Aug 13,2023 07:20

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగే కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం 'అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ పథకం' అమలు చేస్తున్నది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ కేరళ విభాగం ద్వారా ఈ పథకం అమలవుతుంది. సంవత్సరంలో సరిపడ పనులు లేనప్పుడు ఈ పథకం ద్వారా కుటుంబానికి వంద రోజులు పని కల్పించి పేదలను ఆదుకోవడం లక్ష్యం. నివాసం వున్న కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో పేర్లు నమోదు చేసుకున్న 15 రోజులకు జాబ్‌ కార్డులు ఇవ్వడం, పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించడం జరుగుతుంది.

ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు రాకపోవడంతో అనేక జిల్లాల్లో పంట సాగు బాగా తగ్గింది. దీనివల్ల పట్టణాలకు వలసలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ పేదలకు పనులు కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా ప్రభుత్వం గుర్తించాలి. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రంతో పోరాడాలి. వైసిపి తన ఎం.పి ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన పట్టణ ఉపాధి హామీ పథకం బిల్లు చట్టంగా రావడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇతర రాష్ట్రాల లాగా మన రాష్ట్రంలో పట్టణ ఉపాధి పథకాన్ని ప్రవేశ పెట్టాలి

           దేశంలో పట్టణ జనాభా పెరుగుతున్నది. ఈ జనాభా పెరుగుదలకు అనుగుణంగా పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంలేదు. మరోవైపు వ్యవసాయంలో వస్తున్న మార్పులు పేదలను గ్రామాల నుండి పట్టణాలకు తరిమేస్తున్నాయి. ప్రతి పట్టణంలో మురికివాడల సంఖ్య పెరిగిపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పట్టణ సంస్కరణలు పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారాలు మోపుతున్నాయి. పట్టణాల్లోకి పెద్దఎత్తున చొరబడుతున్న కార్పొరేట్‌ సంస్థలు చిన్నచిన్న వ్యాపారాలను, స్వయం ఉపాధిని, చేతివృత్తులను చావుదెబ్బ తీస్తున్నాయి. ఇల్లు, తిండి, విద్య, వైద్యం లాంటి ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. వీటి వల్ల పట్టణాల్లో పేదరికం తీవ్రంగా పెరిగిపోతున్నది. సరైన తిండి కొరత, అప్పుల భారాలు, మానసిక ఒత్తిళ్ళు తీవ్రమవుతున్నాయి.
          దేశ జనాభాలో పట్టణ జనాభా సుమారు 38 శాతం వుంటుంది. పట్టణాల అభివృద్ధిలో కూలీల పాత్ర ప్రధానమైనది. కరోనా సమయంలో పట్టణ పేదలు తమ స్వగ్రామాలకు వెళ్ళడంతో పట్టణాలు ఎంతగా అల్లాడిపోయాయో చూశాము. దేశ స్థూల జాతీయ ఆదాయంలో పట్టణాల వాటా 62 శాతంగా వుందంటే అందులో ఈ శ్రామికుల కష్టం ముఖ్యమైనది. అలాంటి శ్రామికులకు పనులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. యుపిఎ పాలనాకాలంలో వామపక్షాల ఒత్తిడితో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో అమలు చేయాలి. జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకం కావాలి. పట్టణాల్లో పని చేయగలిగిన శ్రామికులకు సంవత్సరంలో వంద రోజుల పనిని చట్టబద్దంగా కల్పించాలని సిపిఎం, వామపక్ష పార్టీలు అనేక సంవత్సరాలుగా కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కేరళలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇటీవలే ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు తలారి రంగయ్య ఆగస్టు 5న ...జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద ...'జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకం' కోసం ప్రైవేటు మెంబర్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.
 

