
పిల్లలూ, మీకు తెలుసు కదా? ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజైన ఈ రోజే ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా?
తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగు దంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు 1888 సెప్టెంబరు 5న రాదాకృష్ణన్ జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తిరుత్తణిలోనే గడిచాయి. తిరుపతి, నెల్లూరులలో కూడా విద్యాభ్యాసం సాగింది. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదివి ఎం.ఏ పట్టా పొందారు. 18 ఏళ్ల వయసులో శివకామమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు. చాలాపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఉన్నత విద్య చదివే స్థోమత లేక ఉపకార వేతనాలతోనే విద్యాభ్యాసం కొనసాగించారు. అరిటాకు కొనలేని పరిస్థితుల్లో నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. రోజులో 12 గంటల.పాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాశారు. ఆంధ్రా, బెనారస్ విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతి (వైస్ ఛాన్స్‌లర్)గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు కూడా. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ఆయన నామినేట్ అయ్యారు. 1952 నుంచి 1962 మధ్య ఉప రాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకూ రాష్ట్రపతిగా పనిచేశారు.
ఉపాధ్యాయులందరూ ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే ఓ సంఘటన రాధాకృష్ణన్ ఉపాధ్యాయ జీవితంలో జరిగింది. మైసూర్‌లోని మహారాజా కళాశాల నుంచి రాధాకృష్ణన్ బదిలీ అయినప్పుడు- విద్యార్థులు ఆయన్ని అందంగా ముస్తాబు చేసిన గుర్రపు బండిపై ఊరేగించాలని భావించారు. సర్వేపల్లిని కూడా ఒప్పించారు. అయితే సమయానికి గుర్రం కనిపించకుండా పోయింది. అప్పుడు విద్యార్థులు తమ భుజాలపై రాధాకృష్ణన్‌ను ఊరేగింపుగా రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు.
గొప్ప అధ్యాపకుడిగా, మానవతావాదిగా, తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రస్థానం బహుముఖాలుగా సాగింది. భారత ప్రభుత్వం ఆయనను 'భారతరత్న' పురస్కారంతో గౌరవించింది. అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి, రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన కృషికి గుర్తింపుగా ఆయన పుట్టిన రోజైన సెప్టెంబరు 5వ తేదీని 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.