కారకాస్ : అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా వేలాదిమంది వెనిజులా ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. లా గుయెరా నగర వీధుల్లో గురువారం నిర్వహించిన సిటిజెన్స్ మార్చ్‌కి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో తన మద్దుతును తెలియజేశారు. ఈ సందర్భంగా మదురో ఓ ట్వీట్ చేశారు. 'మేము సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం లేదు. ప్రతిఘటనలను, పోరాటాలను కొనసాగిస్తాము. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ బొలివేరియన్ విప్లవాన్ని గుర్తుచేస్తున్నాను. వాలెస్‌డెల్ టురులోని శాంటా లూసియా వీధుల్లో పోరాట విప్లవకారులను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. మాతృభూమి రక్షణలో భాగస్వామ్యమైన పౌరులందరికీ, వారి ప్రేమకు నా ధన్యవాదాలు. వీధుల్లో పౌరుల ప్రసంగాలు, వారు చూపిస్తున్న తెగువకు మేము కచ్చితంగా గెలుస్తాము' అని మదురో తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లా గుయెరా రాష్ట్ర గవర్నర్ జోస్ టెరాన్ మాట్లాడుతూ.. 'ప్రజల నిరసనలకు వ్యతిరేకంగా వారిని దిగ్భందించడం గానీ, లేదా.. జోక్యం చేసుకోవడం గానీ చేయమని' ఆయన అన్నారు.