                                                                          పట్టణీకరణ-పేదరికం

బ్రిటీష్‌ పాలనా కాలంలో వారు అనుసరించిన విధానాల వల్ల దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదు. తద్వారా పట్టణీకరణ చాలా అలస్యంగా ప్రారంభమై, నెమ్మదిగా అభివృద్ధి అయ్యింది. 1951 నుండి 2001 వరకు దేశంలో పట్టణాలు, నగరాల సంఖ్య 2125 మాత్రమే వున్నాయి. 2001 నుండి 2011 నాటికి 2771, ప్రస్తుతం సుమారు మూడు వేలకు పైగా నగరాలు వున్నాయి. 1971-81 మధ్య కాలంలో ప్రభుత్వ రంగం పెరగడం వల్ల 2001 వరకు పట్టణ జనాభా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి మందగించినప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో యువత పట్టణాలకు రావడం పెరిగింది. ధనిక రైతుల్లో కొందరు పట్టణాల్లో స్థిరపడడం, వారి ప్లిలలు చదువుల కోసం పట్టణాలకు రావడం ఆ తర్వాత అక్కడే స్థిరపడడం పెరిగింది. దళితులు తమపై కొనసాగుతున్న అణచివేత, కుల వివక్ష నుండి తప్పుకోవడానికి పట్టణ ప్రాంతాలకు వచ్చి స్థిరపడుతున్నారు. వీటితోపాటు పట్టణాల్లోకి పరిసర గ్రామాలను కలపడం వల్ల కూడా పట్టణ జనాభా పెరిగింది. పెరుగుతున్న జనాభాకు పని కల్పించడం, నివాసాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల బాధ్యత. దేశవ్యాప్తంగా పట్టణాల్లో 2 కోట్ల ఇళ్ల కొరత వున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరికి నివాసాలు ఏర్పాటు చేసి, పనులు కల్పించకుండానే 100 స్మార్ట్‌సిటీలు నిర్మించేందుకు రూ.7,000 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో రూ.1,000 కోట్లను స్మార్ట్‌సిటీస్‌ మిషన్‌కు కేటాయించింది. పాలకుల దృష్టిలో అభివృద్ధి అంటే స్మార్ట్‌సిటీల నిర్మాణం మాత్రమే.
          దేశంలో నిరుద్యోగం గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈ కాలంలో పెరిగిపోయి చదువుకున్న నిరుద్యోగులకు తోడు పనులు కోల్పోయిన వారు పెరిగిపోతున్నారు. 2022 మార్చి 14న జాతీయ గణాంకాల బ్యూరో విడుదల చేసిన లెక్కల ప్రకారం పట్టణ నిరుద్యోగం 12.6 శాతం, మహిళల నిరుద్యోగం 14.3 శాతంగా వుంది. వాస్తవంగా ఈ సంఖ్య 20.8 శాతం పైగా వుంటుందని నిపుణుల అంచనా. దీనికి తోడు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, అతి తక్కువ వేతనాలు, భద్రత లేని ఉపాధి... పట్టణ పేదలను పీడిస్తున్న అతి పెద్ద సమస్యలు.
మన రాష్ట్రంలో పట్టణ జనాభా 2011 లెక్కల ప్రకారం 33.36 శాతం. 2000- 2011 మధ్యలో పట్టణ జనాభా 7 శాతం పెరిగింది. 2029 నాటికి 43 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 31 నగర పంచాయితీలు మొత్తం 125 పట్టణాలు వున్నాయి. ఇందులో 1,46,10,410 మంది నివసిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన 5,409 మురికివాడల్లో మొత్తం పట్టణ జనాభాల్లో 18 శాతం మంది ఇక్కడ నివసిస్తున్నారు.
 

