Aug 28,2023 07:48

డార్విన్‌ని తరగతి గదుల్లోంచి తరిమేసి, తరగతి గదిని గుప్పెట్లో పెట్టుకొని, వేదయుగం అంధత్వాన్ని తరగతి గదుల్లోకి మోసుకొస్తున్న సంక్లిష్ట రాజకీయ, సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో 'అతడు నల్లబల్ల మీద రేపటి ఉషోదయాన్ని చూస్తున్నాడు' అంటూ అందమైన స్వప్నాలను ప్యాక్‌ చేసేసి, కడవల కొద్ది దు:ఖాన్ని అందులో కలిపి ముందుకొచ్చాడు కవిమిత్రుడు బాల సుధాకర్‌, తన 'తరగతి గది స్వప్నం' దీర్ఘ కవితతో. 'ఈ భూమ్మీద గొప్ప ప్రదేశాలుగా విద్యార్థులకు నేను తరచూ చెప్పేది - రెండు ప్రజల ఆకలికి తీర్చే శక్తిని కూర్చే పంట భూమి ఒకటైతే, రెండు - నూతన తరాన్ని తయారు చేసే తరగతి గది. నూతన మానవుని ఆవిష్కణకు తరగతి గది ఒక కేంద్రమౌతుందని, అవ్వాలని నా నమ్మకం, నా ఆకాంక్ష' అంటున్నారు కవి.
          నమ్మకాలు నిజమవ్వడానికి, కలలు వాస్తవ రూపం దాల్చడానికి దానికి అనుబంధంగా శ్రామికవర్గ ప్రయోజనంతో కూడిన వ్యవస్థ, సంస్క ృతి ఉండాలి కదా! కానీ, ఆకలిని తీర్చే పంటభూమి నేడు వధ్యశిలగా మారిపోయింది. అసంఖ్యాకులైన రైతన్నల ఆత్మహత్యలతో పంటభూమి తన సౌందర్యాన్ని కోల్పోయింది. కార్పొరేట్ల విష కౌగిలిలో గిలగిలా కొట్టుకుంటోంది. రెండోది 'తరగతి గది' కూడా నూతన తరాన్ని మర మనుషులుగా మార్చేసింది. ఎంతోమంది చిన్నారులను ఉరికంబానికి బిగించింది. మానసిక రోగుల స్టిక్కర్లను అతికించేసింది.
         అందుకే కవి అంటారు : 'మబ్బుల్లో ఏనుగులను చూడలేని పిల్లలు / కాగితాలతో పడవలు చేయలేని పిల్లలు' అని. కలలు ఒకలా ఉంటే వాస్తవ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో! తలను నోట్సు పుస్తకాల నుంచి ఆకాశ మబ్బుల మీదకి మళ్ళించే సౌందర్యారాధనకు నేటి తరాన్ని దూరం చేశాం! మరి, ఎలా మార్చామో, వినాశనాన్ని ఏ స్థాయికి తీసుకుపోయామో కవి మాటల్లో చూద్దాం. ''పరీక్ష గదులు శవాలను కుప్పపోసిన మార్చురీలు/ పరీక్ష గదులు మృత్యు వాసనతో వర్థిల్లుతాయి.'' (పే 43)
          దారుణమైన విద్యా వ్యవస్థను తరగతి గది స్వప్నం ప్రతిబింబిస్తుంది. విద్యార్థుల దయనీయమైన జీవితాలను ఈ దీర్ఘ కవిత ఆవిష్కరిస్తుంది. ఈ కోణంలో మరొక ప్రగతిశీల రచన అని చెప్పాచ్చు. అయితే, కవి తన తరగతి గదిని ఎలా మలచుకుంటున్నాడు. ''అతనికి తరగతి గది భూమి అడవి సముద్రం/ తరగతి గది రాబోవు చరిత్రకు ఇప్పటి బీజాక్షరం/ తరగతి గది మానవ మహా చైతన్య శిఖరం.'' మానవజాతికి చైతన్య శిఖరాల మేద నిల్చోబెట్టిన తరగతి గది, అక్షరం పురుడు పోసుకుంటున్న తరగతి గది, అమ్మై సాకుతూ, నాన్నై నడక నేర్పిస్తోన్న తరగతి గది నేడు ... తన కార్యదీక్షతని కోల్పోయి, ఒక స్వప్నంగా, ఒక వధ్యశిలగా, తలని కిందకి వాల్చి మోకాలిపై కూలిపోతున్న అక్షరాన్ని బాధగా చూస్తూ ఆస్తిత్వాన్ని కోల్పోతుంది.
