
మూడడుగుల వారమే...
నిజమే నేను అందవిహీననే
ముఖపద్మం మీదకి ఈదుకుంటూ
మెరిసే మీనాలు రాలేవు
శ్వాసించేందుకు పచ్చ సంపెంగ నాసిక
నీలాకాశం మీద విచ్చుకోలేదు
నలుగురిలో కళ్ళల్లోకి ధైర్యంగా చూసేంత ఎత్తులో తలెత్తి మాట్లాడటానికి
అందమైన పెదవులు కూడా లేని
భూమికి మూడడుగుల వామనలమే
అవును మరుగుజ్జులమే!
ఆడదానిలా గాజులు తొడుక్కుని లేమని
అహంకార మగగొంతు మైకుల్లోంచి గర్జిస్తే
మహిళా సమూహాల ర్యాలీలు జరుగుతాయి
ఏ కులాన్నో మతాన్నో
అధికారమదపు విశ్వరూపం
మాటలతోనే అవమానకరంగా
భూస్థాపితం చేయాలనుకుంటే
రెండోరోజే ప్రయాణ సాధనాల అస్థిపంజరాలు
గోడౌన్ సమాధిలో నిద్రిస్తాయి
నగరాల పట్టణాల జీవితాలు
జీవించటం మర్చిపోతాయి!
కానీ మేమో
మూడడుగుల చిన్ని ప్రాణాలం కదా
ఆజానుబాహుల ప్రపంచంలో
మైనార్టీ సంఖ్యలం కదా
అందుకే కదా
మరుగుజ్జులతో పోటీ ఏమిటనీ
అంత ధైర్యంగా అనగలిగారు!
కానీ, ఒక్కటి మాత్రం నిజం
నేలకి దగ్గరగా ఉన్నందున
భూమ్యాకర్షణ శక్తిని పీల్చుకున్న
మా గుండెకి బలమెక్కువ
మా మెదడుకు తెలివీ ఎక్కువే
భూమికి లాగే సహనము ఎక్కువే!
అయితే తొలిచేస్తుంటే భూమి
మౌనంగా చూస్తూ ఉండటం లేదు
సమయం చూసి ఫెటేల్మనీ విచ్చుకునీ
మీరు కూడబెట్టిన ఆస్తుల్నీ
మిమ్మల్నీ కూడా మింగ గలదు.
అలాగే ఏదో ఒకనాడు
మరుగుజ్జులమైన మేమూ అంతే!
- శీలా సుభద్రాదేవి
81068 83099