Aug 21,2023 09:37

కేరళ కొచ్చిలోని ఓ హోటల్‌లో సుస్మిత పనిచేస్తోంది. బతుకుతెరువు కోసం మణిపూర్‌ నుండి కేరళకు ఆమె వలసొచ్చింది. 7 నెలల క్రితమే ఈ పనిలో చేరి ఎంతో ప్రతిభ చూపుతోంది. కష్టం తెలిసిన మనిషిలా.. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనతో ఉండే ఆమెను హోటల్‌ సిబ్బంది ఎంతో అభిమానించేవారు. ఆ రోజు.. ఎప్పుడూ సరదాగా ఉండే తను ఎందుకో చాలా నిరాశగా కనిపించింది. ఏదో బెంగ ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అది గమనించిన హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ చూస్తూ ఊరుకోలేకపోయారు. విషయం అడిగి తెలుసుకుని ఆమె బాధను తీర్చాడు.. ప్రముఖ చెఫ్‌ పిళ్లై తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుస్మిత కథ ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. అదేంటో మనమూ తెలుసుకుందాం.

             భర్తను కోల్పోయిన తల్లి, ఇద్దరు ఆడబిడ్డలను పెంచేందుకు ఎంతో శ్రమపడింది. అమ్మను ఇక కష్టపెట్టడం ఇష్టం లేని పెద్ద కూతురు సుస్మిత చదువు పూర్తవ్వగానే ఉద్యోగం వెతుక్కుంటూ వేల కిలోమీటర్లు దాటి కేరళ కొచ్చికి చేరుకుంది. తన సంపాదన మీదే కుటుంబం జీవిస్తోంది. సాఫీగా సాగిపోతున్న వాళ్ల జీవితంలో మణిపూర్‌ మారణహోమం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. మే 3న చెలరేగిన మణిపూర్‌ అల్లకల్లోలంలో సుస్మిత అమ్మ, చెల్లి చిక్కుకుపోయారు. ఆ అల్లర్లలో తన తల్లి, చెల్లి ప్రాణాలను ఎక్కడ కోల్పోతానోనని సుస్మిత బెంగ పడింది. తను వెళ్లలేదు. వాళ్లను ఇక్కడకు రప్పించడం తెలియదు. వాళ్లనే తలచుకుంటూ.. తన నిస్సహాయతను నిందించుకుంటూ ఆ రోజు దిగులుగా ఉంది. ఇదంతా మేనేజర్‌తో చెప్పుకుంది. తన కష్టం విన్న మేనేజర్‌ తన సిబ్బందితో సుస్మిత అమ్మ, చెల్లి కొచ్చికి వచ్చే ఏర్పాట్లు చేయమన్నారు. దీనంతటికీ ముందు.. సుస్మిత గురించి మరో విషయం మనం చెప్పుకోవాలి. ఏడు నెలల వ్యవధిలో సుస్మిత మూడు సార్లు 'ఉత్తమ ఉద్యోగి' అవార్డును సాధించింది.
            మణిపూర్‌లో రోజురోజుకూ పరిస్థితులు చేయిదాటుతున్న వేళ.. హోటల్‌ సిబ్బంది ఏమాత్రం ఆలోచించకుండా.. ఆగమేఘాల మీద సుస్మిత అమ్మా, చెల్లి కొచ్చికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు వచ్చాక కూడా వసతి చూశారు. అంతేకాదు, కొన్ని రోజుల తరువాత వారిద్దరినీ హోటల్‌కు రమ్మని ఇంటర్య్వూ చేశారు. 'వాళ్లు ఇప్పటి వరకు మణిపూర్‌ వదిలి బయటకు రాలేదు. వాళ్లకు హిందీ, ఇంగ్లీషు రెండూ తెలియదు. అయినా వాళ్లు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం తెలియదన్నారు. వాళ్లకు ఏదైనా పని అప్పజెప్పితే బాధ్యతగా చేస్తారనిపించింది. సుస్మిత చెల్లిని హోటల్‌లో ట్రైనీ చెఫ్‌గా, ఆమె తల్లిని సిబ్బందికి సహాయకురాలిగా నియమించాం. ఇప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా, రక్షణలో నివసిస్తోంది. ఇప్పుడు సుస్మిత ముఖంలో కూడా మునుపటి సంతోషం, ఉల్లాసం చూస్తున్నాం' అంటూ చెఫ్‌ పిళ్లై తన ఇన్‌స్టాలో ఈ స్టోరీని షేర్‌ చేశారు. షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే సిబ్బంది పట్ల పిళ్లై హోటల్‌ యాజమాన్యం చూపించిన దయాగుణానికి ఎంతోమంది అభిమానిస్తున్నారు.