Oct 11,2023 09:21

1951నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కాగా.. చైనా 1974లో ఇరాన్‌లోని టెహ్రాన్‌ వేదికగా జరిగిన 7వ ఆసియా క్రీడలతో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది. అరంగేట్రంలోనే 33 స్వర్ణాలతో సహా ఏకంగా 106పతకాలతో 3వ స్థానంలో నిలిచిన చైనా.. టాప్‌లో ఉన్న జపాన్‌కు దీటుగా నిలిచింది. ఆ తర్వాత 1978లో బ్యాంకాక్‌ క్రీడల్లో 51స్వర్ణాలతో 2వ స్థానానికి ఎగబాకింది. 1982లో భారత్‌ వేదికగా జరిగిన క్రీడలతో జపాన్‌ను వెనక్కి నెట్టి చైనా టాప్‌ా1కు చేరుకుంది. 2023లో జరిగిన 19వ ఆసియా క్రీడల వరకు చైనా ప్రతిసారీ అగ్రస్థానంలో నిలుస్తూ 11సార్లు ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించింది. ఈసారి ఆసియా క్రీడల్లో 12,500మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించగా.. ఇది ఫ్రాన్స్‌ వేదికగా జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెట్ల కంటే ఎక్కువే. పారిస్‌ ఒలింపిక్స్‌లో 10,500మంది అథ్లెట్లు మాత్రమే పాల్గోనున్నారు.

                                                                  క్రీడల్లో చైనా హవా..

2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ చైనా 89 పతకాలతో రెండోస్థానంలో నిలిచినా.. చివరిరోజు వరకు అమెరికాకు ముచ్చెమటలు పట్టించింది. ఈ క్రీడల్లో అమెరికా(39), చైనా(38)ల మధ్య స్వర్ణ పతకాల వ్యత్యాసం ఒకటి మాత్రమే. ఓవరాల్‌గా అమెరికా 39స్వర్ణ, 41రజత, 33కాంస్యాలతో సహా 113పతకాలతో అగ్రస్థానంలో నిలిచినా.. చైనా 38స్వర్ణ, 32రజత, 19కాంస్యాలతో మొత్తం 89పతకాలతో రెండో స్థానం ఉండి గట్టి పోటీనిచ్చింది. అమెరికాకు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌, స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌లతో అత్యధిక పతకాలు దక్కితే.. చైనా డైవింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌లో అత్యధిక పతకాలను కొల్లగొట్టింది. ఒకప్పుడు క్రీడల్లో అమెరికాకు రష్యా ధీటుగా నిలిస్తే.. ప్రస్తుతం చైనానుంచి ఆ దేశం క్రీడల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.

                                                                 చిన్నప్పటినుంచే ప్రోత్సాహం..

క్రీడలను ప్రోత్సహించడంలో చైనా ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. పిల్లలకు క్రీడలపట్ల ఉన్న ఆసక్తిని బట్టి వారికి ఆ క్రీడాంశంలో నాణ్యమైన కోచ్‌లతో తర్ఫీదునిస్తోంది. సౌకర్యాలు, క్రీడాపరికరాలు సమకూర్చడం, భోజనం, ఆర్ధికపరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తూ.. యువతను ప్రోత్సహిస్తోంది.