Aug 21,2023 07:54

'నీలకురింజి సముద్రం' పేరిట వైవిధ్యమైన శీర్షికతో డాక్టర్‌ ఎం.ప్రగతి ఇటీవల కవిత్వ సంపుటి వెలువరించారు. ఈ కవిత్వంలో జీవితానుభవాలు, జ్ఞాపకాలు, అనుభూతులు, ఆత్మీయ ఆలింగనాలు మదిపొరల్లోంచి తెరలు తెరలుగా మన కళ్ళముందు ఆకాశమంత నీలికన్నులలోంచి నీలికురింజి సంద్రాన్ని చూస్తున్నట్లనిపించింది. కవితకు ఎత్తుగడ ఉంటేనే మస్తిష్కంలోకి పాదరసంలా పయనిస్తుంది. ఎంత గొప్పగా ఎత్తుగడ ప్రారంభమౌతుందో చూడండి.
రాలిన చినుకు నదిగా ఎప్పుడు మారిందో తెలీదు
ప్రవహిస్తూ ఉండటం తన సహజ లక్షణం! (నిర్మల ప్రవాహిని). కవిత ఇతివృత్తాన్ని జీవితానుభవం నుండి.. స్వానుభవం నుండి తీసుకున్నట్లుంటుంది. కవితను ఆరంభించి ముగించడం కూడా యుద్ధంతో సమానమే. కవులు అప్పటికప్పుడు యుద్ధ మైదానాలవుతారు. ఎలాగంటే ...
తన ఇంటి గోడలకంటిన ఆకలి మరకలు/ మరో కంటికి కనిపించకూడదని/ కొడుకుగా వెల్లగా వెల్లువై నిలిచానన్నాడు/ కలాన్ని కలల్ని కాలానికొదిలేసి తను/ పెయింట్‌ బ్రష్షుగా మారిపోయానన్నాడు/ గోడల నిండా రంగులను వొంపేసి/ మెదడులో అక్షరాలను/ మిగుల్చుకోలేకపోయానన్నాడు/ చేతుల కంటిన రంగుల్ని కడిగేసుకోవడానికి/ తీరిక దొరకనివాడు/ మెదడులో పేరుకుపోయిన ఇక్కట్ల/ చీకటి రంగునెప్పుడు వదిలించుకుంటాడు/ అతనిప్పుడు ఖాళీ అయిన రంగుడబ్బా (అతనో ఖాళీ రంగుడబ్బా)
జీవితాన్ని ఉన్నతీకరించడమే సాహిత్యం యొక్క ప్రయోజనం. డా.ప్రగతి గారి ఆలోచన, ఆచరణ వేర్వరు కావు. రెండూ రెండు కన్నుల్లా కలసి సాగుతాయి. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ తనకున్న ప్రాపంచిక దృక్పథం, సమాజం పట్ల బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి. నిర్ధిష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే గొప్ప కవిత్వం రాయడం సాధ్యం. ప్రణరు పరువు హత్యకు గురైనప్పుడు ఇలా రాశారు : ''నా ప్రేమను దహించిన కులోన్మాద జ్వాలల్లో నేనూ భస్మమై నా ఆగ్రహాన్ని ప్రకటించాలనుకున్నా.. ప్రణయగీతాన్ని చివరికంటా ఆలపించాలన్న నా కర్తవ్యాన్ని కనుమరుగైన నా తోడు గుర్తు చేసింది.'' (నీ బీభత్స ప్రేమ నాకొద్దు నాన్నా!). కుల దురంకార హత్యల్ని ప్రశ్నిస్తూనే అసమానతల సమాజం అంతం కావాలని ఈ కవయిత్రి త్రికరణశుద్ధిగా కోరుకుంటారు. ''మనిషి పేరులోనూ రెండు పదాలు నింపుకుంటున్నాం. ఒకటి తనది.. మరొకటి మానవ సమూహం నుండి విడదీసేది. ఈ తోకలూ, కొమ్మలూ ఇంక అవసరమా? మన పిల్లలకైనా లేకుండా చేద్దాం/ అంతా మనవాళ్ళేనని నేర్పిద్దాం..'' (మనోళ్ళేనా..) ఎంత విస్పష్టంగా చెప్పారో కదా!
