Oct 02,2023 07:47

             సత్యాన్వేషణతోనే కాదు; పత్రికారచనతోనూ స్వేచ్ఛ కోసం ఎంతో పరితపించాడు మహాత్మా గాంధీ. సంపాదకునిగా భారతీయ జర్నలిజానికే వన్నె తెచ్చారు. హిక్కీ, రారు వేసిన బాటలను దేశమంతా రహదారులుగా విస్తరించిన పాత్రికేయుడు గాంధీజీ. పత్రికల ద్వారా ఆయన అందించిన ఆలోచనలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. జాతి మనుగడలో మహాత్మా గాంధీ కషి అడుగడుగునా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భారతీయ బౌద్ధ సంస్క ృతి నుంచి జనించిన సత్యాగ్రహమే సకల సమస్యలకు పరిష్కారమని చెప్పి ఆచరించారు. తన స్వీయచరిత్ర 'మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌'లో అహింస గొప్పతనాన్ని వివరించారు. తన ఆలోచనలో సత్య భావన సార్వభౌమిక సూత్రమని అన్నారు. మాటల్లోనే కాదు; ఆలోచనల్లో కూడా సత్యాన్ని నింపాలని నినదించారు. జాతి రాజకీయ విమోచన మహాత్ముని ఆలోచన. ఇదే మార్గంలో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహోజ్వలం చేయగలిగారు. చంపారన్‌ సత్యాగ్రహం (1917)తో మొదలెట్టి రైతులను, అహ్మదాబాద్‌ సత్యాగ్రహంతో కార్మికులను స్వాతంత్య్ర ఉద్యమంలోకి నడిపించటానికి ప్రయత్నించారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం (1930)తో ప్రజల్లో స్వాతంత్య్ర భావన నింపారు. క్విట్‌ ఇండియా ఉద్యమంతో ఆంగ్ల ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తీసుకొచ్చారని చరిత్రకారులు ఆయన్ని కొనియాడారు.
            ఎస్‌.నటరాజన్‌ 'హిస్టరీ ఆఫ్‌ ప్రెస్‌ ఇన్‌ ఇండియా' గ్రంథంలో మహాత్మాగాంధీ 'యంగ్‌ ఇండియా' పత్రిక విజయాలను సోదాహరణంగా విశ్లేషించారు. ఈ పత్రికలో చాలా ఉన్నతస్థాయి మేధోవర్గం చేసిన రచనలు స్వాతంత్య్ర ఆకాంక్షల్ని రెట్టింపు చేశాయని పేర్కొన్నారు. ఈ పత్రికా ప్రభావంతో 'స్వరాజ్య' పత్రిక పన్నెండేళ్ళు నడవడం భారతజాతికి ఎంతో మేలు జరిగిందన్నారు. మహాత్మా గాంధీ ఈ పత్రికలో బానిసత్వం నుంచి విమోచన, వెట్టిచాకిరీ నిర్మూలన, మానవతా విలువలు పెంపొందించే రచనలు చేశారు. హరిజన్‌ పత్రికలో 'భారతదేశాన్ని వదిలివెళ్ళండి' అంటూ ఆంగ్లేయులను హెచ్చరించారు. 11మే 1942 హరిజన్‌ సంచికలో కొత్త శతాబ్దాన్ని ఆవిష్కరిద్దామని, రక్త రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ''పత్రికారచన నా వత్తి కాదు. నేను నా ఆలోచనలను ప్రచారం చేస్తానని'' హరిజన్‌ పత్రిక 18 ఆగస్టు 1946 సంచికలో గాంధీ పేర్కొన్నారు. భారతీయుల స్వేచ్ఛ కోసమే తన రచనలు కొనసాగుతాయని అన్నారు.
           మహాత్మా గాంధీ పత్రికారచనతో పాటు సామాజికోద్ధరణకు పూనుకున్నారు. దీనిలో భాగంగా 1930లో ఢిల్లీ హరిజన వాడల్లో పర్యటించారు. అక్కడి ప్రజలు అనుభవిస్తున్న దారిద్య్ర పరిస్థితుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కనీస వసతుల కల్పన కోసం మీరంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బాల్మీకీ కాలనీలో ఏప్రిల్‌ 1, 1946 నుంచి జూన్‌ 10, 1947 వరకు 214 రోజులు వారితో కలసి జీవించారు. ఇక్కడ పిల్లలకు ఆయన హిందీ, ఇంగ్లీషు బోధించారు. అప్పటి ఆ బ్లాక్‌ బోర్డు వాల్మీకి ఆలయంలో ఇంకా భద్రంగానే వుంది. లూయిస్‌ ఫిషర్‌ 'ది లైఫ్‌ ఆఫ్‌ మహాత్మ'లో గాంధీకి ప్రజల పట్ల, దేవుని పట్ల సమానమైన భక్తి భావన వుందని పేర్కొన్నారు. జాతీయోద్యమ పత్రికలన్నీ ఆయన పంథానే అనుసరించాయి.