           తరగతి గదుల్లో ఏం జరగాలి? ఏం జరుగుతోంది? తరగతి గదికున్న స్వప్నాలేమిటి? వాస్తవాలేమిటి? మొదలైన విషయాలకు ఈ దీర్ఘ కవిత చర్చిస్తోంది. ''రెక్కల చప్పుడు లేని ఒక తరం/ గురి లేని తరం/ పాడలేని తరం/ ఊహలేని తరం/ చదువుల జైళ్ళలో బాల్యం బందీ అవుతున్న పిల్లలు/ బాల్యంలోనే వృద్ధులౌతున్న పిల్లలు..'' ఇలా ఎంతో సమర్థంతంగా కవి నేటి విద్యా విధానం మీద సెటైర్‌ విసురుతాడు. 'అన్నీ కలలే. కలలు నిజం ఎలా అవుతాయి? కళ్ళూ, చూపులూ, చేతులూ, హృదయం సమస్తం కలల్నే మాట్లాడతాయ'ంటాడు కవి మరో దగ్గర. 'ఎడాది భూమిలోంచి పచ్చని అరణ్యం మొలిచే కలలు/ కలల్లో కవి జనం గుండెలోంచి జనంలోకే ఎగిసే ఉద్విగ సముద్రాల గురించి మాట్లాడతాడు.
            అయితే, కలలెప్పుడూ కలలుగా మిగిలిపోవు. ఏదో ఒక రోజు అవి వాస్తవ రూపం దాల్చాల్సిందే. ఒక నూతన తరాన్ని తరగతి గదిలో సృష్టించాల్సిందే. ఇది తరగతి గదుల్ని నిర్మానుష్యం చేస్తోన్న శక్తులకు సవాలుగా తరగతి గదిని మరలా కొత్త అక్షరాలతో సర్దుకోవల్సిందే. కాషాయ విద్వేషపు ఆక్షరాలను నల్లబల్ల మీద చెరిపేసి కొత్త మానవుడ్ని తరగతిలో ఆవిష్కరించాల్సిందే! అందుకే, ఈ కవి వాక్యం విల్లులోంచి అక్షరాన్ని బాణంలా వదులుతాడు. నిశ్శబ్ద నైరాశ్యపు గోడను చేధించి గోడ ఆవలి తీరాన్ని చేరుతాడు. నల్లబల్ల ముందు కూర్చున్న ఒక తరం కోసం అక్షరాలను సిద్ధం చేసుకుంటున్నాడు. అవిశ్రాంత అనితర సాధ్యమైన అక్షరాల్ని జాగ్రత్త పరుచుకుంటున్నాడు. రాత్రి పగలు మరణిస్తోన్న పిల్లల్ని బతికించడానికి, బాల్యంలోనే వృద్ధులౌతున్న పిల్లల్లో మరలా నూతన శక్తిని నింపడానికి ఉపాధ్యాయుడు సిద్ధమౌతున్నాడు. కవి సిద్ధమవుతున్నాడు. కవి ఉపాధ్యాయుడ్ని సిద్ధం చేస్తున్నాడు. కొత్త ఉపాధ్యాయుడు చెదిరిన మట్టిలో గూడు నిర్మిస్తాడు. రాలిన ఆకుతో రగడ పుట్టిస్తాడు. అలా తరగతి స్నప్నాన్ని నిజం చేస్తాడు.
                ఈ దీర్ఘ కవిత నేటి విద్యా వ్యవస్థపై స్వప్నాలు కూలిపోతున్న విపత్కర పరిస్థితుల్ని దృశ్యీకరిస్తోన్న ప్రగతిశీల ప్రక్రియ. ప్రతి వాక్యం కవి హృదయంలోంచి జాలువారి అత్యంత బలంగా, విస్ఫోటనంగా కనిపిస్తోంది. స్వప్నాల తరగతి గదిని అంగడిగా మార్చేసి, నోట్లకట్టలను పరుకుంటోన్న విష సర్పాలు ఈ కవితలో కనిపిస్తాయి. కొత్త చైతన్యం కోసం నల్లబల్లముందు కూర్చొని ఆశగా ఎదురుచూస్తోన్న ఒక తరాన్ని వినాశనం వైపుకు మరలిస్తోన్న ఆ విద్యా విధానాన్ని ఈ కవిత ప్రశ్నిస్తోంది.తరగతి గదికున్న తాత్విక, సామాజిక చేతనను విసిరికొట్టి, విద్యార్థులను బట్టీ పట్టే మర మనుషులుగా మార్చుతున్న శిధిల సాంస్కృతిక వాతావరణంలో 'తరగతి గది స్వప్నం' ఆహ్వానించదగ్గ పరిణామం.
 

- కేశవ్‌
98313 14213