Nov 15,2023 21:45

అరకులోయ, అనంతగిరి రూరల్‌ (అల్లూరి జిల్లా), గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) :అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని రవ్వలగుడ క్రీడా మైదానంలో జన జాతీయ గౌరవ దివస్‌ను, వికసిత భారత్‌ సంకల్ప యాత్రను బుధవారం రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రారంభించారు. తొలుత గిరిజన స్వాతంత్ర యోధుడు భగవాన్‌ బిర్సా ముండాకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్‌ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా ఎదురొడ్డి బిర్సా ముండా పోరాడారని తెలిపారు. గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకోవడానికి జన జాతీయ గౌరవ దినోత్సవం దోహదపడుతుందని పేర్కొన్నారు. బ్రిటిష్‌ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును కూడా మనం స్మరించుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అమలు చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన మూడు వ్యాన్లను జెండా ఊపి గవర్నర్‌ ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గిరిజన మహిళలకు వంటగ్యాస్‌ స్టౌ, సిలిండర్లను పంపిణీ చేశారు. గిరిజనులకు భూ హక్కు పత్రాలను అందించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన సమరయోధుల ఫొటో ప్రదర్శనను వీక్షించారు. ముందుగా గవర్నర్‌కు గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజరుజైన్‌, అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ శివశ్రీనివాస్‌, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు మురళి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి, పాడేరు ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ పాల్గొన్నారు.

  • పార్వతీపురం మన్యం జిల్లాలో...

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపుంరలో వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగి ఇంకా నమోదు కాకపోతే వెంటనే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక అధికారి శోబిత్‌ గుప్త, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.