Nov 06,2023 10:56

మృతులకు సామూహిక అంత్యక్రియలు
క్షతగాత్రులకు ఉచిత వైద్యం : ప్రభుత్వ ప్రకటన
మరోసారి ప్రకంపనలు
ఖాట్మండు : 
 భారీ భూకంపం నుంచి నేపాల్‌ గ్రామాలు ఇంకా తేరుకోలేదు. శుక్రవారం రాత్రి భూకంపం సంభవించగా, ఇప్పటివరకూ వారికి పూర్తిస్థాయిలో సహాయం లభించడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. 6.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంతో జాజర్‌కోట్‌, వెస్ట్‌ రుకుమ్‌ జిల్లాల్లోని గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. రెండు జిల్లాల్లోనూ 157 మంది మరణించగా, సుమారు 400 మంది గాయపడిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామస్తులంతా కలిసి మృతులకు సామూహికం గా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్లతో దుంగలు, మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించి అంతిమ సంస్కారాలు జరిపిస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

మళ్లీ భూకంపం
శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకం పం నుంచి నేపాల్‌ తేరుకోకముందే ఆదివారం తెల్లవారు జామున మరో భూకంపం వచ్చింది. 4:38 గంటల సమయంలో 3.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.