                                                                     పట్టణ పేదల పరిస్థితులు

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. గతంలో వున్న రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, చేనేత మగ్గాలు, ఆక్వా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేల సంఖ్యలో మూతబడి లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వున్న కొద్దిపాటి పనులకు తీవ్రమైన పోటీ పెరిగి కూలీ రేట్లు తగ్గడం, పనిదినాలు తగ్గడం జరుగుతుంది. పట్టణ పేదల్లో అత్యధికమంది ఆధారపడిన రంగం భవన నిర్మాణం. మాల్స్‌, ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌, విద్య, వైద్య సర్వీసులు, రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ ఏజంట్లుగా, గిగ్‌ కార్మికులుగా, టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌, ప్రయివేటు ఆఫీసులు, కన్సల్టెన్సీలు, ఇంటి పని లాంటి రంగాల్లోనే కొద్దిమంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. 1993 నుండి 2012 వరకు దేశవ్యాప్తంగా వస్తూత్పత్తి రంగంలో కేవలం 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే కొత్తగా వచ్చాయి. మన రాష్ట్రంలో 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా విశాఖలో సిఐఐ భాగస్వామ్యంతో ప్రపంచ పారిశ్రామిక సదస్సులు జరిగాయి. ఒక్క 2017 లోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రైవేట్‌ కంపెనీల మధ్య రూ.10.54 లక్షల కోట్ల విలువ చేసే 655 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల వల్ల 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2023 మార్చి 3,4 తేదీలలో మరోసారి పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ సదస్సును విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ సదస్సు ద్వారా 2 లక్షల నుండి 10 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సదస్సుల వల్ల కొత్తగా పెట్టుబడులు రాలేదు, ఉపాధి అవకాశాలు పెరగలేదు. వచ్చిన అరకొర పెట్టుబడులు సోలార్‌, విండ్‌ మిల్లు లాంటి విద్యుత్‌ ఉత్పత్తిలో వచ్చాయి. ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు అతి తక్కువ. కొద్దిమంది నిపుణులకు మహా నగరాల్లో ఐ.టి రంగం లాంటి సేవరంగాల్లో ఉపాధి దొరికింది. కాని పట్టణాల్లోని నైపుణ్యం లేని, లేదా అర్ధ నైపుణ్యం వున్న శ్రామికుల పరిస్థితి ఏమిటీ? వీరికి పని కల్పించకుండా కొనుగోలు ఎలా పెరుగుతుంది? రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది ?
 

                                                                  కేరళ పట్టణ ఉపాధి హామీ పథకం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగే కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం 'అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ పథకం' అమలు చేస్తున్నది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ కేరళ విభాగం ద్వారా ఈ పథకం అమలవుతుంది. సంవత్సరంలో సరిపడ పనులు లేనప్పుడు ఈ పథకం ద్వారా కుటుంబానికి వంద రోజులు పని కల్పించి పేదలను ఆదుకోవడం లక్ష్యం. నివాసం వున్న కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో పేర్లు నమోదు చేసుకున్న 15 రోజులకు జాబ్‌ కార్డులు ఇవ్వడం, పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించడం జరుగుతుంది. 5 కి.మీ లోపు పని చూయించలేకపోతే వేతన రేటుకు అదనంగా 10 శాతం వేతనం ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 50 శాతం మంది మహిళలు.
           కేరళ తరహాలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 'ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్‌ యోజన', ఒడిషాలో 'ఉన్నతి పట్టణ వేతన ఉపాధి', జార్ఖండ్‌లో 'ముఖ్యమంత్రి శ్రామిక్‌ యోజన', హిమాచల్‌ ప్రదేశ్‌లో 'ముఖ్యమంత్రి శహరీ అజీవిక గ్యారంటీ యోజన', తమిళనాడులో 'తమిళనాడు అర్బన్‌ ఎంప్లారుమెంట్‌ స్కీమ్‌' అమలవుతున్నాయి.
          రాష్ట్ర విభజనలో భాగంగా రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమలు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్వాసితుల సమస్య ఇలా ఏ ఒక్కటీ కేంద్రం నుండి సాధించలేని నిస్సహాయ స్థితిలో మన రాష్ట్ర పాలక, ప్రతిపక్షాలు వున్నాయి. మరోవైపు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు రాకపోవడంతో అనేక జిల్లాల్లో పంట సాగు బాగా తగ్గింది. దీనివల్ల పట్టణాలకు వలసలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ పేదలకు పనులు కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా ప్రభుత్వం గుర్తించాలి. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రంతో పోరాడాలి. వైసిపి తన ఎం.పి ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన పట్టణ ఉపాధి హామీ పథకం బిల్లు చట్టంగా రావడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇతర రాష్ట్రాల లాగా మన రాష్ట్రంలో పట్టణ ఉపాధి పథకాన్ని ప్రవేశ పెట్టాలి. నగదు బదిలీ పథకాలు అమలు చేసి అవే సర్వస్వం అనుకుంటే సరిపోదు. ప్రజలకు పనులు కల్పించి, ఆత్మాభిమానంతో జీవించేలా చూడాలి.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