
నడుస్తుంటే
నీడ వెంటాడుతున్న భయం
వెన్నుపూసల నిండా
తేళ్లు జెర్రులూ పాముల పరుగు
ఏ అడుగు దగ్గరైనా సరే
గుండె పేలిపోవచ్చు...
శరీరం కణ విచ్ఛిన్నం కావొచ్చు..
తొడ తొక్కినందుకో
తోక తొక్కినందుకో
అకారణంగానే కత్తి కాటేయొచ్చు
నడుస్తూ నడుస్తూనే కాళ్లు
తొడలు దాకా విరిగిపోవొచ్చు...
ఎప్పుడెక్కడెందుకేం జరుగుతుందో
ఎవడికీ ఎప్పటికీ అర్థం కాదు
ఎదుట చిర్నవ్వు అర్థం కాని రాక్షసి మాయ
విస్ఫోటించడానికి సిద్ధమైన చేమంతి
గొంతుపైన కాలం కత్తి
గడియారం పెండ్యూలమ్‌లా
రాత్రింబవళ్లు పహారా కాస్తుంది
ఇంట్లో, ఆఫీసులో, రోడ్డుమీద
ఆకాశం కిందా, భూమి పైనా
ఎక్కడా సేఫ్టీరేంజ్ వుండదు
సెల్ఫోన్ మోగినా
ప్రాణం ఎండుటాకులా వొణుకుతుంది
చీకటి- శత్రువు విసిరిన
స్పర్శ లేని వలలా పర్చుకున్నప్పుడు
భయం శ్వాసగా మారిపోతుంది...
మృత్యులోయ కత్తుల వంతెన పైన
కాలి నడకైపోయింది జీవితం
కలలు కనే సమయం లేదు!
- ఈతకోట సుబ్బారావు
94405 29785