Oct 05,2023 06:48

స్వతంత్ర వార్తా పోర్టల్‌ 'న్యూస్‌ క్లిక్‌'పై మోడీ ప్రభుత్వం చేసిన దాడి భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కడమే. వందలాది మంది పోలీసులను రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం చివరకు ఆ సంస్థ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌.ఆర్‌ విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తిని అరెస్ట్‌ చేసిన తీరు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకుతెస్తోంది. ఎటువంటి నేరారోపణలు (ఛార్జీలు ఫ్రేమ్‌) చేయకుండానే ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద ఈ అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం. ఈ చర్య ద్వారా రాజ్యాంగాన్ని, అది నెలకొల్పిన విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలోకి తొక్కిన మోడీ సర్కారు అప్రకటిత ఎమర్జెన్సీని అమలులోకి తీసుకువచ్చింది. 1975 ఎమర్జెన్సీ సమయంలో జెఎన్‌యు విద్యార్థిగా వున్న ప్రబీర్‌ను అప్పటి ప్రభుత్వం బూటకపు ఆరోపణలపై అరెస్టు చేసింది. తాజాగా ఎటువంటి ఆధారాలు లేకుండానే మీడియా సంస్థ కార్యాలయంతో పాటు, సిబ్బంది నివాసాల మీద, ఆ సంస్థతో సంబంధాలు ఉన్న మేధావులు, రచయితలు, కళాకారుల ఇళ్లపై కూడా మోడీ ప్రభుత్వం విరుచుకుపడింది. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు పోలీసులు జరిపిన దాడులు దిగ్భ్రాంతికరం. 500 మందికిపైగా పోలీసులను, పెద్ద సంఖ్యలో నిఘా సిబ్బందిని సిద్ధం చేసుకుని తెల్లవారు జామున 2 గంటలకే అధికారులు సమావేశం జరిపి దాడులకు దిగారంటే జర్నలిస్టుల పట్ల మోడీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా గళం విప్పేవారిలో భయోత్పాతాన్ని సృష్టించడమే దాని లక్ష్యం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా ఈ తరహా దాడులు ఎన్నో జరిగాయి. బీమా కొరెగావ్‌ కేసు దీనికో ఉదాహరణ. దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులను, ప్రజాతంత్ర వాదులను ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేసి, నాలుగేళ్లుగా నిర్బంధంలో ఉంచినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని కూడా మోడీ సర్కారు చూపలేకపోయింది. అటువంటి కుట్రే 'న్యూస్‌ క్లిక్‌'పై కూడా కేంద్రం చేస్తోంది.
నిజానికి ఇదేమీ ఇప్పటికిప్పుడు కొత్తగా జరిగిన దాడి కాదు. మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి 'న్యూస్‌ క్లిక్‌'పై దేశద్రోహ ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2021 లోనే ఇ.డి, ఇన్‌కంట్యాక్స్‌ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులనూ రంగంలోకి దించింది. రకరకాల ప్రభుత్వ ఏజెన్సీలు రోజుల తరబడి విచారణ చేశాయి. అయినా, చైనా నిధులంటూ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం వీసమంత కూడా నిరూపించలేకపోయింది. తాజాగా 'న్యూయార్క్‌ టైమ్స్‌' అదే ఆరోపణ చేస్తూ ప్రచురించిన బూటకపు కథనాన్ని అడ్డు పెట్టుకుని ఉపా చట్టం కింద కేసును బనాయించింది. తనకు వచ్చే నిధులన్నీ భారతీయ చట్టాలకు లోబడి, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకు అకౌంట్ల ద్వారానే వస్తాయని 'న్యూస్‌ క్లిక్‌' స్పష్టం చేసింది.
ఢిల్లీ ఘర్షణలు, రైతుల ఆందోళనల సందర్భంగా 'న్యూస్‌ క్లిక్‌ ' ఇచ్చిన విస్తృతమైన కథనాలు మోడీ సర్కారుకు కంటగింపుగా మారాయి. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తీరును కూడా భరించలేక అణచివేత చర్యలకు దిగింది. అన్ని మీడియా సంస్థలు తన ఎజెండాను మాత్రమే వినిపించాలన్నది మోడీ ప్రభుత్వ భావన. దానికి భిన్నంగా ప్రజల గొంతు వినిపించినందుకు గతంలో 'న్యూస్‌ ల్యాండ్రీ, ద వైర్‌, బిబిసి' వంటి మీడియా సంస్థలపైనా కేంద్రం ఇ.డి, ఐ.టి ల చేత దాడులు చేయించింది. ఎన్‌డి టివిని అదానీ గ్రూపుతో కొనుగోలు చేయించింది. కర్ణాటకలో జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య, హత్రాస్‌ ఘటనను కవర్‌ చేయడానికి వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ను యు.పి లో బిజెపి ప్రభుత్వం రోజుల తరబడి జైలులో పెట్టడం, మధ్యాహ్న భోజన పథకపు అద్వాన్నపు అమలుపై రాసినందుకు కొందరిని కటకటాల వెనక్కు నెట్టడం వంటి సంఘటనలు ఎన్నో! అందుకే భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ రోజురోజుకీ దిగజారిపోతోందని 'ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌' నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. 180 దేశాల జాబితాలో 2014లో 140వ స్థానంలో ఉన్న పత్రికా స్వేచ్ఛ 2023కి 161వ స్థానానికి పడిపోయింది. ఈ ధోరణిని ఇక ఏ మాత్రం అనుమతించకూడదు. పత్రికల గొంతు నొక్కడమంటే ప్రజాస్వామ్యం గొంతుకు ఉరితాడు వేయడమే! అందుకే, ప్రభుత్వ అణచివేత వైఖరిని గట్టిగా ప్రతిఘటించాలి...తిప్పికొట్టాలి. ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలిసి కదలాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం.