ముంబయి : బాలీవుడ్ ప్రముఖ హీరో షారుక్‌ఖాన్‌కు చంపేస్తామంటూ .... బెదిరింపు లేఖలు ముంబయిలోని షారుక్ ఇంటి మన్నత్‌కు వచ్చాయి. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్ నేపథ్యంలో మరింత భద్రత కల్పించాల్సిందిగా షారుక్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. షారుక్‌కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. దాన్ని వై-ప్లస్ కేటగిరీగా మారుస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించింది. వారు మూడు షిఫ్టుల్లో షారుఖ్‌కు భద్రత కల్పించనున్నారు. ఇక మరోవైపు కొందరు వ్యక్తులు షారుక్ ఫొటోలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ నటించిన రెండు చిత్రాలు జవాన్, పఠాన్ భారీ కలెక్షన్‌లతో రికార్డులు సృష్టిస్తున్నాయి. వీటి తర్వాత షారుక్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపేస్తామంటూ ముంబయిలోని ఆయన నివాసం మన్నత్‌కు పలు లేఖలు వచ్చాయి.










