బతికున్న బానిసత్వానికి
నిలువెత్తు గీతాలు
ఆకలి పాము కాటేసిన
బడుగు మధ్యతరగతి ఆడపిల్లలు
సూర్యుడు కదలకుండా నిలబడడు
చంద్రుడు ఒకేచోట స్థిరపడడు
పొద్దుట నుంచి రాత్రి వరకు
నేలలో పాతిన స్తంభాల్లా
కట్టుకొయ్యల్లా గంటల యుగాలు
పాతుకుపోవడం ఎంత నరకం!
కట్టు బానిసలు కూడా తప్పించుకుంటారు
చెరసాలలో ఖైదీలు పారిపోతారు
బతుకులు కాసిని రూపాయలకు
అమ్ముడుపోయినందుకు
మనుషులు భూమిలో దిగబడిన కట్టుకొయ్యలు
ఉద్యోగ నియామకంలో
ఒప్పందంలో భాగమా?
రోజూ ఉగ్గబట్టుకున్నా
ఆ మూడు రోజులూ
బండబారిన కాళ్ళతో
ఉద్యోగానికి స్వస్తి పలకాలనుకున్నప్పుడల్లా
నెత్తిమీద మొట్టికాయలు కొట్టే అవసరాలు
నచ్చినదాని కోసం కట్టల కట్టల చీరలన్నీ
విప్పి చూపే పిల్లలు
నీకు నప్పే రంగురంగుల గాజుల
ఇంద్రధనస్సులను చేతికి తొడిగే పిల్లలు
పాపం
లోపల కష్టాల కన్నీళ్లు చారలు బయటకు
కనబడకుండా
ముఖం మీద పాల వెన్నెల పౌడరద్ది
పెదవులపై చిరునవ్వుల విరజాజులు విరబూసే పిల్లలు
బట్టల షాపులను ఫాన్సీ షాపులను వెలిగించే
అమావాస్య చందమామలు
ఆకురాలు కాలంలో నేలపై రాలిన పువ్వులు!
- మందరపు హైమవతి
94410 62732