             మహాత్మా గాంధీ గొప్ప భావవ్యక్తీకరణశీలిగా ప్రపంచమే ఆయన్ని గుర్తించింది. న్యాయవాద వత్తి కోసం దక్షిణాఫ్రికాలో జీవించినకాలంలో అంతర్జాతీయ పత్రికల్లో ప్రపంచ పరిణామాలను ఆయన గమనించారు. ఆంగ్లేయుల పాలనలో వివిధ ప్రాంతాల, జాతుల అణచివేతను పరిశీలించారు. అక్కడే ఆయన పత్రికారచన పట్ల అభిరుచి పెంచుకున్నారు. 'ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రికకు సంపాదకునిగా మారారు. ఈ పత్రికను ఇంగ్లీష్‌, తమిళం, గుజరాతీ భాషల్లో ప్రచురించారు. పత్రికలు ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని వార్తా ప్రచురణ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆధునిక కాలానికి తగిన వినూత్న భావాలను రేకెత్తించాలన్నారు. సంపాదకునిగా ఆరు పత్రికలతో గాంధీ అనుబంధం కలిగి వున్నారు. భారతీయుల మనోవేదనలను ఆవిష్కరించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సమీకరించడానికి బహిరంగ లేఖలు, సంపాదకునికి లేఖల్ని ఆయన ప్రచురించారు. సత్యాగ్రహ (1919), నవజీవన్‌ (1919) పత్రికలకు రచనలు చేశారు. వీటిలో పారిశుధ్యం, స్వీయ క్రమశిక్షణ, పౌరసత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పత్రికారచన ఏకైక లక్ష్యం సేవ అనేది ఆయన దృఢ అభిప్రాయం. వార్తాపత్రిక ఒక గొప్పశక్తి, కాని దీనికి నియంత్రణ అవసరం అన్నారు. గొలుసుకట్టు లేని నీటి ప్రవాహం మొత్తం పల్లెలను ముంచి, పంటలను నాశనం చేసినట్టే నియంత్రణ లేని కలం సమాజాన్ని నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. జర్నలిజం మొత్తం నిర్భయంగా మారాలి, పర్యవసానాలను తట్టుకొని నిలవాలన్నారు. ఆయన పత్రికారచన అత్యంత వేగంగా ప్రజల్లోకి దూసుకుపోయింది. సమాచారాన్ని సష్టించి దాని విజ్ఞానదాయకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే గుప్తనైపుణ్యాన్ని గాంధీ సాధించగలిగారు. యువ జర్నలిస్టులకు మార్గనిర్దేశం చేయడంలో గాంధీజీ సిద్ధంగా ఉండేవారు. ప్రెస్‌ను ఫోర్త్‌ ఎస్టేట్‌ అని పిలిచే జర్నలిస్టులు ఖచ్చితంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం నేరమని అన్నారు. బాధ్యతతో సత్యాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు.
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మహాత్మా గాంధీజీలోని గొప్పతనాన్ని వ్యక్తీకరించారు. మహాత్ముని పిలుపుతో భారతదేశం గొప్ప నమ్మకంతో కొత్తగా వికసించిందన్నారు. బుద్ధుడు అన్ని జీవుల పట్ల సహదయ భావన, సత్యమార్గాన్ని ఆచరించిన నాటి స్పందనలా ఇప్పుడు ప్రజలు గాంధీజీ మాటలకు కదులుతున్నారన్నారు. గాంధీజీ మద్రాస్‌ 'ది హిందూ' పత్రిక కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో చేసిన ప్రసంగం జర్నలిజం మీద ఆయనకు గల తాత్త్విక దక్పథాన్ని వెల్లడిస్తోంది. జర్నలిజం స్వార్థ ప్రయోజనాల కోసం లేదా కేవలం సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం వ్యభిచారం లాంటిదని ఆయన ఆ సందర్భం పేర్కొన్నారు. ''ఈ విషయాన్ని జర్నలిస్టులకు పదే పదే చెప్పడంలో నేను అలసిపోను. జర్నలిజం సేవాపరమైనదిగా నేను ఎప్పటికీ భావిస్తాను.'' అన్నారు. టైమ్‌ మ్యాగజైన్‌ 20వ శతాబ్దపు విస్తత శక్తులు, గొప్ప సంఘటనలను వివరిస్తూ గాంధీజీని అగ్రస్థానంలో నిలబెట్టింది. మహాత్మాగాంధీని కేవలం భారత జాతీయ నాయకుడిగా పరిమితం చేయడం తగదన్నారు. గాంధీజీని ప్రపంచ మానవాళికి చెందిన గొప్పవ్యక్తిగా భావించాలని ఆ పత్రిక పేర్కొంది. ఇన్ని గొప్ప జీవిత పార్శ్వాలతో నిండిన మహాత్మా గాంధీ కషి, త్యాగం, స్ఫూర్తి ఈ కాలంలో మరింత అవసరం. అటు పాలకుల్లో పొడచూపుతున్న సంకుచిత, స్వార్థ భావాలను తుద ముట్టించటానికి; ఇటు జర్నలిజంలో తలెత్తిన ఏకపక్ష, కార్పొరేట్‌ అనుకూల ధోరణికి అడ్డుకట్ట వేయటానికి గాంధీ తన రచనల ద్వారా, రాతల ద్వారా వెల్లడించిన విలువల నిర్దేశం ఇప్పుడు అనుసరణీయం.
 

- డాక్టర్‌ జికెడి ప్రసాద్‌,
93931 11740