'ప్రజాశక్తి' కథనానికి అనూహ్య స్పందన.. పాప చికిత్సకు పదిరోజుల్లోనే 18 లక్షలు సేకరణ
* చిన్నారి చికిత్సకు వెల్లివిరిసిన మానవత్వం
* పది రోజుల్లోనే చికిత్సకు అవసరమైన రూ.18 లక్షలు సేకరణ
* 'ప్రజాశక్తి' కథనానికి అనూహ్య స్పందన
* కృతజ్ఞతలు తెలిపిన ఆద్య తల్లిదండ్రులు
ప్రజాశక్తి - కవిటి: మానవత్వం ఉన్న మనుషులు మన మధ్యనే ఉన్నారనడానికి ఈ చిన్నారి కష్టం ఉదంతమే ఓ ఉదాహరణ. నూటికో కోటికో కాదు... కష్టం ఉందని తెలిస్తే తల్లడిల్లిపోయి స్పందించే హృదయాలు ఎన్నో. తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. ఆ అడుగు నిజాయితీతో బలంగా పడితే మరెన్నో అడుగులు పడుతాయి. ఇంకెన్నో చేతులు కలుస్తాయి. ఆ తొలి అడుగు 'ప్రజాశక్తి' వేసింది. అరుదైన వ్యాధి బారిన పడిన తొమ్మిది నెలల చిన్నారి ఆద్య ఆరోగ్య, తల్లిదండ్రుల దయనీయ పరిస్థితిపై 'చిన్ని గుండెకు పెద్ద కష్టం' శీర్షికన ప్రచురించిన కథనానికి దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎంతో కొంత కాదు... ఏకంగా చిన్నారి చికిత్సకు అవసరమయ్యే రూ.18 లక్షలు పది రోజుల్లోనే సమకూరాయి. చిన్నారి గుండెచప్పుడుగా ఆ మంచి మనసులు మేమున్నామంటూ అండగా నిలిచాయి.
కవిటి మండలం ప్రగడపుట్టుగకు చెందిన యాండ్రాపు చిరంజీవి, అంజలి దంపతుల తొమ్మిది నెలల కుమార్తె ఆద్య హెచ్‌ఎల్‌హెచ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. జూలైలో ఆద్యకు జ్వరం రావడంతో సోంపేటలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో, శ్రీకాకుళంలోని మరో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, ప్రస్తుతం విశాఖపట్నంలోని గాంధీ కేన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు పాప హెచ్‌ఎల్‌హెచ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. చికిత్సకు రూ.18 లక్షల వరకు ఖర్చవుతుందని, చికిత్స కూడా మూడు వారాల్లోగా చేయాలని చెప్పారు. గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న ఆద్య తండ్రి చిరంజీవి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో, పాప ఆరోగ్య పరిస్థితిపై దాతల సాయం కోరుతూ ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనంపై దాతృత్వం వెల్లివిరిసింది. చిన్నారి ఆద్య కోసం వేలాది హృదయాలు స్పందించాయి. దీంతో వైద్యం కోసం అవసరమైన రూ.18 లక్షలు కేవలం పది రోజుల్లోనే సమకూరినట్లు పాప తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే వరకు కొంతకాలం పాటు వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం పాపకు కీమోథెరపీ చికిత్స చేస్తున్నట్లు చెప్పారు.

పాప వైద్యం కోసం గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్ (ఫైల్)
అడుగు వెనుక మరో అడుగు...
'చిన్ని గుండెకు పెద్ద కష్టం' శీర్షికన ఈనెల 15వ తేదీన 'ప్రజాశక్తి'లో ప్రచురితమైన కథనానికి దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా వార్త చూసిన వెంటనే ఇచ్ఛాపురం ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ రజనీకుమార్ దలై స్పందించారు. రూ.రెండు వేలు అందించి ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది వేస్తే, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పాపకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామస్తులతో సమావేశమై పాప వైద్యం కోసం అవసరమైన నిధుల సేకరణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పాప ఆరోగ్యం గురించి ప్రజాశక్తిలో వచ్చిన కథనాన్ని పోస్టు చేసి దాతల నుంచి సాయం కోరారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి తనకు తోచిన సాయం చేయడమే కాకుండా వృత్తిరీత్యా బయట ఉన్న వారు కూడా స్పందించేలా అనుక్షణం పర్యవేక్షించారు. జనసేన నాయకుడు లోళ్ల రాజేష్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి పాప ఆరోగ్యం కోసం వైద్యులతో మాట్లాడారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారికి ఆర్థికసాయం అందించారు. మండల కో-ఆప్షన్ మెంబర్ పాండవ శేఖర్ ప్రజాశక్తిలో వచ్చిన కథనాన్ని పూర్తిస్థాయిలో ప్రచారం చేసి పాప చికిత్సకు నిధుల సేకరణలో భాగస్వాములయ్యారు. మండలంలోని అన్ని స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని పాప వైద్యం కోసం పూర్తిస్థాయిలో సహకరించారు. జనసేన ఇచ్ఛాపురం నియోజకవర్గ నాయకులు దాసరి రాజు జనసేన పార్టీ నుంచి పూర్తిస్థాయి సహకారం అందించారు. నియోజకవర్గంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, దయార్థ్ర హృదయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం పది రోజుల్లోనే పాప వైద్యం కోసం రూ.18 లక్షలు పోగయ్యాయంటే అందులో వీరి పాత్ర ఎనలేనిది. కొంతమంది దాతలు వ్యక్తిగతంగా (బెందాళం శ్రీకాంత్ శ్రీనిధి గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా రూ.లక్ష, బల్లెడ విద్యాసాగర్ రూ.25వేలు, పాండవ రామారావు రూ.21 వేలు) పెద్ద మొత్తంలో సాయం అందిస్తే, మరికొంత మంది సమూహంగా ఏర్పడి (చిరంజీవి పదో తరగతి క్లాస్‌మేట్స్ రూ.78,801, ప్రగడపుట్టుగ యాదవ సంఘం తరుపున రూ.40,316, నేవీలో పనిచేస్తున్న పసుమతి నరేష్ తన స్నేహితులతో కలిసి రూ.40వేలు) పాప వైద్యం కోసం నిధులు సేకరించారు. కేవలం పది రోజుల్లోనే పాప వైద్యం కోసం అవసరమైన రూ.18 లక్షలు సేకరించడం వారి మంచి మనసులకు మచ్చుతునక.
జీవితాంతం రుణపడి ఉంటాం
మా పాప వైద్యం కోసం అవసరమైన డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక స్నేహితుని సూచన మేరకు ప్రజాశక్తిని సంప్రదించాను. పాప వైద్యం కోసం వార్త రాసి, ఇంతమంది హృదయాలను కదిలించిన ప్రజాశక్తి రుణం తీర్చుకోలేనిది. జీవితాంతం పత్రికకు రుణపడి ఉంటాం. పాప వైద్యం కోసం సాయం చేసిన ప్రతి దాతకు పేరుపేరునా పాదాభివందనాలు.
- యాండ్రాపు చిరంజీవి, చిన్నారి తండ్రి










