Oct 16,2023 07:36

అణచివేతల ఉక్కుపాదాన్ని
తుప్పులా తినేయడానికి
తిరుగుబాటు పురుడోసుకుంటుంది
నీ ప్రేమ చినుకైతే
నా ప్రేమ సముద్రం
నీ ద్వేషం ఆవగింజైతే
నా ద్వేషం అంతులేని
ఆకాశమనే మానవనైజం
ద్వేషాన్ని మాత్రమే
బడుగు దేశాలపై దిమ్మరిస్తుంటే
తిరుగుబాటు కాస్తా
యుద్ధమై గర్జిస్తుంది !

కాటాలు మొలిచిన
పందెం పుంజుల రంకెల్లో
పసిపిట్ట దేహమంతా
సలుపుతున్న గాయపు గాట్లే ...

ఏళ్లకేళ్లు గొంతులు బిగించేసిన
చీకటి పంజరాల్లోని
ఎముకల గూళ్ళ విముక్తికై
గాయపడ్డ దేశం మొత్తం
పొలికేకలేస్తూనే ఉంది

యుద్ధం చేస్తున్న మనుషులకు
మతం యూనిఫామ్‌ తొడిగింది
మనిషితనం మట్టికొరిగింది
స్వేచ్ఛకోరే ప్రతి గొంతూ
శరణార్థ శిబిరంలో
అవిటితనపు ఆత్మగౌరవంతో
కన్నీటి పాటలే పాడుతుంది !

ఇప్పుడు కళ్ళన్నీ
గడ్డకట్టని నదులు
గుండెలు పగిలిపోయిన
అగ్నిపర్వత సమూహాలు
దేహాలన్నీ కుళ్ళిపోతున్న శవాల గుట్టలు
దేశమంతా తడారని నెత్తుటి మడుగులు
మానవత్వమేమో శిథిలమైన
జగతిజెండా ఆనవాలు !

నిన్నటి కలలు
రేపటి ఉదయాలు
యుద్ధంలో తడిచి
చివికిపోతున్నాయి
కొన్ని పిడికిళ్ల ప్రతిఘటన తప్ప
ప్రతిఫలమెరుగని పోరులో
పీడిత వర్గపు ప్రాణం విలువ
ట్రిగ్గర్‌ నొక్కే చేతితోపాటు
దూసుకుపోయే తూటాకి కూడా తెలీదు
యుద్ధమంటే సాధించడం కాదు;
కోల్పోవడం మాత్రమే!

చరిత్ర చెప్పని నిజమేమిటంటే
యుద్ధం రెండు దేశాల మధ్య కాదు
అదెప్పుడూ మన మనుషుల మధ్యే
జరుగుతుంది
జరుగుతూనే ఉంటుంది!
 

- మిరప మహేష్‌
99480 39026