Sep 23,2023 08:33
  • పిసిపల్లి, కనిగిరి మండల వాసులను కబళిస్తోన్న వ్యాధి
  • ఫ్లోరిన్‌ సమస్యతో ఏళ్ల తరబడి వీడని మహమ్మారి
  • సాగర్‌ జలాలు అందించడంలో పాలకుల నిర్లక్ష్యం

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని, పిసిపల్లి, కనిగిరి మండల్లాలోని ప్రజలను కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. కనిగిరి మండలంలో కంటే పిసిపల్లి మండలంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దశాబ్దాల ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో, ఊరూరా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ఊరికి పది నుంచి పదిహేనుమందికిపైగా ఈ వ్యాధితో ప్రస్తుతం బాధపడుతున్నారు. చికిత్స కోసం అయ్యే ఖర్చు భరించలేకపోతున్నారు. గత పదేళ్లలో ఊరికి ఇరవై మందికిపైగా ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారని, ఈ లెక్కలను పాలకులు గణాంకాల్లో చేర్చకుండా సమస్య తీవ్రతను మరుగున పరుస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. పిసి పల్లి మండలంలో 18 పంచాయతీల్లోని 56 గ్రామాల్లో, కనిగిరి మండలంలో 23 పంచాయతీల్లోని 58 గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ గ్రామాల్లోని భూగర్బ Ûజలాల్లో ఫ్లోరిన్‌తోపాటు సిలికాన్‌, కోబాల్ట్‌, క్రోమియం తదితర ఏడు రకాల ప్రమాదకరమైన మూలకాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటిలో సాధారణంగా ఫ్లోరిన్‌ 1.5 పిపిఎం లోపు ఉంటేనే తాగడానికి సురక్షితం. కనిగిరిలో 5.4 పిపిఎం ఉంది. బొగ్గులగొంది కాలనీలో 14 శాతం ఉంది. ఇదే అత్యధికంగా ఉన్న ప్రాంతం. పిసిపల్లి మండలం కమ్మవారిపల్లెలో 9 పిపిఎం ఉంది. మిగతా గ్రామాల్లోనూ 3.5 పిపిఎం నుంచి 5 పిపిఎం వరకూ ఫ్లోరిన్‌ ఉంది. ఈ నీరు తాగడానికి ఏ మాత్రమూ పనికిరాదని గతంలోనే తేల్చారు. ఈ మేరకు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని ఆ మండలాల ప్రజలు చెప్తున్నారు. తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నేటినే తాగాల్సి వస్తోంది. దీంతో, ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడుతు న్నారు. ఎముకల వ్యాధులతోపాటు కిడ్నీలూ దెబ్బతింటున్నాయి. భారీ తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి ఫ్లోరిన్‌ బాధిత ప్రాంతాలకు సాగర్‌ నీటిని అందించాలని నాలుగు దశాబ్దాల క్రితం అధికారులు రూపొందించిన ప్రణాళికలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ సమస్యపై కేంద్రానికి నివేదికలు వెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం బబుల్‌ వాటర్‌ కొని తాగుతున్నా కిడ్నీ వ్యాధి అదుపులోకి రావడం లేదు. ఫ్లోరిన్‌ను ఫిల్టర్‌ చేసే యంత్రాలు ఇక్కడ లేవు. వాటిని పెట్టాలంటే భారీ ఖర్చుతో కూడుకుంది. సాగర్‌ నుంచి కొద్దిపాటి నీటిని కనిగిరి పట్టణానికి అధికారులు అందిస్తున్నారు.
 

                                                                బబుల్స్‌ నీరు తాగినా ఇదే పరిస్థితి

బోర్లలో నీటిని తాగడం వల్ల కిడ్నీల వ్యాధులు వస్తున్నందున గత ఐదారేళ్లుగా బబుల్స్‌ నీటిని తాగుతున్నారు. గ్రామాలకు వాహనాలు వచ్చి నీటిని అమ్ముతుంటాయి. ప్రతి ఇంటికీ రెండు, మూడు బబుల్స్‌ వేసుకుంటారు. వీటిని పాతిక రూపాయలకుపైగా పెట్టి కొంటున్నారు. ఈ నీరు తాగినా కిడ్నీ వ్యాధి తగ్గడం లేదు. అంటే, కొన్న నీటిలోనూ ఫ్లోరిన్‌ ఉంది. ఈ నీరు కూడా సమీపంలోని గ్రామాల నుంచే ప్లాంట్లు పెట్టి అమ్ముతున్నారు.
 

                                                                   పిసిపల్లిలో 20 మంది బాధితులు

పిసిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లోరిన్‌ మరింత ప్రమాదంగా మారింది. ఈ మండలంలోని ప్రతి గ్రామంలోనూ పది నుంచి 15 మంది వరకూ కిడ్నీ బాధితులు ప్రస్తుతం ఉన్నారు. పిసిపల్లిలో ప్రస్తుతం 20 మంది కిడ్నీ బాధితులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పిసిపల్లి, మారెళ్ల, దివాకర్‌పల్లి, చెర్లోపల్లి, వరిమడుగు, వేపగంపల్లి, కొత్తపల్లి, గుంటుపల్లి తదితర గ్రామాల్లోని తాగు నీటిలో ప్రమాదకర మూలకాల ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు.
 

                                                                    114 మంది రోగులు నమోదు

కనిగిరి ప్రాంత కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్‌ చేసేందుకు ఇక్కడ కేంద్రాన్ని ప్రభుత్వం పెట్టింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 114 మంది రోగులు నమోదు చేసుకున్నారు. వీరికి అవసరమైనప్పుడు డయాలసిస్‌ చేస్తున్నారు. వంతుల వారీగా ఇక్కడ రోగులకు ఈ చికిత్స అందిస్తున్నారు.
 

                                                                 మందులకు నెలకు రూ.5 వేలకు పైగానే..

డయాలసిస్‌ మాత్రం ఉచితంగా చేస్తున్నారు. నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి. అందుకు ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. నెలకు పరీక్షలకు రూ.5 వేలు ఖర్చవుతోంది. మందులకు మరో రూ.నాలుగు వేలు కావాలి. నాకు కిడ్నీలో క్రియాటిన్‌ పది శాతం ఉంది. మందులు, పరీక్షలు ప్రభుత్వాస్పత్రిలో లేవు.
                  - కోటేశ్వరరావు, కిడ్నీ బాధితుడు, దివాకరపల్లె

                                                                    ప్రాణాలు తోడేస్తుందయ్యా...

ఈ వ్యాధి కేవలం నీళ్ల వల్లనే వచ్చిందయ్యా. ప్రాణాలు తోడేస్తోంది. నిలుచున్నా కాళ్ల నొప్పులు. కిడ్నీల్లో క్రియాటిన్‌ శాతం 10.5 ఉంది. డయాలసిస్‌పైనే ఉన్నాను. సురక్షిత తాగునీరు అందిస్తే దీన్నుంచి బయటపడతాం.
                                                                             - కొండయ్య, కిడ్నీ బాధితుడు, దివాకరపల్లె

                                                                 మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు

మా ఇంట్లో మా ఇద్దరు తమ్ముళ్లూ కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఇప్పుడు నాకూ ఈ వ్యాధి వచ్చింది. కుటుంబాల్లో ఏ పనులూ చేసుకోలేకపోతున్నాం. ఊరు వదిలిపోతే తప్ప, ప్రాణాలు నిలిచేలా లేవు. సాగర్‌ నీరు ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం.
                                                                             - పోలినేని మాలకొండయ్య, కిడ్నీ బాధితుడు, దివాకరపల్లె