Oct 02,2023 07:27

రైతు లేని రాజు ఎక్కడా లేడు
రైతుని వంచించని రాజ్యం
ఏ చోట వెతికినా కానరాదు
నాగలి విరిగినప్పుడు
ఈ నేరం నాదేనని ఒప్పుకున్న
రాబందుల నాయకుడు - లేనే లేడు!
పొలాన్నీ పంటనీ నమ్ముకున్నవాడు రైతు
మాయనీ మోసాన్నీ అమ్ముకున్నవాడు దళారి
రైతు జీవితం రోజురోజుకి బెట్టగొట్టి,
మట్టి గొట్టుక పోతుంటే
సింహాసనం మీద కూర్చున్న
హింస రాజు - రైతు మాంసం తింటూ
మౌనంగా బతుకుతుంటాడు
రైతుకి పనిలో పాటలో
వేన్నీళ్లకి చన్నీళ్లలా రైతు సహచరి
రాజుకి పగలో ప్రతీకారంలో
అగ్నికి ఆజ్యంలా అందాల రాణి
ఎక్కడైనా ఏ స్థల కాలాల్లోనైనా
రైతు సంపద సృష్టికర్త
రాజు షడ్రషోపేత భోక్త
అలంకారికంగా చెప్పాలంటే
రైతు- స్వభావోక్తి
రాజు - అతిశయోక్తి !
రైతు ఎప్పటికీ రాజు కాదు; రైతు రైతే !
 

- రవి నన్నపనేని
9182181390