Sep 25,2023 07:40

ఆధునికీకరణ చాకిరేవు బండ మీద
పల్లె పాదుల్లో పొదిగిన వృత్తులను
పాలకులు ఉతకెయ్య లేదు, చితకేశారు
అక్కడ ఉరితీయబడిన వృత్తులు
పట్టణ రాట్నపు రెక్కల్లో కూలెత్తుతున్నాయి

విత్తనంపై రైతు పెత్తనం తప్పించి
కార్పొరేట్ల గుత్త హక్కుగ కట్టబెట్టాక
ఎరువుల ధరలకు బరువులు ఎత్తి
రైతు బతుకు బరువెక్కించాక
వ్యవసాయం ఎగసాయమైంది
నాగటి కర్రు నేల చాలులో సమాధైంది
మార్కెట్లలోకి దూరిన కార్పొరేట్ల కత్తి
ధరల మెడపై వేలాడి ఉసురు తీసింది

పట్నమిపుడు పల్లె యాసబాసల
నవ యవ్వనం నింపుకుంటుంటే
పల్లె ఊతకర్రలా మారిన ముల్లుగర్రయి
పొలంవైపు దిగులు చూపులు చూస్తోంది
పచ్చదనం మొలకెత్తక బీడైన పొలంపై
రైతు కళ్ళ జాలి చూపుల గాలి వీస్తోంది

సంక్రాంతికి దుమ్మురేపుకుంటూ
కార్లలో రరు రరుమని వాలే
పట్టణ పక్షులు అతిథులై వాలేప్పుడే
పల్లె తొర్రి పళ్ళతో నవ్వుతోంది
పల్లిప్పుడు సప్త వర్ణాల హరివిల్లు కాదు
ఆకాశపు ఎడారి గుర్తుల తడి లేని మడుగు
ఎప్పుడే ఊపిరి రద్దుపద్దులో పడుతుందో తెలీని
వృద్ధ దేహాల ఊతకర్ర అడుగుల ఊరేగింపు
 

- ఉన్నం వెంకటేశ్వర్లు