Mar 10,2023 08:55
  •  ఫలించని అధికారుల ప్రయత్నాలు..

ప్రజాశక్తి-నంద్యాల : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామం వద్ద కనిపించిన నాలుగు కూనలను తల్లి పులి దరికి చేర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ ఆపరేషన్‌ను ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. పులి పిల్లలను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జులాజికల్‌ పార్కుకు గురువారం రాత్రి తరలించారు. నాగార్జునసాగర్‌ - శ్రీశైలం పులుల అభయారణ్యం ఎఫ్‌డీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బుధవారం రాత్రి అటవీ ప్రాంతంలో ఎన్‌క్లోజర్‌లో పులిపిల్లలను పెట్టి ఎదురుచూసినా తల్లి రాలేదనితెలిపారు. మనుషులు ముట్టుకున్నారన్న కారణంతో పిల్లల వద్దకు వచ్చేందుకు తల్లి ఇష్టపడటం లేదని భావిస్తున్నామన్నారు. రెండేళ్ల తర్వాత వాటిని మళ్లీ నల్లమలలో విడిచిపెడతామని వెల్లడించారు. వీటి తల్లి టి-108.. నల్లమల అరణ్యంలోనే సంచరిస్తోందని అధికారులు తెలిపారు. అది ఆరోగ్యంగానే ఉందని, పులి పిల్లలు లభించిన ప్రాంతంతో పాటు ముసలిమడుగు గ్రామ పరిసరాలు, నీటికుంట ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు.