న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై తాజాగా భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాకు శనివారం సంతాపం తెలిపారు. ఈ దు:ఖ సమయంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని ఎరిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎరిక్ 'బాలోసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అమెరికా మిషన్ తరుపున నేను మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దు:ఖ సమయంలో మేము భారతదేశం, ఓడిశా ప్రజలకు అండగా నిలుస్తాము' అని ఎరిక్ ట్వీట్ చేశారు.
కాగా, అమెరికా రాయబారి ఎరిక్ మాత్రమే కాదు... భారతదేశంలోని ఇటలీ రాయబారి కార్యాలయం కూడా ఒడిశా రైలు ప్రమాద మృతులకు సంతాపం తెలిపింది. ఇక ఈ ఘటనపై ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియా తజానీ ట్వీట్ చేశారు. 'బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి ఇటాలియన్ ప్రభుత్వం భారతదేశానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. ఈ ప్రమాద బాధితులు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించాలని నేను కోరుకుంటుకున్నాను.' అని ఆంటోనియా ట్వీట్‌లో తెలిపారు.










