May 28,2023 07:41
  • తుదిపోరులో చెన్నైతో గుజరాత్‌ ఢీ

అహ్మదాబాద్‌ : ఐపిఎల్‌ -16 విజేత ఎవరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ టైటిల్‌ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ఐపీఎల్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఆదివారం మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ధోనీ రికార్డుల్లోకెక్కనున్నాడు. కెప్టెన్‌ కూల్‌ ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ (243), దినేశ్‌ కార్తిక్‌ (242), విరాట్‌ కోహ్లీ (237), రవీంద్ర జడేజా (225), శిఖర్‌ ధావన్‌ (217), సురేశ్‌ రైనా (205), రాబిన్‌ ఊతప్ప (205), అంబటి రాయుడు (203) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  • రోహిత్‌ రికార్డు సమం చేస్తాడా?

నేటి మ్యాచ్‌లో గెలిచి ధోనీ ఈ సారి టైటిల్‌ అందిస్తే అత్యధికసార్లు (5) జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డును సమం చేస్తాడు. ముంబయి ఇండియన్స్‌ను రోహిత్‌ ఐదుసార్లు విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ చెన్నై ఓడిపోయి గుజరాత్‌ ఛాంపియన్‌గా నిలిస్తే వరుసగా రెండు సీజన్లలో తన జట్టుకు టైటిల్‌ అందించిన మూడో కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య రికార్డు సష్టిస్తాడు. 2010,2011లో ధోనీ, 2019, 2020లో రోహిత్‌ శర్మ కెప్టెన్లుగా టైటిల్స్‌ అందించారు.
ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ గుజరాత్‌, చెన్నైల మధ్యే జరిగింది. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచూ వీరి మధ్య జరగనుండటం విశేషం. మరి ధోనీ సేన ఐదో విజయం సాధిస్తుందా..? హార్దిక్‌ సేన టైటిల్‌ను తనవద్దే ఉంచుకుంటుందా..? కొన్ని గంటల్లో తేలిపోనుంది.