం ఒక తాబేలు! జశ్వంత్ తాబేలును ముద్దుగా 'విష్ణు' అని పిలుచుకోసాగాడు. తాబేలు కూడా తన పేరును విష్ణుగా స్థిరపరచుకుంది.
జశ్వంత్ పిలుపు వినబడగానే ఎంతదూరంలో ఉన్నా, విష్ణు వెంటనే బయలుదేరి వస్తుంది. సాధారణంగా జశ్వంత్ వచ్చే సమయానికి, విష్ణు దగ్గర్లోనే తచ్చట్లాడుతూ ఉంటుంది.
పాదాలు మునిగేంత వరకు నీటిలో కాళ్ళను ఉంచి, రెండు చేతులను నోటి దగ్గర గుండ్రంగా ఉంచి, గట్టిగా 'విష్ణూ' అని కేకేశాడు జశ్వంత్.
ఇక్కడో చిన్న విషయం మర్చిపోయాము. జశ్వంత్‌ను ఇంట్లో అమ్మా నాన్న 'జెష్షూ' అని ముద్దుగా పిలుస్తారు.
అప్పుడప్పుడు జశ్వంత్ తనతో పాటు ఇంటికి తీసుకు వెళుతుంటాడు కాబట్టి, విష్ణుకు కూడా జశ్వంత్ ముద్దుపేరు తెలుసు.
కేక వినగానే విష్ణు వడివడిగా జశ్వంత్ దగ్గరకు వచ్చింది. కిందకు వంగి విష్ణును చేతుల్లోకి తీసుకున్నాడు జశ్వంత్.
చేతుల్లోకి తీసుకోగానే రోజులాగా లేదనిపించింది. జశ్వంత్ ముఖకవళికలను గమనించి.. తాను మామూలుగానే ఉన్నానని చెప్పేందుకు, ''జెష్షూ.. ఈ రోజు బడిలో విశేషాలేమిటి?' ప్రతిరోజూ అడిగినట్లుగానే అడిగింది విష్ణు.
తనేదో దాస్తోందనిపించింది.
'బడి విశేషాలు తీరిగ్గా చెబుతాలేగానీ.. నీ విషయం చెప్పు. కాస్త నలతగా కనబడుతున్నావేమిటి?' వీపు మీద నిమురుతూ అడిగాడు జశ్వంత్.
ఇక చెప్పక తప్పదనిపించింది.
'ఏం లేదు జెష్షూ.. నిన్నటి నుంచి గొంతులో సలుపుతోంది. తగ్గుతుందేమోనని ఇవాళ ఆహారం కూడా తీసుకోవడం మానేశాను. కానీ ఏమాత్రం మార్పులేదు.'
తలను డిప్పలోంచి బయటకు చాపి, తన మెడ కనిపించేలా చేసింది విష్ణు.
జశ్వంత్ ఆ మెడను సుతారంగా నిమిరాడు. అయితే ఆ కాస్త స్పర్శ కూడా విష్ణుకు అమితమైన బాధ కలిగించింది.
మొత్తానికి విష్ణుకు తీవ్రమైన ఇబ్బందే వచ్చిందని గ్రహించాడు జశ్వంత్.
జశ్వంత్ ఇంటికి దగ్గర్లోనే ఒక చిన్న ఆసుపత్రి ఉంది. కొన్నిసార్లు ఆరోగ్యం బాగా లేనప్పుడు నాన్న తనను అక్కడికి తీసుకెళ్ళేవారు. అక్కడి డాక్టర్ కూడా జశ్వంత్‌కు బాగా పరిచయమయ్యారు.
జశ్వంత్ వెంటనే విష్ణును ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్ళాడు.
సమయానికి ఆసుపత్రిలో రోగులెవరూ లేరు. డాక్టర్ ఒక్కరే ఉన్నారు.
జశ్వంత్ విష్ణును డాక్టర్ ఎదురుగా ఉన్న బల్లపై ఉంచి, దాని ఇబ్బందంతా చెప్పి మందు ఇమ్మన్నాడు.
'జెష్షూ.. నేనెప్పుడూ జంతువులకు వైద్యం చేయలేదు. నీవు అడుగుతున్నావు కాబట్టి విష్ణుని పరీక్షించి చూస్తాను. ఒకవేళ నాకు సాధ్యం కాకపోతే పట్టణంలో ఉన్న జంతువుల ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది' అని చెబుతూ.. విష్ణు గొంతును పరిశీలనగా చూశాడు డాక్టర్. అంతా మామూలుగానే ఉన్నట్లుంది. కానీ, గొంతు పట్టుకుంటే విలవిల్లాడిపోతోంది.
వెంటనే ఒక టార్చిలైట్ తీసుకుని, విష్ణు గొంతు లోపలికి వేసి చూశాడు. లోపల వేలి పొడవున్న నీలంరంగు వస్తువేదో కనిపించింది.
తన దగ్గరున్న శ్రావణం (చిన్న పట్టకారు) తో ఆ వస్తువును డాక్టర్ మెల్లగా బయటకు లాగాడు.
అది లాగుతున్నంతసేపూ విష్ణు విలవిల్లాడుతూనే ఉంది.
తీరా బయటకు తీశాక చూస్తే.. అదొక ప్లాస్టిక్ పెన్ క్యాప్ (మూత).
అది చూసి ఆశ్చర్యపోయారు.
దానిని చూడగానే జశ్వంత్‌కు తాను ఎన్నోసార్లు బయటకు విసిరేసిన ఖాళీ పెన్నులు గుర్తుకొచ్చాయి.
సముద్రపు అలల్లో తరచుగా తీరానికి కొట్టుకు వచ్చే చెత్త, ముఖ్యంగా అందులో ఉండే ప్లాస్టిక్ వస్తువులన్నీ కళ్ళ ముందు కదలాడాయి.
'ఏదో ఆహారం అనుకుని దీనిని మింగి ఉండాలి. లేదంటే పొరబాటున ఆహారంతో పాటు ఇది గొంతులోకి వెళ్ళి ఉంటుంది.'
మూతను అటూ ఇటూ తిప్పి చూపుతూ, 'ఇంకేం ఇబ్బంది లేదు తీసుకెళ్ళు!' అని డాక్టర్ భరోసా ఇచ్చాడు.
జశ్వంత్ విష్ణుని సముద్రంలో వదిలేందుకు తీసుకెళుతూ, 'నా స్నేహితులందరికీ విష్ణులాంటి మిత్రులు ఉన్నారు. రేపు ఈ సంగతి బడిలో చెబితే వాళ్ళు జాగ్రత్త పడతారు!' అనుకున్నాడు.
శాఖమూరి శ్రీనివాస్
9441075753