ఈ రోజు మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత అపసవ్యంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశ్నించే వాళ్ళను కారాగారాల్లో బంధిస్తున్న సందర్భం ఇది. మేథావుల్ని హత్య చేసేందుకు కూడా వెనకడుగువేయని దుర్మార్గ రాజకీయ వ్యవస్థలో మనం బతుకుతున్నాం. దీనిని గమనించి, ప్రకటించటానికి స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉండి తీరాలి. తనకు ఉంది కాబట్టే ఈ కవయిత్రి ఇలా రాశారు : ష్‌..అరవకండి/ ఈ దేశం రామరాజ్య స్థాపన కోసం సన్నదద్దమవుతుంది/ ఆవు పంచకం చాలడంలేదు/ ప్రాంగణం శుభ్రం చేయడానికి../ ఆలయాల్లో సరికొత్త సంతర్పణలు/ బాల్యపు నెత్తుటి ధారలతో../ ప్రమిదల నిండా చమురు పోసి/ దీపాలు వెలిగించడం ఇంకానా?/ కాయాన్ని పిండి ఉన్మాద జ్వాలలు మండిద్దాం/ చక్కెర పొంగలి, పులిహౌర, దద్దోజనాలు పక్కనబెట్టి/ పసితనపు లేత శరీరాన్ని నైవేద్యంచేసేద్దాం/ పసిదైతేనేం శరీరం ఆడదేగా/ మదోన్మత్తు తీర్చుకుందాం/ దేవుడి మీదొట్టు!/ దేవుడికి నైవేద్యం పెట్టాకే/ రక్తమాంసాలతో పండగ చేసుకుంటాం./ మిగిలిన తునకలు అడవుల్లో/ కాకులకు గద్దలకు విసరేస్తాం./ ఆపైన అంతా రామరాజ్యమే.. (ష్‌)
దేశ వర్తమాన పరిస్థితి ఎలా ఉందో ఈ కవిత అద్దం పడుతుంది. కవులు ఇలా ఎప్పటికప్పుడు ఈ పాలకులు అధికారం ముసుగులో చేస్తున్న దురాగతాలను ఎండగట్టాల్సిందే! ఆ పనే ప్రగతి ఈ కవిత్వం ద్వారా చేశారు. నేటి పాలకులు కార్పొరేట్లకు ఎలా అమ్ముడుబోతున్నారో ఈ కవిత చూడండి... : '' మంది కష్టంతో కరెన్సీ నోట్లు/ పండించుకుంటారొకరు/ మందికోసం చెమటబొట్లను తిండి గింజలుగా మారుస్తారింకొకరు.. (కొత్త ఉషస్సు కోసం).
ఈ కవితా సంపుటిలో అనేక కవితలు అనుభూతులను కలిగించే భావ విన్యాసం చేస్తాయి. సామాజిక మాధ్యమాలొచ్చాక భావకవిత్వం విస్తృతంగా వస్తుంది. ఈ సంపుటిలోనూ ఇలాంటి కొన్ని కవితలు చూడొచ్చు. 'నీ మెడ శిఖరం చుట్టూ నా చేతులు/ సెలయేళ్ళై చుట్టుకుంటాయి./ నీ మమతల గిరుల మొదళ్ళు/ ఈ సెలయేళ్ళ చుట్టూ పచ్చని కాపు కాస్తాయి/ నా కురులు నీ మనసును/ ఊయలలూపే పిల్ల తెమ్మెరలవుతాయి/ నీ ఊపిరి సుగంధంనా సిగలో పోలకు పరిమళాన్నద్దుతుంది.' ఇలా ఆత్మీయ బంధం కళ్లకు కట్టినట్టుగా ఈ కవిత సాగిపోతుంది. కవిత్వమంటే ఏమిటో ఈ విధంగా నిర్వచిస్తారు ఈ కవయిత్రి. ''కవిత్వమంటే అక్షరం కాదు అనుభూతి. భాషను మించిన భావం'' ''కాగితంపై అక్షరాలు గుమ్మరిస్తే కవిత్వం తయారైపోతుందా? అల్లిబిల్లి పదాల పూలను సౌరభాల మరువాన్ని పొందిగ్గాకూర్చితే తయారయ్యే కొత్తసుగంధం కవిత్వం కావాలి'' అంటారు.
