
చింటూ ఏడవ తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి మార్కులు తెచ్చుకొనేవాడు. దసరా సందర్భంగా ఈ సారి వాళ్ల బడిలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. బొమ్మలు గీయడంలో చింటూకు గొప్పగా నైపుణ్యం లేదు. సైన్స్ నోటు పుస్తకంలో వేయవలసిన బొమ్మలు కూడా చాలా కష్టపడి వేసేవాడు.
డ్రాయింగ్ మాస్టారు వచ్చి చిత్రలేఖన పోటీలకు పేర్లు తీసుకొంటున్న సమయాన చింటూ మౌనంగా వున్నాడు. అప్పుడు 'చింటూ, పోటీలో పెద్దగా కష్టమైన బొమ్మలు వేయమని చెప్పరు. నువ్వు కూడా ప్రయత్నించు' అని అక్కడే ఉన్న సైన్స్ మాష్టారు అన్నారు.
మాస్టారు మాట విని చింటూ పేరు ఇచ్చాడు. పోటీ రోజు వచ్చింది. అందరికీ డ్రాయింగ్ పేపర్లు ఇచ్చారు. 'పిల్లలూ, పులి బొమ్మ చిత్రించి, ఆ బొమ్మ గురించి రెండు వాక్యాలు రాయండి. అదే మీ టాస్క్' అన్నారు డ్రాయింగ్ మాస్టారు. బొమ్మలు గీసే అలవాటు లేని చింటూ పులి బొమ్మను ఎలా గీయాలో అర్థం కాక తనకు వచ్చినట్లు వేస్తున్నాడు. కాసేపటికి 'ఇంకా ఐదు నిమిషాలు సమయం మాత్రమే వుంది' అని మాస్టారు గుర్తు చేశారు.
అప్పుడు చింటూ తల ఎత్తి చూసాడు. అప్పటికే సగం మంది పిల్లలు బొమ్మగీయడం పూర్తి చేసి వెళ్లిపోయారని గుర్తించాడు. తనేమో ఇంకా బొమ్మ పూర్తి చేయలేదు. పైగా రంగులు కూడా వేయలేదు. 'బొమ్మ పూర్తవ్వాలంటే కనీసం అర్ధగంట పైన పడుతుంది. ఎలా?' అనుకొంటూ వేసిన బొమ్మను పరీక్షగా చూసాడు. ఆ పులి బొమ్మ పిల్లిలాగా కనబడుతోంది. ఇక నాలుగు నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ బొమ్మ కింద రెండు వాక్యాలు రాసి మాస్టారుకి పేపరు ఇచ్చి బయటకి వచ్చాడు.
మరుసటి రోజు బహుమతులు ప్రకటించారు. చింటూకు ప్రత్యేక బహుమతి ఇస్తున్నట్లు చెప్పారు. చింటూ లోలోన సంతోషపడుతూనే ఆశ్చర్యపోయాడు. బహుమతులు పొందిన డ్రాయింగ్స్ అందరూ చూడటానికి అనువుగా బోర్డు మీద తగిలించారు.
చింటూ వేసిన పిల్లి (పులి) బొమ్మ కూడా అందులో ఉంది. దాని కింద 'ఈ పులి భూమి మీదకు వచ్చి బడిపిల్లలు తినే జంక్ ఫుడ్ తినడం వలన మునుపటి శక్తిని కోల్పోయి పిల్లి లాగా మారిపోయింది' అని రాసి వుండటం చూసి, 'మంచి నీతి ఉన్న బొమ్మ గీసావు చింటూ' అని అక్కడున్న వారందరూ చింటూని అభినందించారు.
- ఓట్ర ప్రకాష్ రావు,
097874 46026.