Oct 15,2023 17:26

ప్రజాశక్తి కాకినాడ : డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ‌ తెలిపారు. భార‌త మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లాం జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కాకినాడ పి.ఆర్‌.క‌ళాశాల‌లోని ప్ర‌భుత్వ బి.సి క‌ళాశాల బాలిక‌ల వ‌స‌తిగృహం నెం.3 లో ఆదివారం మ‌లిరెడ్డి చారిట‌బుల్ ట్ర‌స్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌పంచ విద్యార్ధుల దినోత్స‌వం, ప్ర‌పంచ చేతిపరిశుభ్ర‌త దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ ముఖ్యతిధిగా హాజ‌రై విద్యార్ధుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుంటుందని చెప్పారు. విద్యార్థులు విద్యార్ధి దశను వృధా చేయకుండా జీవితానికి పూలబాట వేసుకునేందుకు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మ‌రో అతిథి ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ ట్ర‌స్ట్ ఛైర్‌ప‌ర్స‌న్ స‌త్య మ‌లిరెడ్డి మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేతులు శుభ్రంగా లేకపోతే వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్ళడం ద్వారా తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి అర చేతుల‌ పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్ధుల‌కు స‌త్య వివ‌రించారు. ఎవ‌రైతే జీవితంలో సానుకూల దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రిస్తారో వారు ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తార‌ని కార్య‌క్ర‌మాల‌కు అధ్య‌క్ష‌త‌న వ‌హించిన బి.సి. వ‌స‌తి గృహ సంక్షేమాధికారిణి కె.మ‌హాల‌క్ష్మి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్యక్తిత్వ, సామాజిక, మానసిక వికాస నిపుణులు అల్లూరి సురేంద్ర, ఎం.సి.టి. డైరెక్ట‌ర్స్‌ ద‌డాల శ్రీధ‌ర్‌, ఎం.వి.ఆర్‌.ఫ‌ణీంద్ర, పంప‌న వ‌ర‌ల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.