Mar 30,2023 07:24
  •  గ్రేడ్‌-5 కార్యదర్శులకు అధికార బదిలీలు ఇప్పట్లో లేనట్లే!

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండో విడత ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ అనిశ్చితిలో పడింది. 2020 డిసెంబరులో నెలలో రెండో విడతలో ఎంపికైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 2022 డిసెంబరు నెలతో రెండేళ్లు సర్వీసు పూర్తయినప్పటికీ నేటికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయకపోవడం పట్ల వారిలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. విశ్వసనీయసమాచారం మేరకు రెండో విడతలో ఎంపికైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ జూలైలో కానీ లేక ఆగస్టులో ఉండే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కానీ, అప్పుడైననా ప్రకటిస్తారా? అంటే అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. మొదటి నోటిఫికేషన్‌ ద్వారా రిక్రూట్‌ అయిన వారికి 9నెలలు ఆలస్యంగా ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేశారు. గతేడాది మార్చి నాటికే ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. ఆ గడువు పూర్తయి ఏడాది గడచినా ఇంతవరకు దీని అతీగతి లేదు. మార్చి నెల ముగుస్తున్నా ఇందుకు సంబందించిన కసరత్తు పూర్తి కాక పోవడంతో ప్రొబేషన్‌ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రొబేషన్‌ డిక్లేర్‌ కాక పోవడంతో సుమారు 17వేల మంది ఉద్యోగులు కేవలం రూ.15వేల జీతానికి విధులు నిర్వహించడం కష్టంగా మారిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఎపి గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ అబ్ధుల్‌ రజాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంపికైన 7040 మంది గ్రేడ్‌ -5 పంచాయితీ కార్యదర్శులకు నేటికీ అధికారాల బదిలీ జరగలేదు. దీంతో జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసిన జీఓ నెంబరు 149లో డిడిఓ అధికారాలు ఉంటాయని పేర్కొంది. అధికారాల బదిలీల ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. క్లస్టర్‌ వ్యవస్ధను రద్దు చేసి ప్రతి పంచాయితీ కార్యదర్శిని నియమించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే అధికారాలు బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జానిపాషా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.