- 4 విలీన మండలాల్లోని 156 గ్రామాల్లో ముగిసిన పాదయాత్ర
ప్రజాశక్తి- ఎటపాక విలేకరి, రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం నిర్వాసితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సోమవారం బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభకు ప్రధాన వక్తగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, వక్తలుగా మాజీ ఎంపి, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ మిడియం బాబూరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం హాజరు కానున్నారు. గడిచిన రెండు నెలల్లో నాలుగుసార్లు గోదావరి నదికి వరద వచ్చింది. వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. 45 రోజులకుపైగా కొండలపై, గుట్టలపై తలదాచుకున్నాయి. వరదలు తగ్గినా ఆ తర్వాత విషజ్వరాలు విజృంభించి పలువురు మృతి చెందారు. పునరావాసం, ప్యాకేజీ చెల్లించి నిర్వాసితులను అక్కడి నుంచి తరలించకుండా పోలవరం నిర్మాణం చేపట్టడమే ఈ దుస్థితికి కారణం. ఈ నేపథ్యంలో సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాడు నాగేశ్వరరావు, ఎం.వాణిశ్రీ పర్యవేక్షణలో నాలుగు మండలాల్లో సిపిఎం శ్రేణులు విస్తృతంగా పర్యటించాయి. 156 గ్రామాల్లో విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశాయి.
పార్టీలకతీతంగా పాదయాత్రకు మద్దతు
గోదావరి వరదల విధ్వంసంతో అల్లాడిన ముంపు గ్రామాల ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించేందుకు ముంపు మండలాల్లోని గ్రామాల్లో సిపిఎం నాయకులు విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. పార్టీలకతీతంగా నిర్వాసితులు వారికి మద్దతు తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఎటపాక మండలంలోని 120 గ్రామాల్లో 57 గ్రామాలు ముంపునకు గురయాయ్యయి. 56 గ్రామాల్లో ఆరు రోజులపాటు సిపిఎం పాదయాత్ర సాగింది. విఆర్.పురం మండలంలోని 72 గ్రామాలకుగాను 56 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. నాలుగు రోజులపాటు 30 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. కూనవరం మండలంలో ఐదు రోజులపాటు 45 గ్రామాల్లో సిపిఎం బృందాలు పాదయాత్ర చేశాయి. చింతూరు మండలంలో నాలుగు రోజుల్లో 25 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. పోలవరం నిర్వాసితుల పక్షాన ప్రభుత్వాలను నిలదీసే పార్టీ సిపిఎం అంటూ ప్రజలు కొనియాడారు.
ఆపద సమయంలో అండగా సిపిఎం
ప్రజాపోరాటాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలను సైతం నిర్వహించి పోలవరం నిర్వాసితులకు సిపిఎం అండగా నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూనే నాలుగు మండలాల్లో పనుల్లేక పస్తులున్న ముంపు గ్రామాల ప్రజలకు భోజన సదుపాయాన్ని కల్పించింది. వరదలతో అనారోగ్యం పాలైన వారిని మెడికల్ క్యాంపుల ద్వారా ఆదుకుంది. నిత్యావసర సరుకులు అందించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎంపి పి.మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు రెండు దఫాలుగా నాలుగు మండలాల్లో పర్యటించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం నాలుగు మండలాల్లో నిరంతరం పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. నాలుగు మండలాల్లో వరద నష్టాన్ని, ప్రజల కష్టాలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గంగా పలు డిమాండ్లను సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వం ముందుంచింది. ప్రకృతి విపత్తు కన్నా పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల కలిగిన వినాశనమే ఎక్కువని భావించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు పునరావాసం, పరిహారం పూర్తిగా చెల్లించే వరకూ ప్రజల పక్షాన పోరాటానికి రూపకల్పన చేసింది.
ఇవీ డిమాండ్లు
- కాంటూరు లెక్కలను పక్కనపెట్టి పోలవరం ప్రాజెక్టు ఎనిమిది మండలాల్లో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం చెల్లించాలి.
- 1986, 2022 వరదలను ప్రామాణికంగా తీసుకొని రీ సర్వే చేసి ముంపు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ చెల్లించాలి.
- పునరావాసం కల్పించే వరకు ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలి.
- ఇటీవల వరదల్లో మునిగిన పునరావాస కాలనీలకు ప్రత్యామ్నాయంగా ముంపులేని చోట పునరావాస కాలనీలు నిర్మించాలి.
- 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 25 మౌలిక సదుపాయాలతో పునరావాస కాలనీలు నిర్మించాలి.
- పునరావాస కాలనీలకు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. పాత కటాఫ్ తేదీలను రద్దు చేయాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు చెల్లించాలి.
- భూమికి భూమి ఇచ్చే ప్రాంతం సారవంతమైనదై ఉండాలి. వివాదాలు లేనిదై ఉండాలి.
- మునిగిపోయే భూమికి ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి.
- గతంలో భూములకు లక్షా 15 వేల రూపాయలు చెల్లించిన వారికి ముఖ్యమంత్రి జగన్ హామీ ప్రకారం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి.
- ముంపు ప్రాంతాల్లోని చదువుకున్న యువతీ యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇవ్వాలి.
- తక్షణం మునిగిపోతున్న గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి.
- ఎటపాక మండలం ముంపు గ్రామాల్లో రహదారుల వెంట ఎత్తయిన స్తంభాలు వేసి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి. నందిగామ నుండి కాటుకపల్లి వరకు, మురుమూరు నుండి తాటిలంక వరకు ప్రత్యామ్నాయ రహదారిని పునరుద్ధరించాలి.
- పిహెచ్‌సిలలో డాక్టర్లను నియమించాలి.
- పంట నష్టపోయిన వారికి, పంటలు వేయలేని వారికి నష్టపరిహారం చెల్లించాలి. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించాలి.
- విఆర్.పురం మండలం పెద్దమట్టపల్లి నుంచి నర్సింగపేట వరకు, పెద్ద మట్టపల్లి నుంచి బురుగువాడ వరకు, తెల్లవారి గూడెం నుంచి గుల్లేటివాడ వరకు తవ్వి వదిలేసిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలి.
- కందలూరు నుంచి తులసిపాక వరకు, వీరపాపన్నకుంట నుంచి లక్ష్మీనగరం వరకు నూతన రోడ్లు వేయాలి.
- వరదల్లో పూర్తిగా నష్టపోయిన ఇళ్లకు మూడు లక్షల రూపాయలు, పాక్షికంగా నష్టపోయిన ఇళ్లకు లక్ష రూపాయలు తక్షణమే చెల్లించాలి.