ఈ సంపుటికి శీర్షికగా ఉన్న ''నీలికురింజి సముద్రం'' కవయిత్రి తన తండ్రి స్ఫురణతో రాసిన కవిత. ''నీ భుజం మీదకెక్కి /లోకాన్ని చూసిన దశ్యం /నాగెవనంలో లేదు నాన్నా.../ మా అమ్మో నాయనమ్మో / చెబితే తప్ప తెలియలేదు/ వూహ తెలిశాక లోకం చూశాక / నీకు నాకు మధ్య తెలీని దూరం/ అయినా నిన్ను చూస్తూనే పెరిగాను కదూ!/ నీ జేబుకు చిల్లుపడ్డాక కూడా/ నీ వేలి ఉంగరం మరెవరికో/ అక్కర తీర్చిందని తెలిశాక/ మా నాన్నంటే యెంత గర్వమో! / రాజకీయమద పొట్టేళ్లు కొన్ని/ నీ హౌదాను ఢకొీని కొమ్ములు విరగ్గొట్టుకున్నాక/ 'నువ్వు శానా గట్టోనివప్పో...' / మాటలో విరుపు పొగడ్తనో తెగడ్తనో/ చెప్పకనే చెబుతుంది/ ఆ మాటకు ముందో వెనుకో/వో జాతీయమో, మరో/ విశేషణమో/ వెక్కిరించినట్టు వినపడుతూనే వుంటుంది/ వాళ్ళ వెటకారాలకేం గానీ/ వాళ్ళెంత తలెత్తి చూసినా/ ఆ/ చూపులకందుతావా నువ్వు?/ నీ వ్యక్తిత్వం/ అరుదైన నీలకురింజి నగం!/ నీ హదయం/ లోతెంతో తెలియని నీలాల సాగరం!/ ''నీ బిడ్డంతా నీ తిన్ననేనప్పా/ మాటా మనిషీ...'' అంటూ/ నీ నేస్తుల మెచ్చుకోళ్లు విన్నప్పుడు/ నీ ముఖంలో మెరుపు/ వాళ్ళ అమాయకత్వం గానీ/ నేను నువ్వెలా అవుతాను/ నువ్వో నీలకురింజి సముద్రం/ నేనో చిన్ని నీలలోహిత సుమాన్ని మటుకే!/ లోతెంతో తెలియని నీలాల సాగరం!''
తన తండ్రి ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా చెప్పారో కదా! మనసు తేలిక పడినట్లు.. అమాంతంగా వచ్చిన అలలు తనువును తడిపేసినట్లు.. ఆత్మీయతతో బుగ్గల్ని తడిపిన కన్నీటిధారలు ఎన్నో భావాలను మోసుకొచ్చినట్లు ఈ నీలకురింజి సముద్రం కనబడింది. ఈ సంపుటిలోని కవితలు కొన్ని వ్యవస్థని ప్రశ్నిస్తే.. మరికొన్ని పాలకుల దుర్నీతిని ఎండగడతాయి. ఇంకొన్ని కవితలు తాత్వికతనూ, అనిర్వచనీయమైన అనుభూతినీ పలికిస్తాయి. ఈసంపుటిలోని ప్రతి కవితా ప్రత్యేకించి ప్రస్తావించదగ్గదే! అందరూ చదివి ఆస్వాదించదగ్గదే!
 

- కెంగార మోహన్‌
94933 75447