Sep 17,2023 10:54

వాషింగ్టన్‌ : ఇరాన్‌కు చెందిన కొంతమంది మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం కొత్త ఆంక్షలు విధించారు. ఇరాన్‌ మొరాలిటీ పోలీసుల అదుపులో వుండి మూడు రోజుల తర్వాత మరణించిన 22 ఏళ్ల మషా అమిని వర్ధంతి సందర్భంగా బైడెన్‌ ఈ ఆంక్షలను ప్రకటించారు. అమిన్‌ మరణానికి సంబంధించి 29మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖలోని విదేశీ ఆస్తుల నియంత్రణా విభాగం శుక్రవారం తెలిపింది. వీరిలో ప్రభుత్వ భద్రతా బలగాల సభ్యులు, ఇరాన్‌ జైలు శాఖ అధిపతి వున్నారు. ఇరాన్‌ పారా మిలటరీ రివల్యూషనరీ గార్డుకు సన్నిహితంగా వున్న సెమీ అఫీషియల్‌ వార్తా సంస్థలైన ఫార్స్‌, టాన్సిమ్‌ వార్తా సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ టెలివిజన్‌ ఇంగ్లీషు భాషా విభాగమైన ప్రెస్‌ టివి పై కూడా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలను జోక్‌గా ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమిరాబ్దుల్లాన్‌ అభివర్ణించారు. కొన్నాళ్ళ క్రితమే మరణించిన వారి పేర్లు కూడా ఈ జాబితాలో వుంటాయని అదే పెద్ద ప్రహసనమని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమో లేక హతమార్చడంలోనో జోక్యం వున్నందుకు గానూ 13మంది ఇరాన్‌ అధికారులు, ఇతరులపై విదేశాంగ శాఖ వీసా ఆంక్షలను విధించింది. 25మంది ఇరానియన్లు, ప్రభుత్వ మద్దతు కలిగిన మూడు మీడియా సంస్థలు, ఇంటర్‌నెట్‌ పరిశోధనా సంస్థపై కూడా ఆంక్షలు విధించినట్లు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. అమెరికా ఇలా ఆంక్షలు విధించడం 13వసారి. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డు కార్ప్స్‌కి చెందిన సీనియర్‌ సభ్యుడితో సహా నలుగురు అధికారులపై ప్రయాణ ఆంక్షలు విధించడంతోపాటు వారి ఆస్తులను స్తంభింపచేస్తున్నామని యురోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది. టాన్సిమ్‌ వార్తా సంస్థకు చెందిన నలుగురిపై ఆస్తుల స్తంభన ఆంక్షలు విధించింది.